ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంటలోపే దర్శనం...

ABN, Publish Date - Dec 20 , 2024 | 02:23 AM

సీఎం చంద్రబాబు ఆకాంక్షను నెరవేర్చే దిశగా తిరుమల ప్రక్షాళనకు పూనుకున్నారు టీటీడీ కొత్త చైర్మన్‌ బీఆర్‌ నాయుడు. పెనుమూరు మండలం దిగువపునేపల్లిలో పుట్టిపెరిగిన ఈయన తొలుత బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం చేశారు.

  • అన్నేసి గంటలు క్యూలో ఉండడం మానవహక్కుల ఉల్లంఘనే

  • ఉన్నవి కూల్చేసి కొత్త భవనాలా.. అందుకు టీటీడీ నుంచి 1200 కోట్లా?

  • తిరుమల ప్రక్షాళన మొదలైంది.

  • ఆక్రమించిన మఠాల జోలికే వెళ్తాం!

  • ఆ చెత్త కాంట్రాక్టు రద్దు చేస్తాం

  • భక్తులతో భూతులు మాట్లాడితే ఊరుకోం

  • అన్యమత ఉద్యోగులను జమ్మూకి పంపుతాం

  • టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు

యన వెంట మందీ మార్బలం కనిపించదు. ఆర్భాటం అసలు ఉండదు. హడావుడి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌గా ఆయన శైలి విలక్షణం. ఒక సాధారణ భక్తుడిలా తిరుమల అంతా కలియతిరుగుతుంటారు. భక్తులతో మాట్లాడుతారు. దుకాణాలను పరిశీలిస్తారు. ఒక రీసెర్చెర్‌లా వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత అధికారులతో మాట్లాడుతారు. గుర్తించిన లోపాలు వివరించి సరిదిద్దుకునే అవకాశాలేమిటని ఆరా తీస్తారు. సీఎం చంద్రబాబు ఆకాంక్షను నెరవేర్చే దిశగా తిరుమల ప్రక్షాళనకు పూనుకున్నారు టీటీడీ కొత్త చైర్మన్‌ బీఆర్‌ నాయుడు. పెనుమూరు మండలం దిగువపునేపల్లిలో పుట్టిపెరిగిన ఈయన తొలుత బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత వ్యాపార వేత్తగా స్థిరపడ్డారు. .... న టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్‌ నాయుడు గత చైర్మన్‌లకు భిన్నంగా తన ఖర్చులన్నీ తనే పెట్టుకుంటూ తిరుమలలో ఉంటున్నారు. తిరుమలలో భక్తుల కష్టసుఖాలు తెలుసుకుంటూ, టీటీడీ ఆనుపానులు గ్రహిస్తూ ఆచితూచి అడుగేస్తున్న బీఆర్‌ నాయుడుతో ఆంధ్రజ్యోతి సంభాషణలోని ముఖ్యాంశాలు...


- (తిరుమల, ఆంధ్రజ్యోతి)

‘‘చైర్మన్‌ అనే హోదాను అనుభవించడానికి నేనీ బాధ్యత స్వీకరించలేదు. స్వామి కొలువు గొప్పవరం. తిరుమలకు వచ్చే వెళ్లే ప్రయాణం, బస, భోజనం వంటి ఖర్చులు ఏవీ టీటీడీ మీద భారం మోపడం లేదు. సొంతంగా నేనే పెట్టుకుంటున్నా. దర్శనాల కోసం చైర్మన్‌ మీద ఎంత ఒత్తిడి ఉంటుందో అందరికీ తెలుసు. అయినా.. దర్శన టికెట్ల కోటాను కూడా నేను వినియోగించుకోవడం లేదు.’’

‘‘టీటీడీకి వచ్చే ఆదాయానికంటే, చేసే ఖర్చే అధికంగా ఉంటోంది. మళ్లీ కుబేరుడివంటి వారిని వెతుక్కుని అప్పు చేయాలి. అలా చేసి పెట్టారు టీటీడీని. వ్యక్తిగత పనులన్నీ వదిలేసి తిరుమలలోనే ఉంటూ అన్నింటిపై దృష్టి సారించా. స్వామికి చెందిన ఒక్క రూపాయి కూడా వృధా కానివ్వను.’’


చైర్మన్‌ కావాలని ఎప్పుడు అనిపించింది. ఎందుకు.

దాదాపు పదిహేనేళ్ల కిందటే టీటీడీ ధర్మకర్తల మండలికి చైర్మన్‌ కావాలని కోరుకున్నా. చిత్తూరు జిల్లాలో పుట్టిపెరిగినవాడిగా ఇక్కడుండే సమస్యలన్నీ నాకు తెలుసు. నేను చైర్మన్‌ అయితే మార్పులు చేయగలనని చిన్న ఆశ. స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని గొప్పవరంగా భావిస్తున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ తిరుమలకు వస్తూనే ఉన్నాను. శ్రీవేంకటేశ్వరస్వామి మీద అచంచల భక్తి చిన్నప్పటి నుంచే ఉంది.

తంలో దర్శనానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా..

10 గంటలకు పైనే క్యూలైన్‌లో వేచి ఉండి స్వామిని దర్శించుకున్న సందర్భాలున్నాయి. ఒక్కోసారి క్యూలైన్‌లో వేళ్లే సమయం లేక పుష్కరిణిలో కాళ్లు కడుక్కొని, తలపై చల్లుకుని, కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయేవాడిని. గొల్లమండం నుంచే స్వామికి నమస్కరించుకుని ఈసారికి ఇదే భాగ్యం అనుకునేవాడిని. గతంలో గవర్నమెంట్‌ సర్వీస్‌లో ఉండేవాడిని. సెలవులు తక్కువ. టైం ఉండదు కాబట్టి అన్నేసి గంటలు క్యూలో ఉండే వీలుండేది కాదు.


చైర్మన్‌గా తిరుమలలో మీరు గుర్తించిన లోపాలేంటి..

ప్రధానంగా స్వామి దర్శనానికి వచ్చే వారిని 20 నుంచి 30 గంటల పాటు కంపార్టుమెంట్లలో కూర్చోబెట్టి తాళాలు వేసేస్తున్నారు. లోపలికి రానివ్వరు, బయటకు పోనివ్వరు. నా దృష్టిలో అది కరెక్ట్‌ కాదు. మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని గతంలో కూడా చెప్పాను. భక్తులు చాలా ఇబ్బందులు పడటాన్ని స్వయంగా చూశా. ఐదు కిలోమీటర్ల పొడవుతో ఉన్న క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిలుచుంటున్నారు. వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. అంతదూరం నడిపించాల్సిన అవసరం ఏమిటి? అలాగే వ్యర్ధాల తొలగింపు సరిగా జరగడం లేదు. కుప్పలుకుప్పలుగా చెత్త పేర్కుపోయింది. చెత్త తొలగింపునకు ఒక సంస్థకు రూ.20 కోట్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చారు.


వారి నిర్వహణ సరిగా లేదు. డబ్బులు ఇచ్చిమరీ చెత్తను తీసుకెళ్లేవారు ఉంటే, వాళ్లను వదిలేసి మనమే డబ్బు ఇచ్చి చెత్త తీసుకువెళ్లండి అనడం ఏమిటో! ఆసంస్థను మార్చాలనుకుంటున్నాం. ఇక, స్విమ్స్‌ ఆస్పత్రికి ఏడాదికి రూ.వంద కోట్లు టీటీడీ ఇస్తోంది. ఈ అంశంపై తగిన సూచనల కోసం మాజీ ఐఏఎస్‌ అధికారి ఐవీ సుబ్బారావు ఆధ్వర్యంలో ఓ కమిటీని వేశాం. స్విమ్స్‌ నిర్వహణే సక్రమంగా లేదనుకుంటే, కమీషన్ల కోసం కక్కుర్తిపడి గతంలో పిల్లల ఆస్పత్రి, క్యాన్సర్‌, హార్ట్‌ ఆస్పత్రి అని పెట్టారు. ఇవన్నీ అవసరమా?. రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1,200 కోట్లు పెట్టి భవనాలు కడుతున్నారు. కట్టి ఏం చేస్తారు. టీటీడీ పని అదేనా? ఆలయాలు లేని చోట కట్టించాలి. నైవేద్యం లేని చోట ఏర్పాట్లు చేయాలి. భజనలు, హిందు ఽధర్మప్రచార కార్యక్రమాలు చేయాలి. దాని కోసం కదా టీటీడీ ఖర్చు చేయాల్సింది.


ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు..

ఎయిర్‌పోర్టులో డిజి యాత్ర విధానాన్ని అందరూ చూసేఉంటారు కదా. అదే తరహాలో ఏఐ సహకారంతో తిరుమల శ్రీవారి దర్శనాన్ని కూడా గంట వ్యవధిలోనే చేయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. భక్తుడు తిరుపతికి రాగానే ఆధార్‌కార్డును లింక్‌ చేసి ఫేస్‌రికగ్నిషన్‌తో టోకెన్‌ జారీ చేస్తాం. అందులో టైం వచ్చేస్తుంది. ఆ సమయానికి క్యూకాంప్లెక్స్‌ వద్దకు వస్తే నేరుగా లోపలికి వెళ్లిపోవచ్చు. వేరేవేరు ప్రాంతాల్లో కావాల్సినన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తే తోపులాటలు కూడా ఉండవు. ఇప్పటికే ఇతర దేశాలకు చెందిన ఐదారు సంస్థలు ఈ వ్యవస్థ ఏర్పాటుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చాయి.. ఉచితంగా చేస్తామంటున్నారు. త్వరలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తాం. సత్ఫలితాలు వస్తే రెండుమూడు నెలల్లోనే అమలుచేస్తాం. ఏఐ అందుబాటులోకి వస్తే వసతికి ఇబ్బందులు కూడా ఉండవు.


ఉద్యోగులకు నేమ్‌ బ్యాడ్జీ ఎందుకు..

ఉద్యోగుల్లో కొంతమంది భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కొందరైతే బూతులు మాట్లాడుతున్నారు. వాదవివాదాల్లో భక్తులపైకి కొట్టేందుకు కూడా కొందరు వెళ్లిపోతున్నారు. అటువంటి వాళ్లను భక్తులు ఎలా గుర్తుపట్టాలి?. అందుకే నేమ్‌ బ్యాడ్జీ ఉంటే భక్తులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఉంటుంది. ఆ తర్వాత విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. దీనిపై బోర్డులో చర్చించి త్వరలోనే అమలుచేస్తాం.

టీటీడీలో అన్యమత ఉద్యోగుల తొలగింపు సాధ్యమేనా..

వంద శాతం సాధ్యమే. మనం వాళ్ల పొట్టపై కొట్టడం లేదు. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కదా. ముందు మంచి బెనిఫిట్స్‌తో వీఆర్‌ఎస్‌ ఇస్తాం. లేకుంటే ప్రభుత్వానికి డిప్యూటేషన్‌పై సరెండర్‌ చేస్తాం. వాళ్లు కూడా వద్దంటే వేరే ఆలయాలు ఉన్నాయి కదా. జమ్ము, ముంబై, కన్యాకుమారి వంటి వాటికి మారుస్తాం. పేరేమో వెంకటేశ్వరరావు అని ఉంటుంది. కానీ తిరుపతిలో చర్చిలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంట్లోనే చర్చి ఉంటుంది. ఏం చేయాలి వాళ్లని? భక్తన్నా ఉండాలి.. లేదా భయమైనా ఉండాలి. వాళ్లకి ఆ రెండూ లేవు.


తిరుమలలో మఠాల నిర్వహణపై మీ స్టాండ్‌ ఏమిటి..

అదో తేనె పుట్ట. ఎన్నో ఏళ్ల నుంచా ఉన్న వాళ్లను ఎలా ఇబ్బంది పెడతాం. మఠాధిపతులు, పీఠాధిపతులు అందరు ఉన్నారు ఇక్కడ. కొన్ని మఠాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయనే విమర్శలు వస్తునే ఉన్నాయి. టీటీడీ కేటాయించిన స్థలాల్లో కాకుండా అదనపు స్థలాలను ఆక్రమించుకుంటే మాత్రం.. వాటిపై చర్యలు తీసుకుంటున్నాం.


టీటీడీలో ప్రక్షాళన చేస్తామని సీఎం అన్నారు. ఆ దిశగా ఏం చేస్తున్నారు

గతంలో జరిగిన కొన్ని అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వం స్టేట్‌ విజిలెన్స్‌తో విచారణ చేయిస్తోంది. నెయ్యి కల్తీ వ్యవహరంపై కూడా సిట్‌ వేగంగా దర్యాప్తు చేస్తోంది. దానిపై ఇప్పట్లో ఏం మాట్లాలేం. రిపోర్టులు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకుంటాం. గతంలో సివిల్‌ వర్క్స్‌ విపరీతం చేశారు. స్వామి డబ్బులంతా సివిల్‌ వర్క్స్‌ కోసం వెళ్లిపోతున్నాయి. ముందు ఆపనుల్ని ఆపేయాలి. ఉన్న భవనాలను కూల్చేసి కొత్తవి కట్టడం అవసరమా? టీటీడీకి వచ్చే ఆదాయంలో ఒక శాతం తిరుపతి మున్సిపాలటీకి ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ రానున్న బోర్డులో చర్చిస్తాం. దేవుడు సొమ్ము ఇలా దుర్వినియోగం అయితే ఎలా? వందల మైళ్ల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుని వందో రెండొందలో హుండీలో వేస్తారు భక్తులు. కమీషన్ల కోసం వారి భక్తిని ఇలా దుబారా చేస్తే ఎలా. అందుకే తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తామని సీఎంగారు చెప్పారు.


టీటీడీ డిపాజిట్ల మళ్లింపు ప్రక్రియ ఏదశలో ఉంది...

దాదాపు రూ. 4,800 కోట్లు ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఉన్నాయి. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లం. కాలపరిమితి పూర్తవగానే భద్రత కోసం జాతీయ బ్యాంకులకు మళ్లిస్తాం. ఇక కొత్త డిపాజిట్‌లు అన్నీ మాత్రం జాతీయ బ్యాంకుల్లోనే వేస్తాం.

టూరిజం టికెట్ల కోటా రద్దు వెనుక కారణం...

రూ.300 టూరిజం టికెట్‌ను అధిక ధరకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నేనే స్వయంగా రూ.3,300 పెట్టి కొనుగోలు చేశాను. విజిలెన్స్‌ వాళ్లకు చెప్పాను. వాళ్లు కూడా రూ.300 టికెట్‌ను రూ.3,300 కొన్నారు. దీంతో టూరిజం కోటానే రద్దు చేశాం. తిరుమలలోని కొన్ని దుకాణాల్లోనూ దర్శన టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు తెలిసింది. దానిపై కూడా నిఘా పెట్టాం.


ఆభరణాలు, బంగారు నిల్వలు భద్రంగానే ఉన్నాయా...

అన్ని సేఫ్‌గానే ఉన్నాయి. ఎలాంటి సందేహాలు అవసరం లేదు.

‘‘తిరుమలలో 30 దుకాణాలు తిరిగితే కనీసం శ్రీవేంకటేశ్వరస్వామి ఉండే ఉంగరాలు దొరకవు కానీ, శిలువ బొమ్మలుండే కడియాలు ఉంటున్నాయి. దుకాణాల వ్యవహర తీరును కూడా మార్చాలి.’’


ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్‌ ఏ1

ఈవార్తను కూడా చదవండి: APSRTC: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన

ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2024 | 01:44 PM