Anitha: అత్యాచార ఘటనలను ఆ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారు: హోంమంత్రి అనిత..
ABN, Publish Date - Nov 03 , 2024 | 03:15 PM
వడమాలపేటలో చిన్నారిపై హత్యాచారం చాలా బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (ఆదివారం) బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
తిరుపతి: మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచార ఘటనలను వైసీపీ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆ పార్టీ నేతలు రాజకీయ రాబందుల్లా మారిపోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాంధులు రెచ్చిపోయిన ప్రతి చోటకు చేరి వారిపై అఘాయిత్యాలను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో పోలీసు, సీసీ కెమెరాల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని అనిత మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి అధికార పార్టీపై అవాకులు, చవాకులు పేలిన వైసీపీ నేతలు షర్మిల వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్తున్న ఆ నాయకులంతా అన్న (జగన్) చేతిలో మోసపోయిన షర్మిలకు అండగా ఎందుకు నిలబడలేదని అనిత మండిపడ్డారు.
వడమాలపేటలో చిన్నారిపై హత్యాచారం చాలా బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (ఆదివారం) బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ కేసులో నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అనిత అన్నారు. మూడు నెలల్లో శిక్ష పడేలా ప్రత్యేక కోర్టుకి కేసుని తీసుకెళ్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. నిందితుడికి వ్యతిరేకంగా పటిష్టమైన సాక్షాదారాలను ఇన్ టైంలో పోలీసులు నివేదిస్తారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.10లక్షల చెక్కును వారికి అందజేశారు. చిన్నారి తల్లి కోరిన మేరకు ఇల్లు, బాలిక తండ్రికి ఉద్యోగం కల్పిస్తున్నామని చెప్పారు. ఏపీలో గంజాయి సాగు అరికట్టేందుకు డ్రోనులు వినియోగిస్తున్నట్లు అనిత వెల్లడించారు. గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు త్వరలో ప్రత్యేక కిట్లు అందుబాటులోకి రానున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. అభంశుభం తెలియని చిన్న పిల్లను చాక్లెట్ పేరుతో తీసుకెళ్లి హత్యాచారం చేయడం తల దించుకునే చర్య అని ధ్వజమెత్తారు.
అసలేం జరిగిందంటే..
కేవీబీ పురం మండలానికి చెందిన దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఇద్దరి పిల్లలతో కలిసి అత్తగారి ఊరైన వడమాలపేట మండలానికి నెల రోజుల క్రితం వచ్చారు. చిన్న పిల్లలిద్దరినీ వారి అమ్మమ్మ వద్ద ఉంచి ఇరువురు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే పిల్లలకు మామ వరసయ్యే సుశాంత్ అనే వ్యక్తి తరచూ వారి వద్దకు వచ్చేవాడు. శుక్రవారం సాయంత్రం చాకెట్లు ఇస్తానని చెప్పి మూడున్నరేళ్ల బాలికను పాఠశాల సమీపానికి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం చేసి అతి దారుణం హత్య చేశాడు. మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశాడు.
అదే రోజు సాయంత్రం పని నుంచి ఇంటి వచ్చిన బాలిక తల్లిదండ్రులకు కుమార్తె కనిపించలేదు. దీంతో వారు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దీంతో హత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే వారికి రూ.10లక్షలు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ హోంమంత్రి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Politics: చంద్రబాబు.. ప్రజా ముఖ్యమంత్రి
AP Politics: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో భారీ కుంభకోణం
Julakanti Brahmananda Reddy: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..
Updated Date - Nov 03 , 2024 | 03:17 PM