MLA Pinnelli: అజ్ఞాతం వీడిన పిన్నెల్లి.. రోజూ ఎస్పీ ఆఫీసుకు రావాల్సిందే!
ABN, Publish Date - May 29 , 2024 | 04:22 AM
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.
పిన్నెల్లికి హైకోర్టు ఆదేశం
నరసరావుపేటలో మీరు ఉండే ప్రాంతం,
ఫోన్ నంబర్ వివరాలు ఎస్పీకి ఇవ్వండి
అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లొద్దు
పాస్‌పోర్టును గురజాల కోర్టులో ఇవ్వండి
అనుచరులు అవాంఛనీయ ఘటనలకు
పాల్పడకుండా చూసే బాధ్యత మీదే
వైసీపీ అభ్యర్థికి న్యాయమూర్తి కీలక షరతులు
మరో 3 కేసుల్లో జూన్ 6 వరకు ముందస్తు బెయిల్
బాధితులకు రక్షణ కల్పించాలని ఎస్పీకి ఆదేశం
పిన్నెల్లి షరతులు ఉల్లంఘిస్తే చర్యలకు వెసులుబాటు
అజ్ఞాతం వీడిన పిన్నెల్లి.. నరసరావుపేటలో ప్రత్యక్షం
అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakrishna Reddy) హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలూ వద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఆయన నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. తన పాస్‌పోర్టును గురజాల మేజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని.. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న, ఉపయోగంలో ఉన్న మొబైల్ నంబర్‌తో పాటు నరసరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని నిర్దేశించింది. సాక్షులను కలవడం, వారిని ప్రభావితం చేయడం, భయపెట్టడం చేయవద్దని.. నేర ఘటనలను పునరావృతం చేయవద్దని, అలాంటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని.. తన అనుచరులు ప్రజాశాంతికి భంగం కలిగించేలా అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని.. కేసుకు సంబంధించి ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. మధ్యంతర బెయిల్ కాలంలో పార్లమెంటు నియోజకవర్గం కేంద్రమైన నరసరావుపేటలోనే ఉండాలని.. అయితే లెక్కింపు కేంద్రం మరో ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే.. కౌంటింగ్ రోజు మాత్రమే అక్కడకు వెళ్లేందుకు అనుమతించింది. పిన్నెల్లి కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ఆయనపై నిఘా ఉంచాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)కి స్పష్టం చేసింది. బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. కోర్టు నిర్దేశించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకటజ్యోతిర్మయి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 4న(ఓట్ల లెక్కింపు రోజు) రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ముందు హాజరయ్యే విధంగా సవరించాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఆ రోజున ఆర్వో ముందు హాజరయ్యేలా వెసులుబాటు కల్పించారు.
అభ్యర్థులు బాధ్యతతో ఉండాలి...
ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి రెంటచింతల పోలీసులు పిన్నెల్లి, ఆయన అనుచరులు మరో 15 మందిపై హత్యాయత్నం(ఐపీసీ 307), మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వస్తున్న పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీసింది. ఆయన ఆమెను బూతులు తిట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలింగ్ అనంతరం ఈ నెల 14న పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, అనుచరులు కారంపూడిలో దాడులకు పాల్పడుతుండగా అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. సీఐ ఫిర్యాదుతో పిన్నెల్లి సోదరులు, అనుచరులపై పోలీసులు హత్యాయత్నం, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం వ్యవహారంలో ఇప్పటికే మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్న పిన్నెల్లి.. ఈ మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోరుతూ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాల్లో అనుబంధ పిటిషన్లపై సోమవారం వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. జూన్ 6 వరకు పిన్నెల్లికి షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. హత్యాయత్నం వంటి తీవ్ర సెక్షన్లు, ఏడేళ్ల వరకు శిక్షపడేందుకు వీలున్న కేసుల్లో సైతం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇదే కోర్టు ఉత్తర్వులిచ్చిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఇదే సూత్రం పిన్నెల్లికి కూడా వర్తిస్తుందన్నారు. ఎన్నికల బరిలో ఉన్నవారు మరింత బాధ్యతగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అజ్ఞాతం వీడిన పిన్నెల్లి
నరసరావుపేట, మే 28: తనకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. మంగళవారం రాత్రి నరసరావుపేటకు వచ్చారు. ఓ ప్రైవేటు హోటల్లో బస చేశారు. జూన్ 6 వరకు ఆయన ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. హైకోర్టు ఆదేశాల మేరకు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో రోజూ హాజరు కావాలి. ఇందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్స్ జరిపిన విధ్వంసకాండ నేపథ్యంలో ఇరువురిపై కేసులు నమోదయ్యాయి. అయితే 14న మాచర్లలో గృహనిర్బంధం నుంచి ఇద్దరూ పరారయ్యారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌లోనూ పెద్దఎత్తున గాలింపు మొదలుపెట్టారు. అప్పటి నుంచి పరారీలోనే ఉంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చింది. తర్వాత పెట్టిన మూడు కేసుల్లోనూ పలు షరతులతో తాజాగా ముందస్తు బెయిల్ ఇచ్చింది.
Updated Date - May 29 , 2024 | 07:46 AM