Supreme Court: మాతో ఆటలొద్దు
ABN, Publish Date - Aug 22 , 2024 | 05:10 AM
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్ వేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు
మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీం ఫైర్
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును
నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్ తిరస్కరణ
సీబీఐ దర్యాప్తునకూ నిరాకరణ
ఆళ్ల రాజకీయ బంధంపై ధర్మాసనం ఆరా
గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారన్న
సీఎం తరఫు సీనియర్ న్యాయవాది లూథ్రా
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్ వేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి తమతో ఆటలాడొద్దని హెచ్చరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన వేసిన మరో పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆళ్ల గతంలో ఏసీబీ కోర్టులో ప్రైవేటు కంప్లయింట్ దాఖలు చేశారు.
కోర్టు దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఏసీబీని ఆదేశించింది. దీనిపై చంద్రబాబు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు 2016 డిసెంబరు 9న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మరో పిటిషన్ వేశారు. ఈ రెండు వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా.. ఈ కేసులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలూ లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, న్యాయవాదులు గుంటూరు ప్రభాకర్, ప్రమోద్ కుమార్, ప్రేరణ విచారణకు హాజరయ్యారు. తొలుత ఆళ్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5కోట్లు, ఓటు వేయకుండా గైర్హాజరైతే రూ.2కోట్లు ఇస్తామని చంద్రబాబు తరఫున అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బేరసారాలు జరిపారని.. దీనికి సంబంధించి కాల్ రికార్డింగులు ఉన్నాయని తెలిపారు.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసులు ఉన్నాయని, ఆ జాబితాను ధర్మాసనానికి అందజేశారు. కేసుల జాబితాను పరిశీలించిన తర్వాత పిటిషనర్ ఆళ్లపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని హెచ్చరించింది. ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దని తీవ్ర వాఖ్యలు చేసింది. పిటిషనర్2014 నుంచి ఇటీవలి ఎన్నికల వరకు శాసనసభ్యుడిగా ఉన్నారని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉందని, పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కూడా ప్రతిపక్షంలోనే ఉందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలూ కనిపించడం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల వేసిన ఎస్‌ఎల్‌పీని డిస్మిస్ చేసేందుకు ధర్మాసనం సంసిద్ధత వ్యక్తంచేయగా.. దానిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.
Also Read:
ఇసుకపై సమగ్ర పాలసీ..!!
‘ఫార్మా’ చరిత్రలోనే భారీ ప్రమాదం...!!
మోదీ పర్యటనపై ప్రపంచదేశాల చూపు..!!
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Aug 22 , 2024 | 07:59 AM