CM Chandrababu: పోలవరం గేమ్ చేంజర్ !
ABN, Publish Date - Nov 20 , 2024 | 03:03 AM
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. గేమ్ చేంజర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కరువును నివారించవచ్చని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం నిర్మాణంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2027 జూలై నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువే ఉండదు: సీఎం
2019-24 మధ్య జగన్ సర్కారు విధ్వంసం
డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా గ్రహించలేదు
2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి
గోదావరి-పెన్నా అనుసంధానానికి రూ.72 వేల కోట్లు కావాలి
4‘పీ’ విధానంలో సమీకరించే యోచన
ఎడమ కాలువ ద్వారా వర్షాకాలం నాటికి అనకాపల్లికి గోదావరి జలాలు
బాహుదా వరకు తరలిస్తాం
శాసనసభలో సీఎం చంద్రబాబు వెల్లడి
ప్రధాని మోదీ, నిర్మలకు ధన్యవాదాలు
ఒక వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలు రాష్ట్రానికి శాపమయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం కేవలం 3.08 శాతం పనులే చేసి.. రూ.వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. గత ప్రభుత్వంలో జల వనరుల మంత్రికి డయాఫ్రం వాల్ అంటే తెలియదు. ప్రతి ప్రాజెక్టుకూ ఆ వాల్ కడతారట! టీఎంసీకి, క్యూసెక్కులకు మధ్య తేడా కూడా ఆయనకు తెలియదు.
- సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. గేమ్ చేంజర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కరువును నివారించవచ్చని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం నిర్మాణంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2027 జూలై నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద రిజర్వాయరు నిర్మించి.. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను తరలించి 150 టీఎంసీలను నిల్వ చేస్తామని చెప్పారు. అక్కడ నుంచి బనకచర్లకు తీసుకెళ్లి పెన్నా నదికి అనుసంధానించే కార్యక్రమం చేపడతామన్నారు. ఇందుకోసం రూ.72 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించడం కష్టమేనన్నారు. దీనిపై కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పారు. 4 ‘పీ’(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్) విధానంలో నిధులు సమీకరించడంపై దృష్టిపెడతామన్నారు.
హైబ్రిడ్ విధానంలో కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి అనకాపల్లికి గోదావరి జలాలను తరలిస్తామని తెలిపారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లాలోని నదులను అనుసంధానం చేసుకుంటూ.. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధారలను కలుపుతూ.. బాహుదా నది దాకా తీసుకెళ్తామన్నారు. వంశధారలో వరద ఉంటే.. నీరు విశాఖ వైపు వస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీకాకుళం జిల్లా సరిహద్దు దాకా గోదావరి జలాలను తరలిస్తామన్నారు. నదుల అనుసంధానంపై వినూత్న ఆలోచన చేస్తున్నామన్నారు.
జాతీయ రహదారి వెంబడి జల రవాణా చేపట్టే యోచన ఉందని.. అందుకు ముందుకొచ్చే భాగస్వామ్య సంస్థలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఇందులో రైతులనూ భాగస్వాములను చేయాలన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సలహాపై సానుకూలంగా స్పందించారు. అయితే రైతులపై భారం వేయబోమని సీఎం తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించడం సహా ..త్వరితగతిన పూర్తయ్యేందుకు వీలుగా కార్యనిర్వహణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించి.. నిధులు మంజూరు చేస్తున్నందుకు ప్రధాన మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి ఆర్‌ఆర్ పాటిల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయనకు పని అప్పగిస్తే.. పూర్తిచేసేదాకా వదలడన్నారు. వరదల సమయంలో ఆయన పడిన కష్టం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఇంకా ఏమన్నారంటే..
కృష్ణా జలాలను సీమకు వినియోగించాం..
పోలవరం పూర్తయితే కరువుకు చెక్ పెట్టినట్లే. దీని నిర్మాణం ఆలస్యం కాకూడదనే రాష్ట్రప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. పోలవరం ఆలస్యమవుతుందని పట్టిసీమ పథకాన్ని నిర్మించి 100 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించాం. ఈ మేరకు కృష్ణా జలాలను రాయలసీమలో వినియోగించాం. పోలవరం పూర్తి చేస్తే 200 టీఎంసీలను సీమకు వాడుకోవచ్చు. ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేస్తాం. ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం. 2019-24 మధ్య జగన్ పాలన పోలవరం ప్రాజెక్టు పాలిట విధ్వంసకరం. జగన్ రివర్స్ టెండర్ పేరిట విధ్వంసానికి దిగాడు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి శాఖ వద్దన్నా వినలేదు. అప్పటి వరకూ వేగవంతంగా పనులు చేస్తున్న నిర్మాణ సంస్థను తరిమేశారు. దీనివల్ల 2020దాకా ప్రాజెక్టు ప్రాంతంలో పనులు చేపట్టేవారే లేకుండా పోయారు. పర్యవేక్షణా కొరవడింది. ఫలితంగా 2020లో వచ్చిన భారీ వరదకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. భూమిలోపల ఉండే ఈ వాల్ వరదకు దెబ్బతిన్నదో లేదో కూడా జగన్ సర్కారు గ్రహించలేదు. 2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. 2021 నాటికే పోలవరం పూర్తయ్యేది.
రెండు నెలలు అటూఇటుగా..
పోలవరం నిర్మాణాన్ని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవహేళన చేస్తే.. జగన్ ధ్వంసం చేశాడు. 2014-19 మధ్య ఈ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం రూ.16,493 కోట్లు వ్యయం చేసింది. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఖర్చుచేసింది రూ.4,099 కోట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కేంద్రం పోలవరానికి రూ.12,157 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు రెండేళ్లలో విడుదలవుతాయి. 2026 మార్చిలోపు కొత్త డయాఫ్రం వాల్, దానికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాంను కూడా పూర్తి చేస్తాం. 2027 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తాం. రెండు నెలలు అటూ ఇటుగా ఆ ఏడాదే పూర్తి చేస్తాం. 194.60 టీఎంసీల గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యంతో 45.72 మీటర్ల ఎత్తున నిర్మిస్తాం.
అవుట్‌సోర్సింగ్ విధానంలో రోడ్ల నిర్మాణం
ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు: సీఎం
గ్రామీణ రహదారులు కూడా జాతీయ రహదారుల స్థాయిలో ఉండేలా రోడ్ నెట్ వర్క్‌ను పెంచాలన్నదే తన ఆలోచనగా చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. జాతీయ రహదారులను కలుపుతూ మండల స్థాయిలో రోడ్ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేసే రహదారులను అవుట్‌సోర్సింగ్ విధానంలో నిర్మించడం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మినహా.. కార్లు, బస్సులు, భారీ రవాణా వాహనాల నుంచి టోల్ వసూలు చేయడంపై శాసనసభ్యులు తన అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ అవుట్‌సోర్సింగ్ విధానంలో రహదారుల నిర్మాణం సాగించాలన్న వినూత్న ఆలోచనను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. తన ఆలోచనను సమర్ధించేవారు చేతులు పైకెత్తాలని కోరగా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సంఘీభావం వ్యక్తం చేశారు.
Updated Date - Nov 20 , 2024 | 03:03 AM