ఈఓ రామారావును దుర్గమ్మే నియమించుకుంది.. భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్న పురాణపండ ‘సౌభాగ్య’

ABN, Publish Date - Jul 29 , 2024 | 12:27 AM

మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలై కనకదుర్గమ్మ మరిన్ని మహోజ్వల కార్యాలు జరిపించుకోనున్న ఈ సందర్భంలో మరిన్ని గ్రంథావిష్కరణలు, ఉచిత వితరణలకు, మహాలక్ష్మీ ప్రదంగా జరుపనున్నట్లు సమాచారం. ఈ శ్రీవైభవానికి సహకరించి ప్రోత్సహించిన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, మహోపన్యాసకులు చాగంటి కోటేశ్వర రావుకు, ‘సౌభాగ్య’ లక్షప్రతులు సమర్పించి పవిత్ర సంచలనం సృష్టించిన నిస్వార్ధ సేవకులు బొల్లినేని కృష్ణయ్యకు, నాలుగు గ్రంధాల ఆవిష్కరణకు కారణమైన అద్భుతమైన రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు, దేవస్థానంలో అన్ని విభాగాల ఉద్యోగులకు ఈఓ రామారావు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.

ఈఓ రామారావును దుర్గమ్మే నియమించుకుంది.. భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్న పురాణపండ ‘సౌభాగ్య’

విజయవాడ, జూలై 28: భక్తితో తపించే హృదయమున్న వ్యక్తి ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా వస్తే కనకదుర్గమ్మవారి కటాక్షం ఎంత కుంభవృష్టిగా కురుస్తుందో ఇటీవల బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు అహోరాత్రాలు విరామమెరుగక పరిశ్రమిస్తూ చేస్తున్న పవిత్రకార్యాలు దేవస్థాన చరిత్రలో నిలుస్తాయని అటు ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఇటు దేవాదాయశాఖ కమీషనర్ కార్యాలయంలోను ప్రశంసలు వర్షిస్తున్నారు.

Vijayawada-ammavaru.jpg

డిప్యూటీ కలెక్టర్ హోదాలో వున్న దుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు రుజువర్తన, సమర్పణాభావం, ధార్మిక సేవల్ని పరిశీలిస్తే ఒక ఉన్నతాధికారిలా కాకుండా ఒక భక్త సేవకునిలా సమర్పణాభావంతో వ్యవహరిస్తున్నారని దేవస్థాన అర్చక, పండిత వర్గాలు, ఉద్యోగ బృందాలే కాకుండా దేవస్థానానికి వి.ఐ.పి హోదాలో వస్తున్న న్యాయమూర్తులు, మంత్రులు, పోలీస్ అధికారులు నుండీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేషీవరకూ రామారావు పవిత్ర ప్రవర్తనపై మెచ్చుకోలు పలుకులే!

ఇటీవల కొన్ని రోజులుగా జరుగుతున్న అమ్మవారికి ఆషాఢం సారె ఉత్సవాలలో, వారాహి నవరాత్రోత్సవాలలో, శాకాంబరీ ఉత్సవాలలో ఆయన నిర్వహించిన పాత్ర అనితరసాధ్యం.


ఒక వైపు అద్భుత గ్రంథావిష్కరణలు, వితరణ.. ఇంకో వైపు ప్రత్యేక వేదికపై వివిధ ప్రాంతాల్లో నిష్ణాతులైన కళాకారులతో వివిధ రకాల అపూర్వ భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు.. మరొకవైపు మహా యజ్ఞాల్లాంటి కార్యకమాలైన మహామహోత్తమ పండిత ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర రావు ప్రవచనం, అలాగే అవధాన పండితోత్తమములు వద్దిపర్తి ప్రభాకర్ ప్రసంగాలు.. ఇలా భక్తి రసాత్మకమైన అద్భుతకార్యక్రమాల నిర్వహణా సామర్ధ్యంతో వేలకొలది రసజ్ఞుల, భక్తుల, మేధావుల మనసుల్ని కొల్లగొట్టి ఉత్తమ స్థానాన్ని సంపాదించుకున్న కార్యనిర్వహణాధికారిగా రామారావు దేవస్థాన చరిత్రలో క్రొత్త పవిత్ర పేజీల్ని సృష్టిస్తున్నారనడంలో సందేహాలనవసరం.

అమ్మవారి సన్నిధానంలో ప్రధానమైన తొమ్మిది ఆవరణల శ్రీచక్రానికి మంత్ర యంత్రాత్మకమైన ఆరాధనలు అంత అద్భుతంగా ఈవో రామారావు వైదిక పండితులచేత విధివిధానంగా, నియమానుసారం జరిపించడం గమనార్హం.

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా దుర్గమ్మ దేవస్థానంలో ఒకేసారి ‘సౌభాగ్య’ అనే దివ్య మంగళ గ్రంధం లక్షప్రతులను రామారావు ఆవిష్కరించి, ఆయన పర్యవేక్షణలోనే పదుల సంఖ్యలో సిబ్బంది వివిధ శాఖల ద్వారా వితరణ చెయ్యడం వేలాది భక్తులను ఆకర్షించింది.

ఈ పరమోత్తమ గ్రంధం ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప విలువలతో, పవిత్ర సౌందర్య సొగసులతో, యజ్ఞభావంతో రచనా సంకలనంగా అందడం మరొక ప్రత్యేకతగా చెప్పుకోక తప్పదు. అమ్మవారి అనుగ్రహంగా అందిన ఈ ఉత్తమమైన దివ్యత్వాన్ని కిమ్స్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఎంతో పవిత్ర సేవగా అమ్మవారికి సమర్పించడం చరిత్రాత్మకం. ఇన్నేళ్ల దేవస్థాన చరిత్రలో ఒకేసారి లక్ష గ్రంధాలు ఆలయానికి చేరడం రామారావు కార్యనిర్వహణాధికారిగా ఉన్న ఈ సమయంలోనే జరగడం.. అందులోనూ పురాణపండ శ్రీనివాస్ బుక్ కావడంతో ఆకర్షణ మరింత పెరగడం దుర్గమ్మ అనుగ్రహమేనన్నారు ఆలయ అర్చక బృందం.


అంతేకాకుండా శ్రీవిద్యలు, మహా విద్యలు, స్తోత్ర విద్యలు ఉన్న పురాణపండ శ్రీనివాస్ మరొక పవిత్ర పుణ్యగణ్య గ్రంధం ‘శ్రీలలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు’ మహా గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించడం కనకదుర్గమ్మ కారుణ్యంకాకపోతే మరేమిటి?! ఈ గ్రంధానికి వచ్చిన స్పందన అనూహ్యం.

మరికొన్ని రోజుల్లో ఈ ఉత్సవాలు ముగిసి శ్రావణ మాసం మొదలై అమ్మ మరిన్ని మహోజ్వల కార్యాలు జరిపించుకోనున్న ఈ సందర్భంలో మరిన్ని గ్రంథావిష్కరణలు, ఉచిత వితరణలకు, మహాలక్ష్మీ ప్రదంగా జరుపనున్నట్లు సమాచారం. ఈ శ్రీవైభవానికి సహకరించి ప్రోత్సహించిన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, మహోపన్యాసకులు చాగంటి కోటేశ్వర రావుకు, ‘సౌభాగ్య’ లక్షప్రతులు సమర్పించి పవిత్ర సంచలనం సృష్టించిన నిస్వార్ధ సేవకులు బొల్లినేని కృష్ణయ్యకు, నాలుగు గ్రంధాల ఆవిష్కరణకు కారణమైన అద్భుతమైన రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు, దేవస్థానంలో అన్ని విభాగాల ఉద్యోగులకు రామారావు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 29 , 2024 | 07:54 AM

Advertising
Advertising
<