ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medical: నిబంధనలు గాలికి..!

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:45 AM

అర్హత లేకనే మందుల (ఔషధ) దుకాణాలు పెట్టేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యుల సిఫారసు లేకుండా ఇస్తున్న మందులతో రోగుల ప్రాణాల మీదకు వస్తోంది.

మందులు

ప్రజల ప్రాణాలతో చెలగాటం

మామూళ్ల మత్తులో వైద్యాధికారులు

తిరుపతి(వైద్యం), ఆంధ్రజ్యోతి : తిరుపతికి చెందిన ఓ యువతి గర్భం దాల్చింది. దాన్ని పొగొట్టుకునేందుకు మందుల కోసం తిరుపతిలోని ప్రైవేటు దుకాణాన్ని ఆశ్రయించింది. డాక్టరు చీటీ లేకుండా మందులు ఇవ్వకూడదని, అలా ఇవ్వాలంటే అదనంగా నగదు చెల్లించాల్సి వస్తుందని దుకాణదారుడు చెప్పాడు. గత్యంతరం లేక ఎమ్మార్పీ కంటే రెండింతల ధర పెట్టి మందులు కొనుగోలు చేసింది. వాటిని ఇష్టానుసారం వాడటం వల్ల తీవ్ర రక్తస్రావమై ప్రాణం మీదకు తెచ్చుకుని ఆస్పత్రి పాలైంది.

శ్రీకాళహస్తికి చెందిన సురేష్‌ తన ఐదేళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో పట్టణంలోని ఓ మందుల దుకాణానికి వెళ్లి విషయం చెప్పాడు. దుకాణ యజమాని మందులు ఇచ్చి, మూడు రోజులు వాడమని చెప్పాడు. ఆ మందులు వాడినా ఎలాంటి ఉపయోగమూ లేకపోగా బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. చివరకు డాక్టరు దగ్గరకు వెళ్లారు. బాలుడిని రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి రూ.10 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

జిల్లాలో ఇటువంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నా సంబంధిత వైద్యాధికారులు కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టడం లేదు. జిల్లావ్యాప్తంగా 2,700 లైసెన్సు కలిగిన మందుల దుకాణాలు ఉంటే అందులో తిరుపతిలో 600లకు పైగా ఉన్నాయి. లైసెన్సు లేకుండా 500కు పైగా కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో సగటున రోజుకు రూ.6 నుంచి 8 కోట్ల వ్యాపారం జరుగుతోంది. అర్హత లేకనే మందుల (ఔషధ) దుకాణాలు పెట్టేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యుల సిఫారసు లేకుండా ఇస్తున్న మందులతో రోగుల ప్రాణాల మీదకు వస్తోంది.

నిబంధనలు ఇలా..

మందుల దుకాణం ప్రారంభించాలంటే ముందుగా ఔషధ నియంత్రణ అధికారుల అనుమతి తీసుకోవాలి.

దుకాణంలో డీఫార్మసీ పూర్తి చేసిన ఫార్మాసిస్టు తప్పక అందుబాటులో ఉండాలి. అనుమతి వారి పేరుతోనే ఉండాలి.

మందుల విక్రయాలు పూర్తిగా డాక్టరు చీటి ఉంటేనే విక్రయించాలి. కొనుగోలు చేసిన, విక్రయించిన మందుల వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలి.


అమలు చేసేవారేరి?

మందుల విక్రయదారులకు తప్పక బిల్లు చెల్లించాలి. కానీ జిల్లాలో ఎక్కడా జరగడం లేదు.

ఇరకు గదుల్లోనూ దుకాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఫార్మసీ చదివిన వారు లేకనే మందుల దుకాణాలు కొనసాగుతున్నాయి. అవగాహన లేకనే మందులు ఇచ్చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఔషధ దుకాణాలకు ఐదేళ్లకొకసారి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉండగా పాటించడంలేదు.

పత్తాలేని అధికారులు..

జిల్లాలో ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు ఒకరు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఇద్దరు ఉన్నారు. వీరు మందుల దుకాణం ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో కొలతలు, నిబంధనలు పరిశీలించాలి. నెలలో ఒకసారైనా దుకాణాలను తనిఖీ చేయాలి. ఆ దిశగా ఎక్కడా కనిపించడం లేదు. ముడుపులు అందుతుండడం వల్లే అటువైపు చూడడం లేదన్న విమర్శలున్నాయి. దుకాణాలు పక్క ప్రాంతాల్లోకి మార్చుకోవాలన్నా లేదా ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవాలన్నా అదనంగా ముడుపులు చెల్లించాల్సి వస్తోందని విక్రయదారులు వాపోతున్నారు. ఇదే వ్యవహారంలో ఇటీవల గూడూరులో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి చిక్కారు.

Updated Date - Oct 21 , 2024 | 01:45 AM