AP Elections 2024: ఏపీలో రికార్డు పోలింగ్
ABN, Publish Date - May 15 , 2024 | 03:37 AM
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలట్లేకాదు.. రికార్డులు సైతం బద్దలయ్యాయి.
రాష్ట్రంలో పోలింగ్ శాతం 81.17.. ఓటర్ టర్నవుట్ యాప్‌లో వెల్లడి
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈ స్థాయి పోలింగ్ ఇదే ప్రథమం
2019లో 79.88 శాతం నమోదు
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలట్లేకాదు.. రికార్డులు సైతం బద్దలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి సమయానికి ‘ఓటర్ టర్నవుట్ యాప్’లో సీఈవో కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు గతంలో ఎన్నడూ లేని రీతిలో 81.17 శాతం పోలింగ్ నమోదైంది. దీనిలో సాధారణ ఓటింగ్ 80.07 శాతం కాగా, పోస్టల్ బ్యాలెట్ 1.1 శాతంగా ఉంది. 2019లో నమోదైన పోలింగ్ 79.88 శాతంతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం తారాజువ్వలా దూసుకుపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం చరిత్ర సృష్టించినట్టయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటలకే ముగిసినా.. దాదాపు 47 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు కొనసాగింది. వీటిలో 34 కేంద్రాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత మంగళవారం తెల్లవారు జామున 2 గంటల వరకు కూడా కొనసాగడం గమనార్హం. ఫలితంగా పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదైంది. మరోవైపు, 1957 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ, 2014, 2019లో విభజిత ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కాకపోవడం గమనార్హం. ఇక, పథకాలు పొందిన వారితోపాటు ఏపీ ఎన్నికల్లో ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల(తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర) నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఓటర్లు తరలి వచ్చారు. అదేవిధంగా కొత్తగా హక్కు పొందిన యువత కూడా పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఈ కారణంగానే పోలింగ్ శాతం అంచనాలకుమించి నమోదైనట్టు తెలుస్తోంది.
Updated Date - May 15 , 2024 | 07:34 AM