Illegal Sand Mining : దోంగ రాతల ద్వివేది !
ABN , Publish Date - Jun 28 , 2024 | 02:50 AM
ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కారు అచ్చంగా ఇలాగే... అడ్డంగా, నిలువుగా దొరికిపోయింది. ‘ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడంలేదని చెప్పమన్నారండీ’ అన్నట్లుగా జిల్లా కలెక్టర్లందరూ కూడబలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదుకాదు... కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు.
‘ఇసుక’లో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సీఎస్
అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్ధాలు
‘అంతా ఓకే’ అని ప్రొఫార్మా పంపించి మరీ ఆదేశాలు
డూడూ బసవన్నల్లా సంతకాలు చేసిన ఐఏఎస్‌లు
ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుకు అసత్య నివేదికలు
జగన్ సర్కారు హయాంలో ఇదీ కలెక్టర్ల తీరు
తనిఖీలు చేయకుండానే ‘అక్రమాలు లేవని’ సర్టిఫికెట్
ప్రొఫార్మాలో జిల్లా పేరు నింపి కింద సంతకం, స్టాంపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘నాన్నగారు ఇంట్లో లేరు’.. ఇలా చెబితే ఓకే! ‘నాన్నగారు ఇంట్లో లేరని చెప్పమన్నారండీ’ అంటే అడ్డంగా దొరికిపోయినట్లే!
ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కారు అచ్చంగా ఇలాగే... అడ్డంగా, నిలువుగా దొరికిపోయింది. ‘ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడంలేదని చెప్పమన్నారండీ’ అన్నట్లుగా జిల్లా కలెక్టర్లందరూ కూడబలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదుకాదు... కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు. అది కూడా ఒక్కసారి కాదు... మూడుసార్లు! జాతీయ హరిత ట్రైబ్యునల్, రాష్ట్ర హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టుకూ ఇదే అబద్ధం చెప్పించారు. కలెక్టర్లంతా ఇలా ‘ఒకే తాటి మీద నిలబడి ఒకే మాట’ చెప్పడంతో ఎన్జీటీ బృందమే ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఈ ఏడాది ఫిబ్రవరి 22న బయటపెట్టింది. అయినా సరే... ‘తగ్గేదేలే’ అంటూ హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీం కోర్టుకూ ఇదే మాట చెప్పారు. అయితే... ఈ మూకుమ్మడి అబద్ధానికి అసలు కారణమేమిటో ఇప్పుడు బయటపడింది. ఇదంతా నాటి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నిర్వాకమని స్పష్టమైంది. జిల్లా స్థాయిలో తనిఖీలు జరిపి ఇసుక అక్రమ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా... ‘తనిఖీలు జరపండి.
నివేదిక మాత్రం నేను చెప్పినట్లుగా ఇవ్వండి’ అంటూ ద్వివేది ఈ ఏడాది మార్చి 22వ తేదీన కలెక్టర్లకు రాసిన లేఖ... దానితోపాటు జత చేసిన ప్రొఫార్మా ఇప్పుడు బయటపడ్డాయి. తాము ఐఏఎ్‌సలమనే విషయం మరిచిపోయిన కలెక్టర్లు, ‘ఎస్ బాస్’ అంటూ అదే ప్రొఫార్మాలో తమ జిల్లా పేరు నింపేసి, కింద సంతకం చేసేసి, సీలు కొట్టి పంపించారు. జగన్ హయాంలో ప్రభుత్వ యంత్రాంగం ఏ స్థాయిలో నిర్వీర్యమైందో... ఇసుక అక్రమాలపై ముసుగు వేసేందుకు ఎంతగా ప్రయత్నించారో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. కథ, స్ర్కీన్‌ప్లే... నాటి సర్కారు పెద్దలది కాగా, డైరెక్షన్ మాత్రం గోపాలకృష్ణ ద్వివేది చేశారు. నిబంధనలు, స్వీయ విచక్షణ, ఆత్మసాక్షిని మరిచిపోయిన కలెక్టర్లు నిమిత్తమాత్రులైన పాత్రధారులుగా మిగిలారు. సాధారణంగా కోర్టులు, ట్రైబ్యునళ్లకు నివేదికలు ఇచ్చేటప్పుడు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో స్వీయ పరిశీలన చేసి వాస్తవాలను నివేదికల రూపంలో ఇవ్వాలి.
అయితే.. ‘జగన్ హయాంలో ఎక్కడా అక్రమ ఇసుక తవ్వకాలు జరగనే లేదని నివేదికలు ఇవ్వండి’ అని ద్వివేది కలెక్టర్లను ఆదేశించారు. ‘‘హైకోర్టు ఆదేశాల మేరకు దిగువ సంతకం చేసిన అధికారి జిల్లాలోని రీచ్‌లను పరిశీలించి, ఆ పరిధిలో ఎలాంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని ధ్రువీకరించడమైనది’’ అంటూ ద్వివేదియే ఒక ప్రొఫార్మాను కలెక్టర్లకు పంపించారు. ఇసుక రీచ్‌లు లేని 3 జిల్లాలను మినహాయిస్తే... మిగిలిన 23 జిల్లాల కలెక్టర్లు ఈ ఫ్రొఫార్మా ప్రకారం తమ జిల్లా పేరు రాసి, కింద సంతకం చేసి పంపించారు. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు నదులు, వాగులు, వంకలు.. వేటినీ వదలకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలను ప్రచురించింది. గుంటూరుకు చెందిన డి.నాగేంద్రకుమార్ తొలుత ఎన్జీటీ, తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు వేశారు.
జిల్లా లెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో లేదో నిర్ధారించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్జీటీ ఆదేశించింది. రాష్ట్రంలో సహజ వనరులైన ఖనిజాలకు కాపలాదారు గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. ఆ పోస్టులో ద్వివేది ఉన్నారు. ఆ తర్వాత గనుల శాఖ డైరెక్టర్, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిదే బాధ్యత. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలే జరగడం లేదని ఫిబ్రవరిలో కలెక్టర్లు ఎన్జీటీకి నివేదిక ఇచ్చారు. కానీ ఎన్జీటీకి అనుమానాలు వచ్చి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ (ఎంఓఈఎఫ్) శాస్త్రవేత్తలతో పరిశీలన చేయించి నివేదికలు తెప్పించుకుంది. జేపీ వెంచర్స్ అక్రమ తవ్వకాలు చేసిందని ఎంఓఈఎఫ్ బృందం ఎన్జీటీ కి నివేదిక ఇచ్చింది. తర్వాత కలెక్టర్ల నివేదికపై ఎన్జీటీ స్పందిస్తూ... ‘నివేదికలన్నీ ఒకేలా ఉన్నాయి. కలెక్టర్లు అంతా ఒకే ఫార్మాట్‌లో ఇచ్చారు? ముందుగా మాట్లాడుకొని ఒకేలా నివేదికలు ఇచ్చారా?’ అని ప్రశ్నించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై నాగేంద్రకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో విచారణ జరిగింది.
అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఫొటోలతో సహా ఆధారాలు కోర్టుకు సమర్పించారు. గనుల శాఖ మాత్రం అసలు అక్రమ తవ్వకాలే జరగడం లేదని నివేదిక ఇచ్చింది. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్లను స్వీయ పరిశీలన చేసి నివేదికలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ద్వివేది గత మార్చి 22న జిల్లా కలెక్టర్లు, గనుల శాఖకు మెమో జారీ చేశారు. ‘‘మీ జిల్లాల పరిధిలోని ఇసుక రీచ్‌లను తనిఖీలు చేసి అకమ్ర తవ్వకాలు లేకుండా చూడాలి. మేం పంపిస్తున్న ప్రొఫార్మా ప్రకారం 3రోజుల్లో నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికలను క్రోడీకరించి మేం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాం’’ అని ఆదేశించారు.
జగన్ శాసించారు.. ద్వివేది పాటించారు
గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలన్నీ జగన్ కనుసన్నల్లోనే జరిగాయని బోలెడు ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయి. జేపీ వెంచర్స్‌కు కాంట్రాక్టు ఇచ్చినా అనధికారికంగా వైసీపీ నేతలే ఇసుక వ్యాపారం చేశారు. ఈ వ్యవహారంపై జేపీ వెంచర్స్‌పై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. విచారణను తప్పుదోవ పట్టించేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఎన్జీటీకి కలెక్టర్లతో తప్పుడు నివేదికలు ఇప్పించారనే విమర్శలున్నాయి. హైకోర్టుకు అలాగే నివేదికలు వెళ్లేలా జగన్ శాసించినట్లు ఆరోపణలున్నాయి. గనుల శాఖ ప్రత్యేక సీఎస్ హోదాలో అక్రమాలే జరగడం లేదని ద్వివేది అనుకూల నివేదిక ఇప్పించడం తీవ్రమైన అంశం. గతంలో జగన్‌తో అంటకాగిన పలువురు అధికారులు అడ్డగోలు తప్పులుచేసి జైలుకెళ్లారు. ఈ పరిణామాలు ఇంకా వెంటాడుతున్నా.. ఇసుక అక్రమ తవ్వకాలు బయటకు రాకుండా ద్వివేది వ్యవహరించిన తీరు అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రొఫార్మాలో ఏముందంటే..
‘‘హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా (పేరు) పరిధిలోని ఇసుక రీచ్‌లను నిశిత పరిశీలన చేయగా ఎలాంటి అక్రమ ఇసుక తవ్వకాలు జిల్లాలో జరగడం లేదని ధ్రువీకరిస్తున్నాం’’ అని ప్రొఫార్మాలో ఉంది. మెమో ప్రకారం కలెక్టర్లు ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి, ఒకవేళ అక్రమ తవ్వకాలు ఉంటే అడ్డుకోవాలి. కానీ ద్వివేది పంపించిన ప్రొఫార్మాలో... అక్రమ తవ్వకాలే జరగడం లేద ని జిల్లా కలెక్టర్లు ధ్రువీకరించాలని ఆదేశించారు. ద్వివేది చెప్పినట్లుగానే జిల్లా కలెక్టర్లు అక్రమ తవ్వకాలు జరగలేదని నివేదికలు పంపించారు. వాటి ఆధారంగా రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ అక్రమ ఇసుక తవ్వకాలే జరగడం లేదని ద్వివేది రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్నిబట్టి ఇసుక అక్రమ తవ్వకాలు బయటకు రాకుండా ఆయన హై కోర్టు కళ్లకు గంతలు కట్టినట్లు స్పష్టమవుతోంది.