Share News

CM Chandrababu : మహిళలకు ఇంటి నుంచే పని!

ABN , Publish Date - Dec 25 , 2024 | 06:11 AM

రాష్ట్రంలో మహిళలకు ఇంటి నుంచే పనికల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా సహకార పని...

CM Chandrababu : మహిళలకు ఇంటి నుంచే పని!

  • సహకార, పొరుగు సేవల కేంద్రాలు

  • శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాల కల్పన

  • గృహిణులకు చాన్స్‌: సీఎం చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలకు ఇంటి నుంచే పనికల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా సహకార పని కేంద్రాలు(కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు), పొరుగు సేవల కేంద్రాలు(నైబర్‌హుడ్‌ వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు) ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. చదువుకున్న మహిళలు గృహిణులుగా మిగిలిపోకూడదని, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఇంటి నుంచే పని(వర్క్‌ ఫ్రం హోమ్‌), సహకార పని కేంద్రాలతో మహిళలకు విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళలను ఇంటికి పరిమితం చేయడం సరికాదని సీఎం అన్నారు. వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆర్థిక వృద్ధి పెరుగుతుందని తెలిపారు. సహకార పని కేంద్రాల ఏర్పాటు ద్వారా 2025, డిసెంబరు చివరి నాటికి 1.50 లక్షల మందికి అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వివరించారు.

ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు? వారి అవసరాలు ఏమిటి? అనే సమాచారం సేకరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అదేవిధంగా ఇప్పటికే నిర్ణయించిన రతన్‌ టాటా సృజనాత్మక కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో భవనాలను గుర్తించాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమలను, విద్యాసంస్థలను సృజనాత్మక కేంద్రాలకు అనుసంధానం చేయాలని నిర్దేశించారు.

Updated Date - Dec 25 , 2024 | 06:11 AM