Andhra Pradesh Debits: ఏపీ.. అప్పులకుప్ప
ABN, Publish Date - Jul 27 , 2024 | 03:51 AM
Andhra Pradesh Debits: జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జాడే లేదు. పాత పథకాలకే పేర్లు, అమలు తీరు మార్చి ‘బటన్’ నొక్కడం మినహా పెద్దగా చేసిందేమీ లేదు.
మొత్తం రుణాలు రూ.9.74 లక్షల కోట్లు
ఏడాదికి చెల్లించాల్సిన అసలు, వడ్డీ 71,881 కోట్లు
100 ఆదాయానికి రూ.113 ఖర్చు
పెండింగ్ బిల్లులు 1.35 లక్షల కోట్లు
అడ్డగోలుగా అప్పులు.. ప్రభుత్వ ఆస్తుల తాకట్టు
ప్రజలపై చార్జీలు, పన్నుల బాదుడు
33 ప్రభుత్వ శాఖల నుంచి నిధుల మళ్లింపు
పోలవరంపై నిర్లక్ష్యంతో 53 వేల కోట్ల నష్టం
అమరావతి ధ్వంసంతో 2-3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం
ఇంకా సమాచారం రావాల్సి ఉందని సీఎం వ్యాఖ్య
ఎమ్మెల్యేలు వచ్చి తమ ప్రాంతాలకు రోడ్లు అడుగుతుంటే ఏమీ చేయలేకపోతున్నాను. నా జీవితంలో ఇలా వెనక్కి పంపడం ఇదే మొదటిసారి. ఇదంతా జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే. పీపీపీ, వీజీఎఫ్ విధానంలో రోడ్లు వేయాలన్న ఆలోచన ఉంది.
- చంద్రబాబు
అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జాడే లేదు. పాత పథకాలకే పేర్లు, అమలు తీరు మార్చి ‘బటన్’ నొక్కడం మినహా పెద్దగా చేసిందేమీ లేదు. అయినా అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు రూ.9.74 లక్షల కోట్లు! తేలాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. జగన్ ఐదేళ్ల విధ్వంసకర పాలనలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇంకా తవ్వాల్సినవి ఉన్నాయని, పూర్తి సమాచారం రాలేదని తెలిపారు. అప్పులు, బకాయిల వివరాలు అసలూ వడ్డీ చెల్లింపులు, పెండింగ్ బిల్లులు తదితర వివరాలు వెల్లడించారు. పెండింగ్ బిల్లులు మొత్తం రూ.1.35 లక్షల కోట్లు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. 2024-25లో అప్పుల అసలు, వడ్డీ కలిపి రూ.71,881 కోట్లు చెల్లించాలని తెలిపారు. విభజన నష్టాలు, ఆ తర్వాత టీడీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిన తీరు, 2019 తర్వాత వైసీపీ హయాంలో రాష్ట్రం వెనుకబడ్డ తీరును చంద్రబాబు వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబు మాటల్లోనే...
నిధులు మళ్లించి.. పన్నులు పెంచి..
విభజన తర్వాత తలసరి ఆదాయం ఏపీలో రూ.93,903కు తగ్గింది. తెలంగాణలో ఒక్కసారిగా రూ.1,24,104కు చేరుకుంది. తర్వాతి ఐదేళ్లూ తెలంగాణతో సమానం అయ్యేందుకు ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేశాం. పట్టిసీమ లిఫ్ట్ వల్ల ఇరిగేషన్‌కు రూ.44,000 కోట్ల ఆదాయం వచ్చింది. పోలవరం కోసం రూ.15,364 కోట్లు ఖర్చు చేశాం. 2019లో కూడా మేము అధికారంలోకి వచ్చుంటే ఇప్పటికే అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా మారి ఉండేది. 7 లక్షల మంది ఉద్యోగులు అమరావతిలో ఉండేవారు. 3 నుంచి 4 లక్షల కోట్ల ఆస్తి అమరావతితో వచ్చేది. 2014-19 మధ్య తలసరి ఆదాయం 13.2శాతం పెరిగింది. ఇప్పుడు విద్యుత్ రంగంలోనే అప్పులు రూ.1.29 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు మళ్లించారు. విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, పన్నులు, ఇసుకపై పన్నులు పెంచారు. ప్రస్తుతం అప్పు రూ.9.74 లక్షల కోట్లకు చేరింది. తలసరి అప్పు రూ.1,44,336కు చేరింది. టీడీపీ హయాంలో ఇది రూ.74,790గా ఉండేది.
డబ్బులు ఊడ్చేశారు..
గత ప్రభుత్వంలో 33 ప్రభుత్వ శాఖల నుంచి డబ్బులు లాగేశారు. ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ నుంచి రూ.400 కోట్లు తీసుకున్నారు. విశాఖలో ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. మిగిలిన భూములను కబ్జా చేశారు. వీటి విలువ రూ.40,000 కోట్లు. అభయహస్తం కింద ఉన్న డ్వాక్రా మహిళల డబ్బును కూడా కొట్టేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఐఏఎ్‌సలు, సీఎస్ కోర్టు ముందుకెళ్లి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. కొందరికి జైలు శిక్ష కూడా పడింది. పెండింగ్ బిల్లులు రూ.1.35 లక్షల కోట్లుగా తేలాయి.
రూ. 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్..
ఒక్క వ్యక్తి ఆనందం కోసం రూ.500 కోట్లతో విశాఖ రుషికొండలో ప్యాలెస్ కట్టారు. ఈ 500 కోట్లు టూరిజంలో ఖర్చు చేస్తే వేలకోట్ల ఆదాయం వచ్చేది. నేను 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను. కానీ, ఈ తరహాలో ప్యాలెస్ కట్టాలన్న ఆలోచన ఎన్నడూ రాలేదు.
విధ్వంసాన్ని ప్రతిబింబించిన శ్వేత పత్రాలు..
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఆర్థిక, సామాజిక విధ్వంసంపై కొత్త ప్రభుత్వం మొత్తంగా ఏడు శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఆయా అంశాల్లో పరిస్థితులను ప్రజల ముందుంచేందుకు వీలుగా శ్వేతపత్రాలను ప్రకటిస్తామని చంద్రబాబు ముందే ప్రకటించారు. అమరావతి, పోలవరం, విద్యుత్తు, సహజ వనరులు, మద్యం, శాంతి భద్రతలు, ఆర్థికంపై వాస్తవాలను ప్రజలముందుంచారు. వీటిలో... నాలిగింటిని విలేకరుల సమావేశాల్లో, మిగిలిన మూడింటిని అసెంబ్లీ వేదికపై విడుదల చేశారు. అయితే... అధికార వర్గాల నుంచి ఇంకా పూర్తి సమాచారం రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబే పేర్కొన్నారు. సహజ వనరులకు జరిగిన దోపిడీలో సంబంధిత శాఖల నుంచి సమాచారం రాబట్టడానికి ఉన్నతాధికారులు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆర్ధిక శాఖలో పెండింగ్ బిల్లుల సమాచారం రాబట్టడం కొత్త ప్రభుత్వానికి తలకుమించిన భారమైంది.
జగన్ నిర్వాకంతో నష్టాలు..
ఐదేళ్లలో మూలధన వ్యయం 60 శాతానికి తగ్గింది. కేంద్రం రూ.15,000 కోట్లు ఇస్తే మనం సంబరపడిపోయాం. ఈరోజు అందుకోలేనంత దూరం అప్పుల విషయంలో వెళ్లిపోయాం.
ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చే ప్రతి రూ.100 ఆదాయానికి ఖర్చు రూ.113 ఉంది.
2024-25 రెవెన్యూ లోటు రూ.1.46,909 కోట్లకు చేరుతుంది.
పోలవరాన్ని పట్టించుకోకపోవడం వల్ల రూ.53,000 కోట్ల నష్టం వాటిల్లింది.
అమరావతిపై జగన్ విధ్వంసం వల్ల 7 లక్షల ఉద్యోగాలు పోయాయి. రూ.2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోయింది.
రూ.32,000 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచారు. పీపీఏ ఒప్పందాలు రద్దు చేయడం వల్లనే ప్రజలపై ఈ భారం పడింది.
పీపీఏ ఒప్పందాల రద్దుపై కోర్టుకు వెళ్తే వారికి రూ.9,000 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత యూనిట్ రూ.9కు విద్యుత్ కొన్నారు.
ఇసుకలో రూ.7,000 కోట్లు, గనుల్లో రూ.10,000 కోట్లు దోచుకున్నారు.
ఎక్సైజ్‌లో జగన్ విధానాల వల్ల రూ.17,000 కోట్ల నష్టం జరిగింది.
జగన్ సర్కారు రాగానే ప్రజావేదికను కూల్చేశారు.
పరిస్థితి బాగలేకున్నా...
ఆర్థిక పరిస్థితి సహకరించనప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేసున్నాం. ఆగస్టు 15వ తేదీన 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు.
పీపీపీ, వీజీఎఫ్ విధానంలో రోడ్లు వేయాలన్న ఆలోచన ఉంది. టోల్ గేట్లు పెట్టి లారీలు, కార్లు, బస్సులకు మాత్రమే టోల్ వసూలు చేసి ఆ డబ్బు ను వీజీఎఫ్ కింద అందించాలన్న యోచనలో ఉన్నాం.
రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగలేదు. కానీ జగన్‌తో సహా వైసీపీ నేతల ఆదాయం లక్షల రెట్లు పెరిగింది. జగన్ హయాంలో జరిగిన అవినీతి విధానాలను అంతర్జాతీయ యూనివర్సిటీల్లో కేస్ స్టడీస్‌గా తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.
- చంద్రబాబు
Also Read:
పంచాయతీల్లో బ్లీచింగ్‌కూ డబ్బుల్లేవు
ఒలింపిక్స్‌పై కుట్ర
జగన్ పత్రికకు జనం సొమ్ము
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jul 27 , 2024 | 07:27 AM