బాపట్ల పేరెంట్-టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:46 AM
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు.
ఇంటి పెద్దలా.. సొంత మనిషిలా..!
బాపట్ల, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు. ఇక్కడ ఆయన వ్యవహరించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంటి పెద్దలా, సొంత మనిషిలా తమ దగ్గరకు వచ్చి ఇబ్బందులు విన్నారని తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. హైస్కూల్ పదో తరగతి గదిలోకి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. అక్కడ కూర్చుని.. పదో తరగతి విద్యార్థిని మీనాక్షి, ఆమె తండ్రితో మాట్లాడారు. నీ లక్ష్యం ఏమంటని సీఎం ప్రశ్నకు నేచురల్ ఫార్మింగ్ తన గోల్ అని మీనాక్షి సమాధానమివ్వడంతో ఆమెను మెచ్చుకున్నారు.
అమ్మ కొడుతుందని భయమా?
మీ పిల్లల భవిష్యత్తు గురించి కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని తల్లితండ్రులకు సీఎం చెప్పారు. మీ మార్కుల రిపోర్టును ఇంటికి పంపిస్తా.. పంపాలా వద్దా అని పిల్లలను చంద్రబాబు అడగగా విద్యార్థుల చాలా మంది వద్దన్నారు. ఎందుకు ఇంటికి మెసేజ్ వస్తే మీ అమ్మ కొడుతుందనా? అని సీఎం అడగడంతో పిల్లలంతా అవునంటూ సమాధానం ఇచ్చారు. విచ్చలవిడిగా సెల్‌ఫోన్ వాడొద్దని, డ్రగ్స్ జోలికెళ్లొద్దని పిల్లలకు సీఎం సూచించారు. తల్లిదండ్రులు టీచర్లు కూడా పిల్లల అలవాట్లను డేగకన్నుతో గమనిస్తూ ఉండాలని గట్టిగా చెప్పారు. ఈ సందర్భంగా తాడు లాగుడు (టగ్ ఆఫ్ వార్) పోటీల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పోటీపడ్డారు. దీనిలో చంద్రబాబు జట్టు విజయం సాధించింది. మరో పక్క విద్యార్థుల తల్లుల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సమీపం నుంచి నమాజ్ వినిపించిన సమయంలో సీఎం నిశ్శబ్దం పాటించారు.
సహపంక్తిగా భోజనం
సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో కలిసి నేల మీదే కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. చివర్లో తన తండ్రి భోజనం తిన్న ప్లేటును లోకేశ్ తీయడం అందర్నీ ఆకట్టుకుంది. కాదా, మంత్రి లోకేశ్ మూడు గంటల ముందే ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎంకు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో సమస్యల పరిష్కారానికి రూ. 1000 కోట్లు విడుదలకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
Updated Date - Dec 08 , 2024 | 04:46 AM