Kuppam: చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ధైర్యం చెప్పింది వారే: నారా భువనేశ్వరి..
ABN, Publish Date - Dec 22 , 2024 | 03:49 PM
చిత్తూరు జిల్లాలో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటిస్తున్నారు. శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి గ్రామానికి వెళ్లి స్థానిక మహిళలతో ఆమె ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారితో స్థానిక విషయాలు సహా మహిళల సమస్యలపై చర్చించారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari ) నాలుగు రోజులుగా చిత్తూరు జిల్లా (Chittoor District)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కాగా, ఇవాళ (ఆదివారం) చివరి రోజు పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు.
ఆదివారం ఉదయం కుప్పుం పీఈఎస్ వైద్య కళాశాల గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న భువనేశ్వరి స్థానిక ప్రజలను కలిశారు. వారితో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వినతిపత్రాలు స్వీకరించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి గ్రామానికి వెళ్లి స్థానిక మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారితో స్థానిక విషయాలు సహా మహిళల సమస్యలపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు వి.కోటకు చేరుకుని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో కలిసి సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను భువనేశ్వరి ప్రారంభించారు.
నా బలం వారే..
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన భువనేశ్వరి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దారుణాలపై మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో చంద్రబాబు అరెస్టు ఘటనను భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టారని, ఆ సమయంలో తనకు ధైర్యం ఇచ్చి పోరాడింది ప్రజలు, కార్యకర్తలేనని ఆమె చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు, మహిళలు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందేందుకు రాష్ట్ర ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి కూటమిని గెలిపించుకున్నారని భువనేశ్వరి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుస్థిర పాలన సాగుతోందని, మహిళలపై చిన్న అఘాయిత్యం జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ బాధితులను ఆదుకుంటోందని చెప్పారు. అమరావతి పనులు సైతం పరుగులు పెడుతున్నాయని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.
ఆదాయం మెుత్తం పాయే..
పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. "ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అన్ని రకాలుగా ఆపేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం ఇచ్చిన అనుమతులను వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ పనులకు మోక్షం కలుగుతోంది. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న వి.కోట అభివృద్ధి పనులకు గత ప్రభుత్వం అనేక రకాల ఆటంకాలు సృష్టించింది. బైపాస్ రోడ్డు నిర్మాణం విషయంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలతో ప్రజలు, రైతులకు తీరని నష్టం వాటిల్లింది. వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఆదాయం మొత్తం కర్ణాటకకు వెళ్లిపోయిందని" ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Dec 22 , 2024 | 09:47 PM