BJD Leaders : పోలవరం ముంపుపై ఎస్టీ కమిషన్ నోటీసు
ABN, Publish Date - Dec 22 , 2024 | 06:19 AM
పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జ్ సామర్థ్యాన్ని 36 నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుతూ డిజైన్లను సమూలంగా మార్చేశారని, దీనివల్ల ఒడిశాలోని గిరిజన...
బీజేడీ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జ్ సామర్థ్యాన్ని 36 నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుతూ డిజైన్లను సమూలంగా మార్చేశారని, దీనివల్ల ఒడిశాలోని గిరిజన ప్రాంతాలు భారీగా ముంపునకు గురవుతాయని ఆ రాష్ట్ర బిజూ జనతాదళ్ పార్టీ(బీజేడీ) నేతలు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. డిశ్చార్జి సామర్థ్యాన్ని పెంచడంతో డ్యామ్ వద్ద నీటిమట్టం 232 అడుగులు చేరుతుందని, ఒడిశాపై బ్యాక్ వాటర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పెరిగిన ముంపు ప్రాంతాలకు పూర్తి పరిహారం చెల్లించాలని, బీజేడీ ప్రజాప్రతినిధుల పిటిషన్‌కు 3రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు పంపింది. సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు 11న పంపిన నోటీసులో.. మూడు రోజుల్లో వాస్తవాలతో కూడిన సమాధానం చెప్పాలని, లేకుంటే ఆర్టికల్ 338ఎ ప్రకారం సివిల్ కోర్టుకు ఈ వివాదాన్ని పంపే అధికారం కమిషన్‌కు ఉందని హెచ్చరించింది.
ఇదీ బీజేడీ ఫిర్యాదు: పోలవరం నుంచి 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యంతో చేసిన డిజైన్‌ను ఒడిశా, మధ్యప్రదేశ్ అంగీకరించాయని, ఈ ఒప్పందానికి విరుద్ధంగా డిశ్చార్జి సామర్థ్యాన్ని 50లక్షల క్యూసెక్కులకు పెంచుతూ డిజైన్లను మార్చేసిందని బీజేడీ ఫిర్యాదు చేసింది. ముంపు ప్రభావం వల్ల ఒడిశా, ఛత్తీ్‌సగఢ్, తెలంగాణ, ఏపీకి చెందిన వేలాది గిరిజన కుటుంబాలు నిర్వాసితులవుతాయని, బ్యాక్ వాటర్‌పై సమగ్ర అధ్యయనం చేయాలని కోరింది. మల్కాన్‌గిరి జిల్లాపై బ్యాక్‌వాటర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీనివల్ల గిరిజనులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని, వారికి నష్టపరిహారంగా భూమికి బదులు భూమి, పునరావాసం, నష్టపరిహారం కింద నగదు చెల్లించాలని కోరింది. భవిష్యత్తులో ఒడిశాకు నష్టం వాటిల్లదన్న హామీ ఇవ్వాలని, మల్కాన్‌గిరి ప్రజలకు సంపూర్ణ న్యాయం చేయాలని కోరింది.
Updated Date - Dec 22 , 2024 | 06:19 AM