AP News: రాజమండ్రిలో చిరుత పులి కలకలం.. భయాందోళనలో ప్రజలు
ABN, Publish Date - Sep 07 , 2024 | 07:29 PM
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు( Lala Cheruvu )లో చిరుతపులి( Leopard ) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. రాజమండ్రిలో రెండు రోజులుగా చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. పులి కదలికలపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు( Lala Cheruvu )లో చిరుతపులి( Leopard ) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. రాజమండ్రిలో రెండు రోజులుగా చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. పులి కదలికలపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. చిరుత పులి సంచారంపై ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈరోజు(శనివారం) అటవీశాఖ అదికారి భరణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
నగరంలోని లాలాచెరువు రిజర్వ్ పారెస్ట్ ప్రాంతంలో రెండు రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అటవీశాఖ ట్రాప్ కెమెరాలతో పాటు ఆకాశవాణి కేంద్రం సీసీ పుటేజ్ల్లోనూ చిరుత పులి దృశ్యాలు రికార్డు అయ్యాయని వివరించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అధారిటీ గైడ్ లైన్స్ ప్రకారం చిరుత కదలికలను గుర్తించేందుకు అదనంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు చాటింపు వేయిస్తున్నామని అన్నారు. చిరుత పులిని సురక్షితంగా బందించేందుకు రెండు బోన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు సాయంత్రం తర్వాత ప్రజలు ఎవరూ ఒంటరిగా తిరగకూడదని సూచించారు.
పిల్లలను బయటకు రాకుండా చూసుకోవాలని సూచించారు. చిరుత పులి కదలికల కోసం నివాస ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతంలో 36 ట్రాప్ కెమెరాలు ఏర్పాటుచేశామని అన్నారు. స్వరూప్ నగర్, పద్మావతి నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు, రూపనగర్, తారకారామ్ నగర్ బత్తిననగర్ల్లో చిరుత పులి సంచరించే అవకాశం ఉందని తెలిపారు. పులిని పట్టుకునేందుకు వెటర్నరీ డాక్టర్‌ను , మందులు సిద్ధం చేశామని తెలిపారు. పులిని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చామని.. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. ఎవరైనా అత్యవసర సమయంలో బయటకు వస్తే టార్చ్‌లైట్ ఉపయోగించాలని సూచించారు. చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని అటవీశాఖ అదికారులు పేర్కొన్నారు.
Updated Date - Sep 07 , 2024 | 07:34 PM