Share News

కౌంటింగ్‌లో గొడవ చేస్తే అరెస్టే

ABN , Publish Date - May 31 , 2024 | 04:00 AM

కౌంటింగ్‌ కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్ట్‌ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా హెచ్చరించారు.

కౌంటింగ్‌లో గొడవ చేస్తే అరెస్టే

ఫలితాల అనంతరం ర్యాలీలకు అనుమతి లేదు: సీఈవో మీనా

మచిలీపట్నం(ఆంధ్రజ్యోతి)/భీమవరం టౌన్‌, మే 30: కౌంటింగ్‌ కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్ట్‌ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా హెచ్చరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని గురువారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసీ నిబంధనల మేరకు కౌంటింగ్‌ ప్రక్రియ ఉంటుందని, పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులోనూ నిబంధనలు పాటిస్తామని చెప్పారు. గతానికి భిన్నంగా ఈసారి నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటుచేసి పోస్టల్‌ బ్యాలెట్లను అక్కడే స్వీకరించామని తెలిపారు. ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునే సమయంలో అక్కడున్న గెజిటెడ్‌ అధికారి సంతకం చేశారని, సదరు అఽధికారి హోదాను సూచిస్తూ స్టాంప్‌ వేయనప్పటికీ ఆ ఓటు సక్రమంగానే ఉన్నట్టుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. గెజిటెడ్‌ అధికారి సంతకంపై అనుమానం ఉంటే నిర్ధారణ చేసుకుంటామని అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియపై ఓ రాజకీయ పార్టీ అనుమానం వ్యక్తం చేసిందని, గెజిటెడ్‌ అధికారి సంతకాన్ని కౌంటింగ్‌ కేంద్రంలో ఉన్న అధికారులు, సిబ్బందికి పంపుతామని, వారు ఆ సంతకాన్ని సరిపోల్చుకుని నిర్ధారణ చేసుకుంటారని మీనా వివరించారు. పార్టీ అనుమానాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశానని, అక్కడినుంచి వచ్చిన సూచనలతో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫలితాల అనంతరం ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని మీనా స్పష్టం చేశారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కౌంటింగ్‌ కేంద్రాలను మీనా పరిశీలించారు. ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - May 31 , 2024 | 04:00 AM