ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kunki elephants: కర్ణాటక నుంచి రానున్న 4కుంకీ ఏనుగులు

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:19 AM

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో తొక్కి నాశనం చేయడంతో పాటు మనుషుల ప్రాణాలనూ బలిగొంటున్న గజరాజుల కట్టడికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.

కుంకీలను మచ్చిక చేసుకోవడంలో ట్రాకర్‌కు శిక్షణ

పలమనేరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో తొక్కి నాశనం చేయడంతో పాటు మనుషుల ప్రాణాలనూ బలిగొంటున్న గజరాజుల కట్టడికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.ఏనుగుల దాడులను నియంత్రించేందుకు తీసుకొస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల విడిది కోసం పలమనేరు మండలం ముసలిమడుగు అటవీ ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.పలమనేరు రేంజి పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి సరిహద్దులో ఉన్న పంట పొలాలపై ఏనుగుల దాడులను నియంత్రించేందుకు జనవరి నెలాఖరు లోపు ఇక్కడికి నాలుగు కుంకీ ఏనుగులను తెప్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఇప్పటివరకూ పంటలపై దాడులు చేస్తున్న ఏనుగులను దారిమళ్లించి మళ్లీ అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ట్రాకర్లను ప్రభుత్వం రెండు దశాబ్దాలక్రితమే ఏర్పాటు చేసింది. వీరు ఆయా గ్రామాల వద్ద ఉంటూ ఏనుగులు వచ్చినప్పుడు గ్రామస్థుల సహకారంతో బాణసంచా కాల్చుతూ డప్పులు కొడుతూ అటవీ ప్రాంతంలోకి తరిమేస్తున్నారు.అర్ధరాత్రివేళ పంటలు తినేందుకు ఏనుగులు అలవాటు పడడంతో ట్రాకర్లు పూర్తిస్థాయిలో ఏనుగుల దాడులను కట్టడి చేయలేకపోతున్నారు.ఏనుగుల భయంతో పొలాల వద్ద ఉండలేక రైతులు చీకటి పడగానే ఇళ్లకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించాలంటే కుంకీ ఏనుగుల ద్వారా మాత్రమే సాధ్యమని అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో కుంకీ ఏనుగులను రప్పించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.శాసనసభలో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఏనుగుల సమస్య తీవ్రత గురించి మాట్లాడడంతో పాటు అటవీశాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌ దృష్టికీ తీసుకెళ్లారు.

కుంకీ ఏనుగుల వద్ద ట్రాకర్లకు శిక్షణ

జిల్లాకు రప్పిస్తున్న కుంకీ ఏనుగులతో మమేకం అయ్యేందుకు ఇక్కడ పనిచేస్తున్న 20 మందికి దాదాపు 20 రోజుల పాటు శిక్షణను ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఇప్పించారు. కర్ణాటకలోని మైసూరుకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని దుబరే నుంచి ఇక్కడికి రానున్న నాలుగు కుంకీ ఏనుగుల వద్ద శిక్షణ ఇప్పించారు. కుంకీ ఏనుగులకు ఏ విధంగా ఆహారాన్నందించాలి, ఏ విధంగా స్నానం చేయించాలి, వాటిపై అంబారీలేకున్నా ఎలా ఎక్కి వెళ్లాలి, ఏవిధంగా వాటిని మచ్చిక చేసుకోవాలో ట్రాకర్లకు అక్కడ శిక్షకులు తర్ఫీదు ఇచ్చారు.


50 ఎకరాల్లో విడిది ఏర్పాట్లు

కుంకీ ఏనుగులకు విడిది కోసం అటవీ శాఖ 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తోంది.కుంకీ ఏనుగులు ఉండేందుకు వృత్తాకారంలో ఒక విడిది ఏర్పాటు చేస్తున్నారు. ఈ వృత్తాకారం చుట్టూ రెండు అంచెలుగా కర్రలతో కంచె ఏర్పాటు చేస్తున్నారు.ఈ 50 ఎకరాల చుట్టూ సుమారు 3కిలోమీటర్ల పొడవుండే ట్రెంచ్‌లను తవ్విస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.12 లక్షలకు పైగా కేటాయించి ఆన్‌లైన్‌లో టెండర్ల ప్రక్రియప్రారంభించారు.స్థానిక ఏనుగులు ఈ స్థలంలో ప్రవేశించకుండా ట్రెంచ్‌పక్కనుంచి హ్యాంగింగ్‌ సోలార్‌ ఫెన్సింగ్‌కూడా దాదాపు రూ.27లక్షలతో ఏర్పాటు చేస్తున్నారు. కుంకీ ఏనుగులను చూసుకొనే 8మంది మావటీలకోసం వసతి గృహాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అఽటవీశాఖ అధికారులు తెలిపారు.కుంకీ ఏనుగులు స్నానం చేసేందుకు సుమారు 30 అడుగులకు పైగా పొడవుతో 8 అడుగుల లోతుతో కుంటలను నిర్మించనున్నారు. కుంకీ ఏనుగులకు ప్రత్యేకంగా అందించే సంగటి ముద్దలను తయారు చేసేందుకు వంటగదిని కూడా నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.కుంకీలకు గడ్డిమధ్యలో వరిధాన్యం, బెల్లం పెట్టి ఉండలుగా తయారు చేసి అందిస్తారు. ఈ గడ్డి వుండలను తయారు చేయడంలో కూడా ట్రాకర్లకు దుబరేలో శిక్షణ ఇచ్చారు.అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ రమే్‌షకూడా దుబరేలో శిక్షణ పొందారు.కుంకీల విడిది ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచనలో అటవీ శాఖ వుంది. ఇందుకు కారణం కుంకీ ఏనుగుల సంరక్షణకు పెద్దఎత్తున నిధులు కావాల్సి వుంటుంది. పర్యాటకుల నుంచి వసూలు చేసే ప్రవేశరుసుం కూడా వీటి నిర్వహణకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

మదపు టేనుగులను మచ్చిక చేసేందుకు క్రాల్‌

మనుషుల ప్రాణాలనూ తీస్తున్న మదపుటేనుగులను మచ్చిక చేసేందుకు క్రాల్‌ను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంనుంచి కుంకీ ఏనుగుల ద్వారా తీసుకొచ్చిన మదపుటేనుగును ఈ క్రాల్‌లో బంధిస్తారు. ఒకటి రెండు రోజలు ఆహారాన్ని కట్టడి చేసి మెల్లమెల్లగా పరిమిత ఆహారాన్ని ఇస్తూ మచ్చిక చేసుకొని మళ్లీ మనుషులపై దాడులకు తెగబడవన్న విశ్వాసం వచ్చేవరకు వుంచుకొంటారు.

ఏనుగుల ఆహార సమస్యపై ఇకనైనా దృష్టి పెట్టాలి

మూడు దశాబ్దాలుగా అటవీ సరిహద్దు గ్రామాల రైతులు పండించిన పంటలను అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు వచ్చితిని తొక్కిపోతున్నాయి. దీనికి కారణం అటవీ ప్రాంతంలో ఏనుగులకు తగిన ఆహారం లభించకపోవడమే.ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వెదురు, చిన్న మొక్కలు, చెట్ల బెరడు, అడవుల్లో లభించే పండ్లు, చిన్నచిన్న పొదలు ఏనుగులకు ప్రధాన ఆహారం. రోజుకు ఒక ఏనుగు కనీసం 150 నుంచి 170 కిలోల శాఖాహారాన్ని తింటుంది.శరీర ఆకృతిని, వయసును బట్టి 80 నుంచి 110 లీటర్ల నీరు తాగుతుంది.

Updated Date - Dec 24 , 2024 | 01:19 AM