ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Claims అంతులేని దోపిడీ

ABN, Publish Date - Dec 04 , 2024 | 03:11 AM

కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు, కాకినాడ సెజ్‌ల్లో జగన్‌ టీమ్‌ బలవంతపు కబ్జాలపై సీఐడీ విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించినట్లు సమాచారం. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • అరబిందో కోసం చరిత్రలో చూడని దారుణాలు

  • 10% చేతిలో పెట్టి మెజారిటీ వాటా లాక్కొన్నారు

  • మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • ఈ కబ్జాలన్నింటినీ నిగ్గు తేలుస్తామని స్పష్టీకరణ

  • కబ్జా భూముల విలువే 5-6 వేల కోట్లన్న మంత్రులు

  • పోర్టును ప్రైవేటు సామ్రాజ్యంలా మార్చారన్న పవన్‌

  • కాకినాడ ఉదంతాన్ని వివరించిన డిప్యూటీ సీఎం

  • జల్‌ జీవన్‌ అమలులో జాప్యంపై బాబు ఆగ్రహం

  • కొందరు అధికారుల్లో బద్ధకం తగ్గడం లేదని వ్యాఖ్య

అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు, కాకినాడ సెజ్‌ల్లో జగన్‌ టీమ్‌ బలవంతపు కబ్జాలపై సీఐడీ విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించినట్లు సమాచారం. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాకినాడ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు జగన్‌ హయాంలో కాకినాడ కేంద్రంగా జరిగిన దందాలకు అంతేలేదని, చరిత్రలో ఏనాడూ ఎవరూ చేయని విధంగా దారుణంగా దోచుకున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు ప్రైవేటు యాజమాన్యంలో ఉంది. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఆ పోర్టు యాజమాన్యంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి బెదిరించి అందులో 59శాతం వాటాను తమకు చెందిన అరబిందో సంస్థకు రాయించారు. కేవలం పదిశాతం విలువ చెల్లించి ఏకంగా 60శాతం వాటా రాయుంచుకొన్నారు. కాకినాడ సెజ్‌లో కూడా అదే జరిగింది. ఆ సెజ్‌ కూడా ప్రైవేటు యాజమాన్యంలో ఉంది. దాని కింద 7వేల ఎకరాల భూమి ఉంది. దాని యాజమాన్యాన్ని కూడా బెదిరించి లొంగదీసుకొని అత్యధిక శాతం వాటా అరబిందో కంపెనీ పేరుతో రాయించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇంత దారుణంగా వాటాలు రాయించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు. అందుకే ఈ కబ్జాలపై దర్యాప్తునకు సీఐడీని వేయాలని నిర్ణయం తీసుకొన్నాం’ అని ఆయన వివరించారు. సెజ్‌లో జగన్‌ టీమ్‌ రాయించుకొన్న భూముల విలువ రూ.3వేల కోట్లు ఉండవచ్చని సీఎం చెప్పినప్పుడు దానిని కొందరు మంత్రులు సవరించారు.


ఆ భూముల విలువ రూ.ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఉంటుందని చెప్పారు. కాకినాడ పోర్టు వద్ద నెలకొన్న వాతావరణం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వివరించారు. ‘విదేశాల్లో పోర్టుల వద్దకు సామాన్య ప్రజలను కూడా అనుమతిస్తారు. ఒక స్ధాయి వరకూ ఎవరైనా వచ్చి సందర్శించడానికి అనుమతి ఉంటుంది. కానీ కాకినాడ పోర్టు దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రానివ్వరు. దానిని ఒక ప్రైవేటు సామ్రాజ్యం మాదిరిగా తయారు చేశారు. అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నందువల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు అనిపిస్తోంది’ అన్నారు. మద్యం, ఇసుకకు సంబంధించి చాలావరకూ సమస్యలను పరిష్కరించామని, రేషన్‌ బియ్యం మాఫియా, లాండ్‌ మాఫియాల పని పట్టాల్సి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ రెండు అంశాలను పీడీ చట్టం పరిధిలోకి తెచ్చామని, కొద్దిరోజుల్లోనే ఫలితం చూపిస్తామన్నారు. వైసీపీ హయాంలో రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం చేసిన వాళ్లే ఇప్పుడు మళ్లీ అరుస్తున్నారని, వ్యవస్థలను నాశనం చేశామన్న బాధ వారిలో ఏ కోశానా లేదని ఒక సీనియర్‌ మంత్రి విమర్శించారు.

  • అధికారుల్లో బద్దకం వదలలేదు...

కొందరు అధికారుల్లో ఇంకా బద్దకం వదలలేదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. జల్‌ జీవన్‌ పఽథకం ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొన్ని రాష్ట్రాలు రూ. వెయ్యి నుంచి రూ. పదిహేను వందల కోట్ల వరకూ ఈ పఽథకం కింద నిధులు కేంద్రం నుంచి తీసుకొన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పైసా కూడా తీసుకోలేకపోయారు. వచ్చే ఏడాదితో ఈ పఽథకం గడువు ముగిసిపోతోంది. అధికారుల వెంట నేను ఎంత పడుతున్నా ఈ నిధులకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ఢిల్లీకి పంపలేకపోతున్నారు. నేను ఢిల్లీ వెళ్లి నిధుల కోసం అడిగితే రాష్ట్రం నుంచి ప్రతిపాదనలే రాకుండా నిధులు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు.


నేను ఎన్నిసార్లు చెప్పినా కొందరు అధికారుల్లో చలనం రావడం లేదు’ అని అన్నారు. తాను ఢిల్లీ వెళ్లినప్పుడు ఇదే సమస్య ఎదురైందని పవన్‌ చెప్పారు. ‘నేను ఇటీవల ఒక గ్రామం వెళ్లినప్పుడు ఆ గ్రామంలో మంచినీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. రూ.4లక్షలు ఇస్తే పని పూర్తయ్యి ఆ గ్రామం మొత్తానికి మంచినీరు అందుతుంది. అధికారులు ప్రతిపాదన పంపకపోవడంతో నిధులు విడుదల కాలేదు. కొందరు అధికారులు ప్రాధాన్యాలు గుర్తించడం లేదు’ అని పవన్‌ అన్నారు. కాగా, ఈ నెల 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నందువల్ల అన్ని శాఖల్లో మంత్రులు....అధికారులతో సమీక్షలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. దీనివల్ల వ్యక్తిగతంగా మంత్రుల ఇమేజీతోపాటు ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా పెరుగుతుందని అన్నారు.

  • అధికారికంగా ఆత్మార్పణ దినం

తెలుగువారికి ఒక రాష్ట్రం కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన డిసెంబర్‌ 15న ఆత్మార్పణ దినం అధికారికంగా నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. తెలుగువారికి ముఖ్యమైన రోజైనందున దానికి ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈలోపు అన్ని పాఠశాలల్లో దీనిపై కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - Dec 04 , 2024 | 03:35 AM