Share News

Chandrababu : గీత దాటొద్దు!

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:27 AM

కట్టుతప్పద్దు. క్రమశిక్షణ మరవొద్దు’ అని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Chandrababu : గీత దాటొద్దు!

క్రమశిక్షణతో మెలగాల్సిందే.. ఇసుక, మద్యంలో జోక్యం వద్దు ; చంద్రబాబు హెచ్చరిక

క్యాడర్‌ కష్టం వల్లే ఈ విజయం

వారికి అండగా నిలవాల్సిందే: బాబు

వైసీపీ తరహా దందాలు చేయొద్దు

ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు

ఎప్పటికప్పుడు దిద్దుబాటుకు పంచ సభ్య కమిటీ ఏర్పాటు

పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ

కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలుండవు

కానీ... తప్పుచేసినవారిని వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘కట్టుతప్పద్దు. క్రమశిక్షణ మరవొద్దు’ అని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక, మద్యం, ఇతర దందాల్లో జోక్యం చేసుకోవద్దని సూటిగా చెప్పారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జోనల్‌, ప్రాంతీయ ఇన్‌చార్జులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో వైసీపీ పాలకులు పాల్పడిన దందాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. ‘‘ఇసుక విషయంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వేలు పెట్టవద్దు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పాను. ఇసుక విధానం సక్రమంగా అమలు కాకపోతే అధికారులను కూడా బాధ్యులను చేస్తాను. మద్యం విషయంలో కూడా ఎవరూ జోక్యం చేసుకోవద్దు’’ అని సూటిగా చెప్పారు. వారసత్వంగా వస్తున్న మద్యం వ్యాపారం చేసుకుంటే ఏమీ కాదని.. కానీ ఇతరులు జోక్యం చేసుకుంటే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని స్పష్టం చేశారు.

కమిటీ నుంచి పిలుపు వస్తే...

దారి తప్పుతున్న పార్టీ ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు గుర్తించి, వారిని హెచ్చరించేందుకు పార్టీపరంగా పంచ సభ్య కమిటీ వేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ‘‘వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ప్రజలు నిరసించారు. ఘోర పరాజయం పాలైనవాళ్లు మనకు ఆదర్శం కాదు. వాళ్ళ మాదిరిగా ఉండాలని మనం అనుకోవద్దు. పంచ సభ్య కమిటీ నుంచి మీకు పిలుపు వచ్చిందంటే మీరు గీత దాటినట్లు లెక్క. మీరు ఏం తప్పులు చేశారో... చేస్తున్నారో ఆ కమిటీ మీకు చెబుతుంది. దిద్దుకోవాలని సూచిస్తుంది. అప్పటికీ మార్పు రాకపోతే తర్వాత నేను పిలవాల్సి వస్తుంది. అప్పటికీ మార్పు రాకపోతే ఆ తర్వాత చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటానికే నేను ఇక్కడకు వచ్చాను’’ అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ‘‘నా నుంచి మీరు చాలా ఆశిస్తున్నారు. మీ పనితీరు బాగుండి మీకు మంచి పేరు వస్తే మీ గురించి నేను ఆలోచిస్తాను. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారికి... సీనియర్లకు అందరికీ ఇదే వర్తిస్తుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. చాలా మంది పనితీరులో ఇంకా మార్పు రావాల్సి ఉందని తెలిపారు.

fb.jpg


అరాచకం నుంచి అభివృద్ధి దిశగా...

రాష్ట్రంలో ఐదేళ్లు అరాచకం జరిగిందని, అందరూ బాధలు పడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘నన్ను కూడా జైలులో పెట్టారు. ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ నన్ను కలిసిన అనంతరం కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. బీజేపీ కూడా కలిసి పోటీ చేయడానికి ముందుకొచ్చింది. ఎన్నికల్లో పొలిటికల్‌- సోషల్‌ రీఇంజనీరింగ్‌ చేశాం. టీడీపీకి అండగా ఉన్న బీసీలకు ప్రాధాన్యమిచ్చాం. ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని వర్గాలకు ప్రాధాన్యమిచ్చి సీట్లు ఇచ్చాం. పార్టీని నమ్ముకున్న వారికి కూడా పొత్తు వల్ల సీట్లు ఇవ్వలేకపోయాం. టీడీపీకి కొన్ని కుటుంబాలు అంకితమయ్యా యి. ప్రాణాలకు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేశారు. గత ఐదేళ్లలో కార్యకర్తలు అన్ని విధాలా నష్టపోయారు. రాజకీయాల్లో ఎప్పుడూ చూడని విధంగా గత పాలకులు కక్ష సాధింపులకు పాల్పడ్డారు. పార్టీ కార్యకర్తల ఆస్తులు, ఆదాయ వనరులు నాశనం చేశారు. మన ప్రభుత్వంలో పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వకుండా విజిలెన్స్‌ విచారణ పేరిట నిలిపేశారు. ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. అయితే వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలు, బెదిరింపులకు తట్టుకుని నిలదొక్కుకున్నాం. ఎదిరించాం.. కార్యకర్తలకు అండగా ఉన్నాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.259 కోట్లు నీరు-చెట్టు, రూ.500 కోట్లు ఉపాధిలో పెండింగ్‌ బిల్లులు చెల్లించాం. కార్యకర్తలకు న్యాయం చేస్తేనే వారు మనకు అండగా ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని తెలిపారు. గత పాలకులు కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని, ఇప్పుడు నిధులు అడుగుతుంటే గతంలో ఇచ్చిన నిధులకు యూసీలు అడుగుతున్నారని తెలిపారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన రూ.990 కోట్లు మళ్లించారని.. దీంతో రూ. 1,200 కోట్లు కేంద్రం నుంచి రాకుండా పోయాయని చెప్పారు. మనం వచ్చాక 990 కోట్లు చెల్లించడంతో ఇప్పుడు రూ.1,200 కోట్లు పంచాయతీలకు రాబోతున్నాయన్నారు. ఇంకా ఏమన్నారంటే..

నడిచాం.. నడిపించాం..

విజయవాడలో వరదల సమయంలో రాత్రింబవళ్లూ పనిచేశామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ఈ వరద వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో స్వచ్ఛందంగా రూ.450 కోట్లపైన విరాళాలను ప్రజలు అందించారన్నారు. ‘‘ఎప్పుడూ వరదలు వచ్చినా బాధితులకు వెయ్యి లేదా రూ.2 వేలు ఇచ్చేవారు. కానీ మొదటి సారి దేశ చరిత్రలో ఒక్కో ఇంటికి రూ.25 వేలు ఇచ్చాం. ఆటోకు రూ.10 వేలు, బైక్‌లకు రూ.3 వేలు ఇచ్చాం. 4.15 లక్షల మందికి రూ.618 కోట్లు పరిహారం అందించాం’’ అని తెలిపారు. రైతులకు గత పాలకులు రూ.1,674 కోట్లు బకాయిపెట్టారని... కూటమి ప్రభుత్వం రాగానే అవి విడుదల చేశామని తెలిపారు. ‘‘రైతుల నుంచి ధాన్యం కొంటే 48 గంటల్లోనే డబ్బులు అందించే విధానం మళ్లీ తీసుకొచ్చాం. రూ.4,500 కోట్లతో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పనులు ప్రారంభించాం. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దీనిని ప్రారంభించారు. ఈ పనులు జనవరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వైసీపీ వాళ్లు గోతులు పెట్టారు. వాటిని మనం పూడ్చే కార్యక్రమం చేపట్టాం. రోడ్లపై గుంతలు పూడ్చడానికి రూ.700 కోట్లు ఖర్చవుతుంది. సంక్రాంతికి ముందే ఇవి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం’’ అని తెలిపారు.

ఉపాధి కల్పించే వారికే ప్రోత్సాహకాలు..

‘జాబ్‌ఫస్ట్‌’ విధానంతో దేశంలోనే మొదటి సారిగా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే వారికి ప్రోత్సాహకాలు అదనంగా ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అదనంగా ఉద్యోగాలు కల్పించే వారికి 10 శాతం ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించామన్నారు. ‘‘ఆరు పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చాం. అలాగే సూపర్‌ సిక్సులు తెచ్చాం. ఇవి అమలైతే ఏపీ నంబర్‌ వన్‌ అవుతుంది. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ కింద అమరావతిలో హెడ్‌క్వారర్స్‌, 5 జోన్లలో 5 ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంట్లో ఒక వ్యవస్థాపకుడు ఉండాలి. రతన్‌టాటా స్పూర్తితోనే ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్కులు పెడతాం. ఇందులో రైతులను కూడా భాగస్వాములను చేస్తాం’’ అని తెలిపారు.


ఇచ్చిన మాట ప్రకారం..

ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తామని ప్రజలకు ధైర్యంగా చెప్పాలని... ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చామని చెప్పారు. ‘‘ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం. మత్స్యకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. ఉద్యోగులకు, పెన్షనర్లకు 1న జీతాలు అందిస్తున్నాం. స్వర్ణకారులకు కార్పొరేషన్‌ ఏర్పాటుచేశాం. గౌడలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించాం. అర్చకుల జీతాలు రూ.10వేలకు, నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు పెంచాం. ధూపదీప నైవేద్యాలకు రూ.10వేలకు పెంచాం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలు చేస్తాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలిస్తామని చెప్పాం. ఆ ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తవుతుంది. దాదాపు 70శాతం గ్రీవెన్స్‌ భూసమస్యలపైనే వస్తున్నాయి. అందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం. చట్టం రాకముందే ఇలా జరిగిందంటే.. వస్తే ఇంకేలా ఉండేదో ఆలోచించాలి. పట్టాదారు పుస్తకంపైనా వారి బొమ్మలు వేసుకున్నారు. హద్దు మీరి ప్రవర్తించారు. పెన్షన్లు రూ.1000 పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ బాధితులకు రూ.10 వేలు, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి రూ.15వేలు అందిస్తున్నాం. 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. వాటిని 203కు పెంచుతాం. ఆదాయం పెంచి సంక్షేమాన్ని అమలు చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

పార్టీకి చెడ్డపేరు తెస్తే సహించేది లేదు

ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ‘తెలుగుదేశం పార్టీకి క్రమ శిక్షణ కలిగిన పార్టీ అని పేరు ఉంది. దేశంలో కూడా మనకు ప్రత్యేకత గుర్తింపు ఉంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజలకు మరింత ఎక్కువ మేలు జరగాలి. మీ పనితీరు ఆ మాదిరిగా ఉండాలి. ఒక్కరి వల్ల చెడ్డపేరు వచ్చినా నేను సహించేది లేదు’’ అని స్పష్టం చేశారు. ప్రజలతో గౌరవంగా ప్రవర్తించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య మంచి సంబంధాలు ఉండాలని తెలిపారు. ‘‘కింది స్ధాయి నాయకులను కలుపుకొని పోవాలి. ఎవరేం చేస్తున్నారో నా వద్ద పూర్తి సమాచారం ఉంది. ముందుగా మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నాను. మనం తీసుకొనే నిర్ణయాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఇది జరగకపోవడం వల్ల గతంలో నష్టపోయాం’’ అని చంద్రబాబు తెలిపారు. 2029లో కూడా మీరంతా గెలిచి రావాలని తాను తాపత్రయ పడుతున్నానని... అందరి పనితీరు కూడా బాగుంటేనే అది సాధ్యపడుతుందని చెప్పారు. ఇకపై ఫోన్‌ సర్వేతోపాటు ఇతర మార్గాల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించబోతున్నామని... వెనుకబడిన ఎమ్మెల్యేలను ఉపేక్షించబోమని చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు. తప్పుడు కేసులను ఎత్తివేయడానికి చర్యలు తీసుకొంటామన్నారు. 125 రోజుల పాలనలో మనం చేసిన మంచి పనులను సమీక్షించుకుని ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ చేసిన అరాచకం భరించలేక ప్రజలు మనల్ని గెలిపించారని.. మళ్లీ మనం గెలవాలంటే ఎన్డీయే చేసిన మంచి పనులను వారిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్డీయే అధికారంలో ఉందని.. మొన్నటి ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయని, మన పార్టీని సమన్వయం చేసుకోవడంతో పాటు మద్దతు ఇచ్చిన ప్రజల ఆశలు నెరవేర్చాలని సూచించారు.


పార్టీ క్యాడర్‌ కీలకం...

‘‘మనమందరం ఇక్కడ కూర్చోడానికి కారణం... ప్రజల ఆశీర్వాదం, పార్టీ క్యాడర్‌ కష్టం. క్యాడర్‌ సంతృప్తిగా లేరంటే మీరు వాళ్లతో సరిగ్గా లేరని అర్థం. పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే... క్యాడర్‌ దానిని ఆమోదించి కట్టుబడి పనిచేస్తుంది. వాళ్ల పట్ల మనం గౌరవంగా ఉండాలి. వారికి కష్టం వస్తే నిలబడాలి. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. నేను నా వంతుగా కొన్ని చేస్తున్నాను. మీరు కూడా కింది స్థాయిలో వారి కోసం నిలబడండి’ అని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

రాజధాని ఒక్కటే..

‘‘రాజధాని ఒక్కటే ఉంటుంది. అది అమరావతే. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తాం. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు. నదుల అనుసంధానం మళ్లీ ప్రారంభిస్తామన్నారు. ‘‘గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానిస్తాం. ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తాం. రాష్ట్రంలో 95 శాతం చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఎప్పుడూ నిండని రిజర్వాయర్లు కూడా నిండాయి. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు.

మోదీని చూసి నేర్చుకోవాలి

‘‘ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాల్సింది ఆయనకున్న పట్టుదల, కృషి. మూడుసార్లు ప్రధాని అయినా మళ్లీ రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు’’ అని చంద్రబాబు తెలిపారు. దేశంలో ఎవరికీ రాని విజయం మోదీ సాధించారంటే దాని వెనక కఠోర శ్రమ, క్రమశిక్షణ ఉన్నాయన్నారు.

26 నుంచి సభ్యత్వ నమోదు

ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనిని రెండు నెలల్లో ముగించాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు టీడీపీ సభ్యుడిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు ఆయన చెప్పారు. ‘పార్టీ సభ్యులకు గతంలో రూ.2 లక్షల ప్రమాద బీమా ఉండేది. దానిని రూ. ఐదు లక్షలకు పెంచుతున్నాం. పార్టీ సభ్యులు సహజ మరణం చెందినా వారికి అంతిమ సంస్కారాల కింద రూ. పదివేలు ఇస్తాం. గతంలో ప్రమాద బీమా పొందలేకపోయిన 73 మందికి పార్టీపరంగా తలకు రూ.రెండు లక్షలు ఇస్తాం. పార్టీ సభ్యులకు ఇప్పటివరకూ ప్రమాద బీమా కింద రూ. 102 కోట్లు, సహజ మరణం... ఇతర సమస్యల కింద రూ.18 కోట్లు అందాయి. విద్యార్ధుల చదువు కోసం రూ. 2.35 కోట్లు ఖర్చు చేశాం. క్యాడర్‌కు ఆర్థిక భరోసా కల్పించేందుకు వారికి నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు, ఇతరత్రా ఆదాయ మార్గాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఈ పని చూడాలి. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి త్వరలో నిర్ణయం తీసుకొంటాం’’ అని ఆయన చెప్పారు.


దోచుకున్న సొమ్మును బస్తాల కొద్దీ ఖర్చు చేసినా వైసీపీ నేతలు

గెలవలేకపోయారు. డబ్బుతో ఏ ఎన్నికా జరగదు. డబ్బులతో ఎన్నికలు జరిగితే మన కూటమికి 93 శాతం సీట్లు వచ్చేవి కావు. ప్రజల్లో నమ్మకమే ముఖ్యం.

గత ప్రభుత్వం మాదిరిగా కక్ష సాధింపులకు పాల్పడితే మనకూ, వైసీపీ వాళ్లకూ తేడా ఉండదు. మన ప్రభుత్వంలో అవి ఉండవు. అలాగని

తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

మీరు మంచి చేసినా, తప్పు చేసినా అవి పార్టీ, ప్రభుత్వానికి వర్తిస్తాయి. అందరికీ ఒక్కటే చెబుతున్నా.. మనం ప్రవర్తించే తీరుపైనే భవిష్యత్‌లో మనకు వచ్చే మెజారిటీ ఉంటుంది. ఈ నాలుగు నెలల్లో మన వాళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ కూడా నా వద్ద ఉంది.

- టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు

Updated Date - Oct 19 , 2024 | 04:28 AM