ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh : బలైన బలగం

ABN, Publish Date - May 24 , 2024 | 05:15 AM

చిన్నప్పటి నుంచీ అంతా ఒక్కచోట పెరిగారు. సరదాలు, సంబరాల్లో పాలుపంచుకున్నారు. కలసి పండగలు చేసుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామంలో అందరిదీ ఒకే మాట. చిన్నా పెద్దా అన్న పట్టింపు పెద్దగా ఉండేది కాదు. 35 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ చిన్న గొడవ ఆ గ్రామాన్ని ఛిన్నభిన్నం చేసింది.

తండ్రుల ఆవేశానికి పిల్లలు బలి

పల్నాడులోని

జూలకల్లు విషాదగాథ

35 ఏళ్ల క్రితం ఎంతో ఘనమైన ఊరు

రాజకీయ గొడవలకు ఛిన్నభిన్నం

హత్యలు, అల్లర్లతో గ్రామస్థులు జైలుకు

వ్యవసాయ కూలీలుగా మహిళలు

పిల్లల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం

చిన్నప్పటి నుంచీ అంతా ఒక్కచోట పెరిగారు. సరదాలు, సంబరాల్లో పాలుపంచుకున్నారు. కలసి పండగలు చేసుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామంలో అందరిదీ ఒకే మాట. చిన్నా పెద్దా అన్న పట్టింపు పెద్దగా ఉండేది కాదు. 35 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ చిన్న గొడవ ఆ గ్రామాన్ని ఛిన్నభిన్నం చేసింది. ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారి పచ్చటి పల్లెటూరును రావణకాష్ఠం చేసింది. అప్పటి వరకు ఆప్తులుగా ఉన్నవారే ఒకర్నొకరు చంపుకొన్నారు. పగతో సొంత అన్నలే చెల్లెళ్ల మాంగల్యాలను తెంపేశారు. కేసుల్లో ఇరుక్కుని మగవాళ్లు జైలుపాలయ్యారు. మగదిక్కు లేక మహిళలు, పిల్లలు ఎన్నో బాధలు పడ్డారు. సాగు చేసేవారు లేక పొలాలు బీడుగా మారిపోయాయి. ఓ చిన్న గొడవ కారణంగా ఏకంగా ఓ తరమే ఎంతో నష్టపోయింది. తండ్రుల ఆవేశానికి పిల్లలు శిక్ష అనుభవించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామ విషాదగాథ ఇది. ఆ గొడవలు గుర్తొస్తే నేటికీ ఆ ఊరి ప్రజలు వణికిపోతున్నారు. అలాంటి గొడవలు మళ్లీ ఎప్పుడూ జరగరాదని కోరుకుంటున్నారు. ప్రస్తుతం గొడవలతో అట్టుడికిపోతున్న పల్నాడు పల్లెలను చూస్తుంటే ఛిద్రమైన జూలకల్లు జీవనచిత్రం కళ్ల ముందు కనపడుతుంది.

పల్నాడులో తాజాగా రగిలిన రాజకీయ చిచ్చు ఊళ్లకు ఊళ్లను తగలబెట్టేస్తోంది. బాధితులు, బాధ్యులు అందరూ ఇరుగు పొరుగు వారే. తలలు పగులుతున్నా గొడవలకు కాలు దువ్వుతున్న వారంతా ఒక్కసారి జూలకల్లులో బలగమంతా ఎలా బలైందో...


పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు ఐదువేల మంది జనాభా ఉన్న చిన్న పల్లెటూరు. 35ఏళ్ల క్రితమే ఈ గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అందరూ చదువుకున్నవారే. కులాలు అనేకమున్నా అందరిదీ ఒకే మాట. భిన్నత్వంలో ఏకత్వం వారి సొంతం. ఆ ఊరికి రాజకీయ చైతన్యం ఎక్కువ. విప్లవ భావాలు, కమ్యూనిజం ఆనవాళ్లు ఉన్న గ్రామమది. నక్సల్బరీ యోధుడు చారు మజుందార్‌ ఆంధ్రాలో మొట్టమొదట అడుగుపెట్టిన గ్రామమది. పాడి పంటలు, ఐశ్వర్యంతో తులతూగే వైభోగం ఆ గ్రామం సొంతం. ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామానికి ఓ చిన్నగొడవ అంతులేని విషాదం, నష్టం మిగిల్చింది.

అప్పట్లో జరిగిన ఎన్నికలలో ఓ చిన్న గొడవ తలెత్తింది. అది కాస్తా కులాల మధ్య కార్చిచ్చులా మారింది. రానురాను ఫ్యాక్షన్‌గా రూపాంతరం చెందింది. తన మన తేడా లేకుండా హత్యలకు పాల్పడ్డారు. ఏ ఇంట చూసినా సౌభాగ్యం దూరమైన మహిళలే. ఊర్లోని మగవాళ్లందరిపై హత్య కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్టు చేసేందుకు గ్రామంలోకి రావడంతో తప్పించుకునేందుకు భార్యాబిడ్డలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఎక్కడున్నారో చాలారోజుల వరకూ అంతు పట్టలేదు. హైదరాబాద్‌, ముంబై వెళ్లి తలదాచుకున్నారు. 30ఎకరాల భూములున్న ఆసాములు సైతం రోజు కూలీలుగా మారారు. సాగుచేసే నాథుడు లేక, పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేక వేలాది ఎకరాల కొద్ది పొలాలు అడవిగా మారాయి. పచ్చని పంటలతో కళకళలాడిన పల్లెటూరు కరువు బారిన పడింది.


మహిళలు కుటుంబాలను పోషించాల్సి వచ్చింది. అప్పటివరకు గడప దాటని మహిళలు పిల్లా పాపలతో వ్యవసాయ కూలీలుగా మారారు. కొంతమంది పాడినాధారం చేసుకుని బిడ్డలను బతికించుకున్నారు. మరి కొంతమంది పిల్లలతోనే వ్యవసాయం చేయించారు. కొద్దిరోజులకు తిరిగివచ్చిన భర్తలను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న వారందరినీ జైలుకు పంపారు. ఈ కేసుల నుంచి బయట పడేందుకు రైతులు పొలాలను అతితక్కువ ధరకు అమ్ముకున్నారు. చాలామంది జీవిత ఖైదు అనుభవించారు.

కొందరు జైలులోనే మరణించారు. గొడవల్లో ఇరుకున్న ఎంతోమంది వృద్ధాప్యంలో బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలయ్యే సరికి పిల్లలు తలో దిక్కుకు వెళ్లిపోయారు. చదువుకోవాల్సిన వయసులో కుటుంబ పోషణ మీద పడటంతో కొందరు వ్యవసాయదారులుగా, మరికొందరు కూలీలుగా స్థిరపడిపోయారు. తండ్రుల ఆవేశానికి పిల్లల తరం భయంకరమైన శిక్ష అనుభవించింది. ఈనాటికీ నాటి చేదు గుర్తులు ఆ గ్రామంలో కనపడతాయి.

- గుంటూరు సిటీ

మా ఊరు చాలా నష్టపోయింది

పల్నాడులో రాజకీయ, ఫ్యాక్షన్‌ గొడవల కారణంగా మా ఊరు ఎంతో నష్టపోయింది. ఎన్నో కు టుంబాలు రోడ్డున పడ్డాయి. పిల్లలు చేతికి రాకుం డా పోయారు. చివరకు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసే దిక్కు కూడా లేకుండా పోయింది. కేసుల్లో ఉన్నవారు ఆరోగ్యాలు పాడైపోయి, కోర్టులు, పోలీ్‌సస్టేషన్ల చుట్టూ తిరగలేక చాలామంది చనిపోయార ు. మా ఊరు కథ విన్నాక అయినా రాజకీయ గొడవలకు స్వస్తి పలికితే మంచిది.

- బండ్ల వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉపాధ్యాయుడు

తలచుకుంటే వెన్నులో వణుకు

చాలా భయంకరమైన రోజులవి. తలచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఆ పరిస్థితి మళ్లీ ఎప్పుడూ రాకూడదు. తన, మన అన్న భేదం లేకుండా గొడవలు జరిగాయి. చాలా మంది నష్టపోయారు. ఊర్లు వదిలి వెళ్లిపోయారు. తండ్రి లేకపోతే ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. మహిళలు పిల్లల్ని పోషించుకోవటానికి ఎన్నో పాట్లు పడ్డారు. మళ్లీ అలాంటి దుర్దినాలు రాకూడదు.

- మన్నెం అంజిరెడ్డి, జూలకల్లు

పోరు నష్టం కళ్లారా చూశా

ఒక్కసారిగా గొడవలు, దాడులు జరగడంతో పోలీసులు ఊరిలోకి వచ్చారు. మగవాళ్లు అందరూ ఊరు వదిలి వెళ్లిపోయారు. మహిళలు, పిల్లలు మాత్రమే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. చాలామందికి జైలు శిక్ష పడింది. పిల్లలు ఎటోళ్లు అటు అయ్యారు. మళ్లీ గొడవలు జరగకూడదు. పోరు నష్టం అంటే ఏమిటో నేను కళ్లారా చూశా.

- నన్నెపోగు నాగేశ్వరరావు, జూలకల్లు

Updated Date - May 24 , 2024 | 05:23 AM

Advertising
Advertising