Share News

Visakha Sarada Peetham: శారదా పీఠానికి మరో షాక్‌..

ABN , Publish Date - Oct 25 , 2024 | 04:34 AM

విశాఖ శారదా పీఠానికి రాష్ట్రప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. తిరుమలలో ఈ పీఠానికి జగన్‌ సర్కారు ‘అక్రమంగా’ కట్టబెట్టిన అదనపు స్థలం కేటాయింపును రద్దు చేసింది. అంతేగాక శారదా పీఠం ఆక్రమించిన ఈ స్థలంలో నిర్మాణాల విషయంలో నియమ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.

Visakha Sarada Peetham: శారదా పీఠానికి మరో షాక్‌..

  • తిరుమలలో అక్రమ, అదనపు స్థలం కేటాయింపు రద్దు

  • గతంలో 20 వేల చదరపు అడుగుల ఆక్రమణ

  • అందులో అనుమతి లేకుండా నిర్మాణాలు

  • అక్రమాన్ని క్రమబద్ధీకరించిన జగన్‌

  • నాటి టీటీడీ బోర్డు నిర్ణయం.. సర్కారు ఓకే

  • తాజాగా ఈ ప్రతిపాదనలు రద్దు

  • ఆక్రమిత స్థలంలో నిర్మాణాల విషయంలో

  • చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఆదేశం

తిరుపతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): విశాఖ శారదా పీఠానికి రాష్ట్రప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. తిరుమలలో ఈ పీఠానికి జగన్‌ సర్కారు ‘అక్రమంగా’ కట్టబెట్టిన అదనపు స్థలం కేటాయింపును రద్దు చేసింది. అంతేగాక శారదా పీఠం ఆక్రమించిన ఈ స్థలంలో నిర్మాణాల విషయంలో నియమ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. తిరుమలలో శారదా పీఠం గతంలో తనకు టీటీడీ కేటాయించిన 5 వేల చదరపు అడుగుల స్థలం గాక అదనంగా 20 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించింది. అందులో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది. గత ప్రభుత్వంలో నాటి టీటీడీ బోర్డు ఈ స్థలాన్ని క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకోగా, సర్కారు యథాతథంగా ఆమోదించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను రద్దు చేసింది. 2007లో తిరుమలలో హిందూ మతానికి సంబంధించిన 31 మఠాలు, పీఠాలు, సత్రాలు తదితర ధార్మిక సంస్థలకు టీటీడీ స్థలాలు కేటాయించింది. విశాఖ శారదా పీఠానికి కూడా తిరుమల గోగర్భం డ్యామ్‌ సమీపంలో 5 వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుపై కేటాయించింది.

అయితే ప్రారంభంలోనే శారదా పీఠం తమకు కేటాయించిన స్థలానికి మించి ఆక్రమించింది. అనుమతికి మించి కట్టడాలు కూడా నిర్మించింది. 2019 ప్రారంభంలో టీటీడీ అధికారులు 31 మఠాలు, సత్రాలకు గానూ కొన్నింటిలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విశాఖ శారదా పీఠం, శ్రీరంగనాథస్వామి మఠం, శ్రీ సిద్ధేశ్వరీ పీఠం-మౌనస్వామి మఠం కేటాయించిన దానికంటే ఎక్కువగా టీటీడీ స్థలాలను ఆక్రమించినట్టు తేలింది.


ఆయా మఠాలు తమ భవనాల వెనుక భాగంలో అదనంగా స్థలాలను ఆక్రమించడంతో పాటు ఆక్రమిత స్థలాల్లో అనుమతి లేకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. దీంతో టీటీడీ అధికారులు కొండపై ఉన్న మొత్తం 31 మఠాలు, సత్రాలలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టారు. విశాఖ శారదా పీఠం తనకు కేటాయించిన 5 వేల చదరపు అడుగులకు అదనంగా మరో 2,150 చదరపు అడుగులు ఆక్రమించినట్టు తేలింది. ఈ స్థలాన్ని టీటీడీ క్రమబద్ధీకరించే సమయానికి ఆశ్చర్యకరంగా 2150 చదరపు అడుగుల అదనపు స్థలం కాస్తా 20 వేల అడుగులకు పెరిగిపోయింది.

  • అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన

తిరుమలలో విశాఖ శారదా పీఠం నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. 2007లో చేపట్టిన తొలి నిర్మాణంలోనే అడ్డగోలుగా వ్యవహరించారు. సెల్లార్‌ 1లో వాస్తవానికి టీటీడీ ఎలాంటి అనుమతీ ఇవ్వకపోయినా 272 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపట్టారు. సెల్లార్‌ 2లో 25 చదరపు మీటర్లలో నిర్మాణానికి అనుమతి ఇస్తే 334 చదరపు మీటర్లు అదనంగా నిర్మాణాలు చేపట్టారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 238 చదరపు మీటర్లలో నిర్మాణాలకు అనుమతి ఉండగా అంతకంటే 124 చదరపు మీటర్లలో అదనంగా కట్టడాలు చేపట్టారు. మొదటి అంతస్థులోనూ 238 చదరపు మీటర్లకు అనుమతి ఇవ్వగా, అదనంగా 124 చదరపు మీటర్లలో కట్టేశారు.

రెండో అంతస్థులో కూడా అనుమతి ఇచ్చిన దానికి మించి 124 మీటర్లలో కట్టడాలున్నాయి. మూడో అంతస్థులో ఎలాంటి అనుమతి లేకపోయినా 182 చదరపు మీటర్లలో నిర్మాణాలున్నాయి. టీటీడీ ఈ భవనంలో మొత్తం 740 చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వగా, శారదా పీఠం నిర్వాహకులు మాత్రం 1905 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపట్టారు. అంటే... అనుమతి ఇచ్చిన దానికంటే 1165 చ.మీటర్లు అదనంగా నిర్మాణాలు చేశారు. దానికి తోడు సెల్లార్‌ 1, మూడో అంతస్థు అక్రమంగా నిర్మించారు.


  • భవన విస్తరణలోనూ అదే తీరు

2007లో నిర్మించిన తొలి భవనాన్ని విస్తరించే క్రమంలో 2023లో చేపట్టిన నిర్మాణాల్లోనూ అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టారు.మొత్తంగా 937 చదరపు మీటర్లకు ప్లాన్‌ అప్రూవల్స్‌ ఉండగా... 685 చదరపు మీటర్లు ఎక్కువగా మొత్తం 1622 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేశారు. శారదా పీఠం ఆక్రమించుకున్న స్థలాన్ని రెగ్యులర్‌ చేయడం కోసం టీటీడీ అధికారులు 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వ ఒత్తిడితో నాటకీయంగా వ్యవహరించారు. స్థలాలు ఆక్రమించిన అన్ని మఠాలు, పీఠాలు, సత్రాలకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత ఆక్రమణలు తొలగించాలని అందులో పేర్కొన్నారు. అయితే శారదా పీఠంతో పాటు మరో రెండు మఠాలు తప్ప మిగిలిన సత్రాలు, మఠాలు, పీఠాలు స్పందించలేదని అధికారులు బోర్డుకు నివేదించారు.

శారదా పీఠం నిర్వాహకులు తాము ఆక్రమించుకున్న స్థలం తమ పీఠానికి తప్ప ఇతరులకు పనికి రాదని, జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆక్రమిత స్థలంలో భక్తుల కోసం నిత్యాన్నదాన భవనం నిర్మించామని చెబుతూ స్థలాన్ని క్రమబద్ధీకరించాలని కోరినట్టు అధికారులు బోర్డుకు నివేదించారు. ఎస్టేట్స్‌ కమిటీ కూడా ఇదే సిఫారసు చేయడంతో రూ.26 లక్షలు జరిమానా విధించి అప్పట్లో స్థలాన్ని క్రమబద్ధీకరించేశారు. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పనిచేసిన టీటీడీ బోర్డు కూడా విశాఖ శారదా పీఠానికి అనుకూలంగా కొన్ని తీర్మానాలు చేసింది. చివరగా భూమన కరుణాకర రెడ్డి అధ్యక్షతన పనిచేసిన బోర్డు శారదా పీఠానికి అదనపు స్థలం రెగ్యులర్‌ చేస్తూ (26-12-2023, తీర్మానం నంబరు 443) నిర్ణయం తీసుకుంది. దాన్ని అమలు చేయడంతో పాటు తమ చర్యలను ఆమోదించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. వైసీపీ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించేసింది.


  • కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు

కూటమి ప్రభుత్వం రాగానే టీటీడీలో పరిస్థితులను చక్కదిద్దడంపై దృష్టి సారించింది. దానికి తోడు తిరుపతికి చెందిన ఓంకార్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. శారదా పీఠం ఆక్రమించుకున్న అదనపు స్థలాలను క్రమబద్ధీకరించిన విషయాన్ని గుర్తించిన టీటీడీ ఈవో శ్యామలరావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత బోర్డు నిర్ణయాన్ని ర్యాటిఫై చేయడాన్ని తిరస్కరిస్తూ ఆ నిర్ణయాలను సర్కారు రద్దు చేసింది. ఈ విషయంలో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.

  • టీటీడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో టీటీడీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తిరుమలలో శారదా పీఠం నిర్వాహకులు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలు ఏమవుతాయన్నది ప్రశ్నగా మారుతోంది. టీటీడీ కేటాయించిన దానికి మించి ఆక్రమించుకున్న స్థలంలో కట్టిన కట్టడాలను కూల్చి వేస్తుందా? పాత భవనంలో అనుమతి లేకుండా చేసిన అదనపు నిర్మాణాల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Oct 25 , 2024 | 07:41 AM