FiberNet Corporation's : ‘ఫైబర్’ ప్రక్షాళన ఏదీ?
ABN, Publish Date - Dec 10 , 2024 | 04:54 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో ప్రక్షాళన జరుగడం లేదు. జగన్ సైన్యం ఇప్పటికీ తిష్ఠ వేసుకుని కూర్చుంది.
కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలవుతున్నా మార్పులేదు
మధుసూదనరెడ్డి జమానాలో 300 మంది పైచిలుకు వైసీపీ కార్యకర్తలకు కొలువు
జీఎంగా గంధంశెట్టి సురేశ్ నియామకం
ఆయనకు ఐఏఎస్‌లకు మించిన భారీవేతనం
ఇప్పటికీ ఆయనే కీలకాధికారి
ఇటీవల జగన్ సైన్యంలో కొద్ది మంది తొలగింపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో ప్రక్షాళన జరుగడం లేదు. జగన్ సైన్యం ఇప్పటికీ తిష్ఠ వేసుకుని కూర్చుంది. పైగా అక్రమార్కులకే అక్కడ పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి గద్దెనెక్కేనాటికి ఫైబర్‌నెట్‌లో దాదాపు 1,100 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో దాదాపు 300 మంది కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అనుయాయులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే. వీరెవరూ ఫైబర్‌నెట్ కార్యాలయానికే రాలేదు. కానీ నెలనెలా వారి ఖాతాల్లో జీతాలు పడిపోయాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం కడప జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలకు చేతికి ఎముక లేనట్లుగా రూ.లక్షల్లో వేతనాలు ఇచ్చేసింది. పులివెందుల నియోజకవర్గానికి చెందినవారినైతే కొత్త అల్లుడి తరహాలో చూసుకున్నారు. గంధంశెట్టి సురేశ్‌ను నెలకు రూ.2 లక్షల జీతంతో రాష్ట్ర ఎయిర్‌పోర్టు అథారిటీ లిమిటెడ్ (ఏపీఏడీసీ)లో జనరల్ మేనేజర్‌గా నియమించారు. ఇన్వె్‌స్టమెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవెన్ పదవీ విరమణకు కొద్దిరోజుల ముందు ఈ నియామకాన్ని చేపట్టారు. ఆ తర్వాత కొద్దికాలానికే సురేశ్‌ను అప్పటి ఫైబర్‌నెట్ ఎండీ మధుసూదనరెడ్డి తన వద్దకు రప్పించుకున్నారు. అక్కడ కీలకమైన ఆర్థిక విభాగంలో జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రతినెలా రెండు లక్షల జీతంతో పాటు.. అదనంగా మరో రూ.లక్ష దాకా అలవెన్సులు మంజూరు చేశారు. ఐఏఎస్ అధికారులకు కూడా రానంత జీతాన్ని సురేశ్‌కు ఇవ్వడంపై విమర్శలు వచ్చినా జగన్ సర్కారు పట్టించుకోలేదు.
ఆయన భార్య ప్రభుత్వ రంగ సంస్థలో ఏఎ్‌సవోగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ఆమె ప్రయత్నించడంతో.. మాజీ ఎమ్మెల్యే ఽధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. ఈసీ ఆమెను ఎన్నికల విధుల నుంచి తప్పించింది, తదనంతరం నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సిఫారసుతో వెలగపూడి సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా చేరారని అధికార వర్గాలు వెల్లడించాయి.
సురేశ్‌దే పెత్తనం..
కూటమి అధికారంలోకి వచ్చాక.. సురేశ్ దంపతులపై చర్యలు ఉంటాయని అందరూ భావించారు. ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేస్తారని ఆశించారు. మధుసూదనరెడ్డి ఎండీగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఇవేవీ జరుగలేదు. సురేశ్ ఇప్పటికీ కీలకాధికారిగా ఉండడంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జగన్ సైన్యంలో కొద్ది మందిని విధుల నుంచి తొలగించినా.. అత్యధికులు ఇంకా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దినేశ్‌కుమార్ ఫైబర్‌నెట్ ఎండీగా ఉన్నారు. అదనంగా డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా, రియల్‌టైమ్ గవర్నెన్స్ సీఐవోబాధ్యతలు కూడా అప్పగించడంతో....ప్రక్షాళనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.
ఉంటుందా.. ఊడుతుందా?
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కనెక్షన్లు 11 లక్షలకు చేరాయి. జగన్ ఐదేళ్ల ఏలుబడిలో అవి 5 లక్షలకు పడిపోయాయి. కూటమి సర్కారు వచ్చాక 20 లక్షల కనెక్షన్లను లక్ష్యంగా పెట్టుకున్నా.. మరో పది వేలు తగ్గినట్లు చెబుతున్నారు. గడచిన ఐదు నెలల్లో ఫైబర్‌నెట్ ఎంఎ్‌సవోలతో సమావేశం పెట్టలేదు. వారి అభిప్రాయాలనూ సేకరించలేదు. ఫైబర్‌గ్రిడ్ బాక్సులను కూడా వారికి ఇవ్వడం ఆపేశారు. ఒకవైపు ఎంఎ్‌సవోల సమస్యలను పరిష్కరించకపోవడం.. మరోవైపు కనెక్షన్ల పెంపుపై దృష్టిసారించకపోవడంతో.. అసలు ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
Updated Date - Dec 10 , 2024 | 04:54 AM