CM Chandrababu Naidu : రోగుల చెంతకే వైద్య సేవలు!
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:06 AM
మెడికల్ సైన్స్‌లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
టెక్నాలజీతో వైద్య రంగంలో అద్భుతాలు: సీఎం
మెడికల్ సైన్స్.. ఇప్పుడు మెడ్‌టెక్ సైన్స్
డీప్‌టెక్‌పై విద్యార్థులు పట్టు సాధించాలి
ఎయిమ్స్ అభివృద్ధికి మరింత సహకరిస్తాం
మరో 10 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధం
రాష్ట్రపతి ముర్ము జీవితం స్ఫూర్తిదాయకం
మారుమూల గ్రామం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు.. చంద్రబాబు ప్రశంసలు
అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మెడికల్ సైన్స్‌లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికతతో రోగుల చెంతకే వైద్య సేవలు తీసుకెళ్లవచ్చని తెలిపారు. మంగళవారం మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్‌టెక్ సైన్స్ అయిందని, డీప్‌టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆస్పత్రులకు వెళ్లకుండా.. ఇళ్ల వద్దే వారికి వైద్య చికిత్స అందించేలా వైద్య రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని సూచించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి హాజరుకావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. మహిళలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్ఫూర్తి అని, ఒడిశాలో చిన్న గ్రామలో పుట్టి ఆదర్శవంతంగా ఎదిగారని కొనియాడారు. మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబం నుంచి ఆమె రాష్ట్రపతికి స్థాయి ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. జూనియర్ అసిస్టెంట్‌గా, ప్రొఫెసర్‌గా, కౌన్సిలర్‌గా, చైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారని.. ఇప్పుడు దేశానికి ప్రథమ పౌరురాలు అయ్యారని.. పట్టుదలతో కష్టపడితే ఎవరైనా అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చని నిరూపించారని తెలిపారు. తాను కూడా చిన్న గ్రామం నుంచే వచ్చానన్నారు. దేశంలో ఏ ఎయిమ్స్‌కూ లేనట్లుగా మంగళగిరి ఎయిమ్స్‌కు మంచి వాతావరణంలో దాదాపు 183 ఎకరాలు ఇచ్చామని చెప్పారు.
భవిష్యత్ అవసరాల కోసం మరింత భూమి కావాలని ఎయిమ్స్ డైరెక్టర్ తనను కోరారని.. కొలనుకొండ వద్ద 10 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. ఎయిమ్స్‌ను చూసిన తర్వాత తానిక్కడ చదువుకోలేదేనని అసూయగా ఉందన్నారు. ‘2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశాం. ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడే తొలి స్నాతకోత్సవం జరుపుకొంటున్నాం. 960 పడకల సామర్థ్యం ఉన్న ఎయిమ్స్‌ను రూ.1,618 కోట్లతో నిర్మించారు. తొమ్మిదేళ్లలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. దానికి మౌలిక సదుపాయాలు సమకూర్చాం. భవిష్యత్‌లో మరింతగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం’ అని అన్నారు. ఎయిమ్స్‌లో రూ.10కే వైద్య సేవలు అందించడాన్ని అభినందించారు. ఇప్పుడు 8వ స్థానంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ మొదటిస్థానానికి రావాలని ఆకాంక్షించారు. కేంద్రం విభజన హామీల్లో భాగంగా 12 కేంద్ర సంస్థలను ఏపీలో ఏర్పాటు చేసిందన్నారు. ఇందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిని వచ్చే మూడేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేసి అద్భుతంగా నిర్మిస్తామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరి ఆరోగ్య రక్షణే మోదీ లక్ష్యమని చెప్పారు. 2018 నుంచి ఎయిమ్స్ పురోగతిని డైరెక్టర్ మాధవానంద కర్ వివరించారు. సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో సహకరించిందని, మరో పది ఎకరాలు కేటాయిస్తే ట్రామాకేర్ యూనిట్, మెడికల్ టెక్నాలజీ విభాగాలు ఏర్పాటు చేస్తామని సీఎంను కోరారు.
Updated Date - Dec 18 , 2024 | 06:07 AM