CM Chandrababu : భూ వివాదాలపై టాస్క్‌ఫోర్స్
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:14 AM
‘‘లోపభూయిష్ఠమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి పట్టాదారు పాస్‌పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ చక్కదిద్ది, భూమిని పోగొట్టుకున్న అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.
కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీలతో జిల్లాల్లో ఏర్పాటు
‘టైట్లింగ్’ దెబ్బకు భూమి కోల్పోయిన వారికి న్యాయం
మరిన్ని సమస్యలు తెచ్చిన ఫ్రీ హోల్డ్ విధానం
13 లక్షల్లో 25 వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసేశారు
రెవెన్యూ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా చేయాలి
పింఛన్లపై 3 నెలల్లో నివేదిక.. అనర్హుల తొలగింపు
నేరాల కట్టడికి.. త్రిముఖ వ్యూహం
‘సోషల్’ సైకోల నియంత్రణకు కఠిన చట్టాలు
అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం
ఇసుక రవాణాలో ఎవరున్నా కచ్చితంగా చర్యలు
ఐదేళ్లలో పేదలందరికీ ఇళ్లు.. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు.. త్వరలో లక్ష గృహప్రవేశాలు
రూ.1,878 కోట్లతో బీసీల సంక్షేమానికి చర్యలు
ఎస్పీలు, కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం
అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘లోపభూయిష్ఠమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి పట్టాదారు పాస్‌పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ చక్కదిద్ది, భూమిని పోగొట్టుకున్న అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ సమస్యలపై కూలంకషంగా చర్చించారు. తొలుత రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు... కలెక్టర్లు, ఎస్పీలకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. ‘‘గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ భూములను కాజేశారు. ఎన్‌ఆర్‌ఐలకు వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా కొట్టేశారు. వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 70శాతం ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి.
ప్రధానంగా కడప, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో రెవెన్యూ అక్రమాలు ఎక్కువగా జరిగాయి. 13లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసి... అందులో 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇప్పుడు ఈ తప్పులన్నీ సరిచేసి బాధ్యులకు చట్టప్రకారం శిక్షపడేలా చేయాలి. బాధితుల్లో నమ్మకం కల్పించాలి’’ అని చంద్రబాబు నిర్దేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులపై కాలపరిమితి పెట్టుకుని అధికారులు ఒక లాజికల్ ముగింపునకు రావాలని, అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. భూ వివాదాలు, భూ కబ్జాల కేసుల పరిష్కారానికి జిల్లాల స్థాయిలో జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూ సంబంధిత వివాదాల పరిష్కారానికి రెవెన్యూ, హోంశాఖలు కలిసి పనిచేస్తే బాగుంటుందని హోంమంత్రి అనిత అభిప్రాయపడగా, చంద్రబాబు స్పందించారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ సభ్యులుగా జాయింట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజిటల్ కీని ఉపయోగించి ఎవరైనా భూములు మారిస్తే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నేను జాంబవంతుడ్ని... మీరంతా హనుమంతులు..
సిసోడియా చమత్కారం
రామాయణంలో హనుమంతుడికి ఆయనకే తెలియనంత శక్తి ఉన్నదని.. కలెక్టర్లు కూడా తమకు ఉన్న విశేషాధికారాలను గుర్తించాల్సి ఉన్నదని రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వ్యాఖ్యానించారు. ‘‘ఒక శాపం కారణంగా హనుమంతుడికి తన శక్తి తనకు తెలియదు. సముద్రం అవతలకు ఎవరు వెళ్లగలరని హనుమంతుడు ఆలోచిస్తుంటాడు. జాంబవంతుడు వచ్చి హనుమంతుడికి తన బలాన్ని గుర్తుచేస్తాడు. అప్పుడు హనుమంతుడు తన శక్తినంతా కూడదీసుకుని సముద్రాన్ని దాటేశాడు. ఈ కథలో నేను జాంబవంతుడిని. మీరంతా హనుమంతులు’’ అని సిసోడియా వివరించారు. ఆయన చెప్పిన కథ విని చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కాసేపు నవ్వుకున్నారు. జిల్లాల్లో ఎమ్మార్వోలు డిజిటల్ కీ ఇంకెవరికి ఇవ్వకూడదని సిసోడియా సూచించారు.
రోడ్లన్నీ రెండేళ్లలో పూర్తి కావాలి: సీఎం
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణ పనులు వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు చివరిరోజు గురువారం ఆర్‌అండ్‌బీ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ‘‘రహదారుల నిర్మాణం విషయంలో రాజీ పడొద్దు. స్టేట్ హైవేస్, నేషనల్ హైవే ప్రాజెక్టు పురోగతిపై కలెక్టర్లు 15రోజులకోసారి సమీక్షించాలి. హైవే పనులకు ఎవరైనా అడ్డుపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి’’ అని హెచ్చరించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతీలాల్ దండే... రోడ్లు, భవనాల శాఖ ప్రగతిని వివరించారు. జిల్లాల్లో రోడ్ల నిర్మాణాలకు ఎదురవుతున్న భూసేకరణ సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. రోడ్ల నిర్మాణాలకు రూ.65వేల కోట్లు ఖర్చు చేస్తున్నామనీ, ఎక్కడా అడ్డంకులు లేకుండా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందని సీఎం అన్నారు. అందువల్ల నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Updated Date - Dec 13 , 2024 | 04:14 AM