Crime Bust : పోలీసు వాహనాన్ని అడ్డుకుని బుక్కయ్యారు!
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:00 AM
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తప్పించడానికి ప్రయత్నిస్తే అసలు డొంక కదిలింది..
నిందితుడిని తప్పించబోయి దొరికిపోయారు
13 మంది దొంగ నోట్ల ముఠా అరెస్టు
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తప్పించడానికి ప్రయత్నిస్తే అసలు డొంక కదిలింది.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా సాగుతున్న పెద్ద దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టయింది. రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సెంట్రల్ జోన్ డీఎస్పీ కే.రమేష్ బాబు, ప్రకాశ్‌నగర్ సీఐ బాజిలాల్ మీడియాకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సిగడాం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ముద్దాయిగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాపాక ప్రభాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డిని ఈ నెల 12న రాత్రి పోలీసులు భీమవరంలో అరెస్టు చేశారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న కృష్ణమూర్తి కోసం రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెల్ టవర్ లోకేషన్ తనిఖీ చేయడానికి వచ్చారు. శ్రీకాకుళం పోలీసులు ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తిరిగి ప్రభాకర్‌ను తీసుకెళ్తుండగా కొంత మంది ఆగంతకులు వచ్చి పోలీసు వాహనాన్ని అడ్డుకుని వారిపై తిరగబడ్డారు. పోలీసుల అదుపులో ఉన్న రాపాక ప్రభాకర్‌ను ఎత్తుకుపోయారు. మొత్తం 18మంది పోలీసులపై తిరగబడి, నిందితుడిని ఎత్తుకుపోయినట్లు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, నిందితుల కోసం ఆరు బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. దాడి చేసినవారందరూ దొంగనోట్ల ముఠాకు చెందిన వారని గుర్తించి అరెస్టు చేశారు.
Updated Date - Dec 18 , 2024 | 06:01 AM