Deputy CM Pawan Kalyan : ఈ శతాబ్దం విద్యార్థులదే
ABN, Publish Date - Dec 08 , 2024 | 03:49 AM
ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విలువలతో కూడిన విద్యను అభ్యసించండి
తల్లిదండ్రులు, టీచర్లు, సైనికులే నిజమైన హీరోలు
రాష్ట్రంలో ఈ స్థాయిలో డ్రగ్స్ ఉండటం దారుణం
ప్రతి స్కూల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
కడప పీటీఎంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కడప, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయలసీమ అంటేనే చదువుల నేల అని, ఇలాంటి ప్రాంతానికి రావడం తన అదృష్టమని అన్నారు. రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతమని, పుస్తక నిధి అధికంగా ఉండటంతో ఇక్కడి ప్రజల్లో విజ్ఞాన సంపద కూడా అధికంగానే ఉంటుందని చెప్పారు. చదువు అనేది ఉద్యోగం, ఆర్థిక స్థోమతను పెంపొందించుకోవడానికి మాత్రమే కాదు, జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా అని తెలిపారు. ‘మొల్ల, అన్నమయ్య, వేమన, నారాయణచార్యులు, నాగిరెడ్డి, బళ్లారి రాఘవ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు లాంటి ఎందరో మహానుభావులు ఇక్కడినుంచి వచ్చారు. అలాంటి సీమకు పునర్వైభవం రావాలి. సీమ వెనుకబడిన ప్రాంతం కాదు. అవకాశాలకు ముందున్న ప్రాంతం అనిపించాలి’ అని పవన్ పేర్కొన్నారు. ‘విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి. ఆ బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డల భద్రత కీలకం. ప్రతి స్కూల్లో సీసీ కెమెరాలు ఉండేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోబోతున్నారు’ అని పవన్ పేర్కొన్నారు.
‘రాష్ట్రంలో ఈ స్థాయిలో డ్రగ్స్ ఉండటం దారుణమైన విషయం. సైబర్ క్రైం కూడా ఎక్కువ అవుతోంది. ఇంట్లో ఒకరిద్దరిని చూసుకోవాలంటేనే తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందిపడతారు. అలాంటిది తరగతి గదిలో 30 మందిని చూసుకోవాలంటే టీచర్లపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి.
ఈ దేశ గతిని మార్చే శక్తి టీచర్లకు ఉంటుంది. హీరోలు సినిమాల్లో కాదు... తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో, ఆర్మీలో ఉంటారు. విలువలతో కూడిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోండి’ అని విద్యార్థులకు సూచించారు. పాఠశాలల విలీనంతో ఆడపిల్లలు దూరప్రాంతంలోని పాఠశాలలకు వెళ్లడం లేదని, దీనికి పరిష్కారంగా అన్ని గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ బస్సు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. అనంతరం 6, 8, 9, 10 తరగతుల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులతో పవన్ సెల్ఫీ దిగారు.
విద్యార్థుల్లో ఉప్పొంగిన ఉత్సాహం
తమ అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ను చూడగానే విద్యార్థుల్లో ఒక్కసారిగా ఆనందం ఉప్పొంగింది. ఈలలు, కేకలతో ఘనంగా స్వాగతం పలికారు. తరగతి గదుల్లోకి వచ్చిన పవన్ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. ఎంతో ఓపికగా అందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చిన పవన్‌కల్యాణ్.. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ‘సార్.. మిమ్నల్ని తెరపై చూసి ఆనందించేవాళ్లం. అలాంటి మిమ్మల్ని ఇక్కడ చూడడంతో మా జన్మ ధన్యమైంది’ అంటూ 8వ తరగతి విద్యార్థులు తమ తరగతి గదిలోకి వచ్చిన పవన్‌తో ముచ్చటించారు. ఆటోగ్రా్‌ఫలు తీసుకుని ఇది తమకు చిరకాలం గుర్తుండిపోయే మధుర స్మృతి అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం 10వ తరగతి గదిలోకి వెళ్లగానే పవర్‌స్టార్ అంటూ కేరింతలు కొట్టారు. ఎలా చదువుతున్నారంటూ వారిని పవన్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లులు వేసిన ముగ్గులను పవన్ పరిశీలించి వారితో ఫొటోలు దిగారు. తల్లి గర్భం నుంచి బిడ్డ ఏర్పడే విధానాన్ని ముగ్గు రూపంలో వేసిన మహిళకు ఆయన వందనాలు చేశారు. టగ్ ఆఫ్ వార్‌లో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిలో ఉత్సాహం నింపారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కాగా, ‘ప్రతిరోజు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తాం. ఈరోజు మా ఆరాధ్యదైవం పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో కలిసి భోజనం చేయడం మరపురానిది’ అంటూ విద్యార్థులు ఆనందంగా చెప్పారు.
ఆస్తులు కబ్జా చేస్తే గూండా యాక్ట్
ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే గూండా యాక్ట్ పెడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు, జడ్పీ ఆస్తులను కొంతమంది తమ సొంతానికి వాడుకుంటున్నారని తెలిసిందని, దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కడప జిల్లా కలెక్టర్‌కు సూచించారు. కడపలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారని, ఇక్క సమస్యలు ఉండవనుకున్నానని అన్నారు. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు.. ఎంత చేశారన్నదే ముఖ్యమని చెప్పారు. ఏదైనా సమస్య వచ్చినపుడు బలంగా రోడ్లపైకి రండి చాలు... మిగతాది తాను చూసుకుంటానని చెప్పారు. తమ ప్రభుత్వానికి నిధులు తక్కువైనా మనసు చాలా పెద్దదన్నారు. పారిశుధ్య కార్మికులు చాలా గొప్పవారని, వారికి గౌరవం ఇవ్వాలని విద్యార్థులకు పవన్ సూచించారు.
Updated Date - Dec 08 , 2024 | 03:54 AM