Share News

Tirumala Free Darshan: తిరుమల వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకుంటే.. మీ దర్శనం చాలా ఈజీ..

ABN , Publish Date - Oct 07 , 2024 | 09:16 AM

టోకెన్ విధానంలో సర్వ దర్శనం మూడు నుంచి ఆరు గంటల్లోపు పూర్తవుతుంది. సాధారణంగా చాలామంది భక్తులకు టోకెన్ విధానంపై అవగాహన లేకపోవడంతో నేరుగా తిరుపతి నుంచి తిరుమల కొండపైకి చేరుకుని సర్వ దర్శనం క్యూలైన్‌లోకి వెళ్లడంతో..

Tirumala Free Darshan: తిరుమల వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకుంటే.. మీ దర్శనం చాలా ఈజీ..
Tirumala

తిరుమల వెళ్తున్నారా.. దర్శనం కోసం ముందుగా ఎలాంటి టికెట్లు బుక్ చేసుకోలేదా.. వెళ్లిన తర్వాత దర్శనానికి ఎంత సమయం పడుతుందో అని ఆందోళన చెందుతున్నారా.. మీకు ఆ ఆందోళన అవసరం లేదు. తిరుమలలో సర్వ దర్శనం వేగంగా పూర్తయ్యేందుకు టీటీడీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. టోకెన్ విధానంలో సర్వ దర్శనం మూడు నుంచి ఆరు గంటల్లోపు పూర్తవుతుంది. సాధారణంగా చాలామంది భక్తులకు టోకెన్ విధానంపై అవగాహన లేకపోవడంతో నేరుగా తిరుపతి నుంచి తిరుమల కొండపైకి చేరుకుని సర్వ దర్శనం క్యూలైన్‌లోకి వెళ్లడంతో దర్శనం ఆలస్యమవుతూ ఉంటుంది. అదే టోకెన్‌ తీసుకుని వెళ్తే.. మీకు కేటాయించిన సమయంలో క్యూలైన్‌లోకి వెళ్లి మూడు నుంచి ఆరు గంటల్లోపు దర్శనం చేసుకుని బయటకు రావచ్చు. ఈ సర్వదర్శనం టికెట్లు ఎలా పొందాలి. ఎక్కడ తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. అసలు సర్వదర్శనం టోకెన్లు ఎక్కడ పొందాలి. ఏ సమయంలో ఈ టికెట్లను జారీ చేస్తారనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.


సర్వదర్శనం టోకెన్లు..

తిరుమలలో బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుపథం, స్లాటెడ్ సర్వదర్శనం, సరదర్శనం సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్రేక్ దర్శనం విషయంలో కొంత కఠినంగా వ్యవహారించాలని, సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు ఆదేశించారు. దీంతో నేరుగా వీఐపీలు దర్శనం కోసం వెళ్లినప్పుడు, వారి సిఫార్సు లేఖల మీద కుటుంబ సభ్యులు వెళ్లినప్పుడు పరిమిత సంఖ్యలో టికెట్లు కేటాయిస్తారు. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రెండు నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి. పరిమిత సంఖ్యలో టికెట్లు కేటాయిండంతో అందరికీ ఇవి లభించవు. దీంతో సర్వదర్శనానికి వెళ్లే భక్తులు అధికంగా ఉంటారు. అలాంటి భక్తులు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే త్వరగా తమ దర్శనాన్ని పూర్తిచేసుకోవచ్చు.


టికెట్ల కేటాయింపు..

స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లను పరిమిత సంఖ్యలోనే కేటాయిస్తారు. తెల్లవారుజామున 3నుంచి4 గంటల మధ్య సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తారు. టికెట్లు అయ్యేవరకు వీటిని కేటాయిస్తారు. మొదట క్యూలైన్‌లో ఉన్న భక్తులకే ప్రాధాన్యత ఉంటుంది. తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలనుకునే భక్తుడు తన ఆధార్ కార్డు తీసుకుని వెళ్లాలి. కుటుంబంలోని అందరి ఆధార్‌ కార్డులు ఒక వ్యక్తి తీసుకునివెళ్తే టోకెన్లు ఇవ్వరు. ఐదేళ్లలోపు పిల్లలకు టోకెన్ అవసరం ఉండదు. ఈ టోకెన్లపై క్యూలైన్‌లో రిపోర్టు చేయాల్సిన సమయం ఇస్తారు. ఆ సమయానికి కంటే అరగంట ముందు క్యూలైన్‌లోకి వెళ్లొచ్చు. ఈ స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ వెనుక గోవింద రాజుల సత్రాలు, సెంట్రల్ బస్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాసంలో ఉంటే కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. ఈ టోకెన్లను పొందటానికి ఎలాంటి సిఫార్సులను అనుమతించరు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 07 , 2024 | 10:37 AM