CM Chandrababu : ధాన్యం సేకరణలో తప్పులు జరగొద్దు
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:50 AM
‘‘రైతు కష్టాన్ని దోచుకుంటే సహించేది లేదు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు. మేం అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి.
‘‘రైతు కష్టాన్ని దోచుకుంటే సహించేది లేదు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు. మేం అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడి తగ్గించి రైతులను అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే మా సంకల్పం. గత ప్రభుత్వ వైఫల్యాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఐదేళ్ల పాటు కాలువల్లో పూడిక తీత పనులు చేయలేదు. రైతులకు వరంగా మారిన పట్టిసీమను నాడు నిర్వీర్యం చేశారు. ధాన్యం సేకరణ చేసిన డబ్బులు కూడా రైతులకు జమ చేయలేదు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గంగూరు రైతు సేవా కేంద్రాన్ని, రైసుమిల్లును పరిశీలించారు. సంచుల కొరత తీవ్రంగా ఉన్నట్టు ఆయన గుర్తించారు. అనంతరం రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట దిగుబడి బాగా వచ్చిందని చంద్రబాబుకు రైతులు తెలిపారు. అనంతరం వెంకటాద్రి ఆయిల్ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలు ప్రక్రియను చంద్రబాబు పరిశీలించారు. తేమ శాతం లెక్కించే విధానాన్ని స్వయంగా చూశారు. రైతు సేవా కేంద్రం నుంచి మిల్లుకు వస్తున్న ధాన్యం తేమశాతంలో వ్యత్యాసం వస్తుందన్న ఫిర్యాదులపై ఆరా తీశారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, వాసంశెట్టి సుభాశ్, మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు శాసనసభ్యుడు బొడె ప్రసాద్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీర పాండ్యన్, ఆ శాఖ కమిషనర్ జిలానీ, రెవెన్యూశాఖ కమిషనర్ సిసోడియా, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీలు చేస్తా
‘ధాన్యం కొనుగోలులో రైతులు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ ఇబ్బందులను తొలగించేందుకు తానే నేరుగా గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని చంద్రబాబు అన్నారు. ధాన్యం కొనుగోలులో అధికారుల పనితీరు బాగా లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం పండించిన రైతు... మిల్లులో ధాన్యం విక్రయించే విషయంలోనూ శ్రద్ధ వహించాల్సిందేననీ, దళారులకు అమ్మితే తక్కువ ధర లభిస్తుందని తెలిపారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే వారిపై పీడీ యాక్టు ద్వారా కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. వరదల కారణంగా పంటనష్ట పరిహారం తీసుకున్న రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయటంలేదని విలేకరులు సీఎం దృష్టికి తీసుకురాగా, ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.