Ex-MLA Chandrasekhar Reddy : దందాల ద్వారంపూడి
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:13 AM
పేరుకు మాత్రం ప్రజాప్రతినిధి.. చేసిందంతా దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు. దీనికితోడు అడ్డగోలు తెంపరితనం. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడిననే తలపొగరు. వెరసి పెన్షనర్స్ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడలో కడప తరహా సంస్కృతి తీసుకువచ్చారు.
ఐదేళ్లలో అడ్డగోలుగా అక్రమార్జన
నాటి సీఎం జగన్ అండతో బరితెగింపు
ఎన్నో బెదిరింపులు, దౌర్జన్యాలు, కబ్జాలు
బినామీని అద్దె అడిగినందుకు యజమాని నుంచే రూ.3 కోట్లు వసూలు
కాకినాడలో 100 కోట్ల విలువైన హోటల్ స్థలం రూ.12 కోట్లకే సొంతం
సొంత రొయ్యల ఫ్యాక్టరీకి వంతెన
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
పేరుకు మాత్రం ప్రజాప్రతినిధి.. చేసిందంతా దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు. దీనికితోడు అడ్డగోలు తెంపరితనం. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడిననే తలపొగరు. వెరసి పెన్షనర్స్ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడలో కడప తరహా సంస్కృతి తీసుకువచ్చారు. ఆయనే.. కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. గత ప్రభుత్వంలో ప్రజలను, వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేశారు. ప్రైవేటు ఆస్తుల నుంచి ప్రభుత్వ భూముల వరకు ఎన్నింటినో చెరబట్టారు. అడ్డుకోవడానికి చూసిన అధికారులను అప్పటి సీఎం పేషీలో తనకున్న బలంతో రాత్రికి రాత్రే బదిలీ చేయించారు. టెండర్ల దగ్గర నుంచి కాంట్రాక్టుల వరకు ప్రతిదీ తనదేనన్నట్లు చెలరేగిపోయారు. విదేశాలకు వేలకోట్ల రేషన్ బియ్యం అక్రమ ఎగుమతిలో దిట్టగా పేరొందిన ఈయన కాకినాడ నగరాన్ని ఐదేళ్లలో లూటీ చేసేశారు. ఆయన అక్రమాల బాగోతం పెద్దదే.
అద్దె ఇవ్వకుండా తిరిగి వసూలు
కాకినాడ నగర నడిబొడ్డున భానుగుడి జంక్షన్‌లో ఓ ప్రముఖ స్వీట్‌స్టాల్ యజమాని ఖాళీగా ఉన్న తన భవనాన్ని ద్వారంపూడికి కుడిభుజంగా ఉన్న వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అందులో సదరు చోటా నేత రెస్టారెంట్ ప్రారంభించగా కొన్నాళ్లకు నష్టం వచ్చింది. దీంతో ఏడాదిన్నర పాటు అద్దె కట్టలేదు. ఇదేంటని సదరు స్వీట్‌స్టాల్ యజమాని నిలదీస్తే... అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడితో ఒత్తిడి చేయించారు. సదరు యజమాని భయపడకుండా తన ఆస్తి అయిన హోటల్‌కు తాళాలు వేశారు. దీంతో ద్వారంపూడి జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులతో స్వీట్‌స్టాల్‌పై దాడి చేయించారు.
ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, రోడ్డుకు అడ్డంగా ఉందంటూ ఏకంగా దాన్ని తీసివేయించాలని కుట్రపన్నారు. అదే సమయంలో హోటల్ పెట్టుకున్న భవనం తమదేనని సదరు చోటానేత తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి ఆస్తి కొట్టేయడానికి సిద్ధపడ్డారు. దీంతో ఒక్కసారిగా బెదిరిపోయిన స్వీట్‌స్టాల్ యజమాని తిరిగి రూ.3 కోట్లు చదివించుకోవాల్సి వచ్చింది.
పూడిక మట్టితో కోట్లు
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో వందల ఎకరాల అరట్లకట్ట మంచినీటి స్టోరేజీ ట్యాంకు చెరువులో పూడికతీసే టెండర్‌ను కాకినాడ కార్పొరేషన్ రూ.2 కోట్లతో పిలిచింది. ద్వారంపూడి ఎమ్మెల్యేగా చక్రం తిప్పి అందులో మట్టి ఉచితంగా అమ్ముకునేలా ఆదేశాలు జారీ చేయించారు. దీనికి ఎనిమిది మంది వరకు టెండర్లు వేయడానికి ముందుకు రాగా అందరినీ బెదిరించారు. టెండర్ వేస్తే కార్పొరేషన్‌లో ఏ పనీ రాకుండా చేస్తానని హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. దీంతో తన అనుచరుడైన బినామీకి పని అప్పగించారు. ఈ కాంట్రాక్టులో ఒక్క పూడిక తీసిన మట్టి అమ్మకం ద్వారా ద్వారంపూడి రూ.4 కోట్లు సంపాదించారు. బిల్లు రూ.2 కోట్లు మంజూరైంది.
ప్రభుత్వ భూములకు స్కెచ్
కాకినాడలో పాలిటెక్నిక్ కాలేజీ వెనుక ప్రభుత్వానికి చెందిన 3.5 ఎకరాల భూదాన్ భూములున్నాయి. వీటిని నకిలీ పత్రాలతో కాజేయడానికి ద్వారంపూడి స్కెచ్ వేశారు. కార్పొరేటర్లు అడ్డు తగలకుండా ఉండేందుకు, అందులో రూ.50 లక్షలు విలువ చేసే వందేసి గజాలు 20 మందికి ఉచితంగా ఇవ్వడానికి బేరం మాట్లాడారు. ఒక్కొక్కరి నుంచి ముందుగానే రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.1.50 లక్షల చొప్పున లాగేశారు. ఆ తర్వాత ఈ దందా వెలుగులోకి రావడంతో నిలిచిపోయింది.
మడను మడతెట్టేసి...
2020లో కాకినాడ నగరంలో 31,505 మంది పేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల సేకరణకు దుమ్ములపేటలో కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చెందిన భూములపై ద్వారంపూడి కన్నేశారు. వాటిని లాక్కునేందుకు ప్రయత్నించారు. తమ భవిష్యత్తు అవసరాలకు కావాలంటూ పోర్టు వ్యతిరేకించింది. దీంతో ద్వారంపూడి తనకున్న అధికార బలంతో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించి భూముల్ని ఇళ్ల స్థలాల పేరుతో లాగేసుకున్నారు. దుమ్ములపేటలో సర్వే నెంబర్లు 374, 376లో 116 ఎకరాలను అధికారులు సేకరించారు. అయితే అక్కడ మడ భూములున్నాయని, వాటిని ధ్వంసం చేస్తూ చదును చేస్తున్నారని పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఒకపక్క ఎన్జీటీలో కేసు నడుస్తున్నా ద్వారంపూడి ఒత్తిడితో అప్పటి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి భూములు చదును చేయించేశారు. ఈ భూములు చిత్తడి నేలలు కావడం, భారీగా మడ అడవులున్న నేపథ్యంలో 116 ఎకరాలు చదును చేయడానికి రూ.25 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కనీసం టెండర్ కూడా పిలవకుండా అరట్లకట్ట పనిచేసిన తన బినామీ వ్యాపారితో చదును పేరుతో కొంత పని చేసి రూ.16 కోట్లు బిల్లులు చేసుకున్నారు. ఆ తర్వాత 2020 మేలో ఎన్జీటీ ఆదేశాలతో పని ఆగిపోయింది. అయితే అప్పటికే డబ్బు ద్వారంపూడికి చేరిపోయింది. ఎన్జీటీ తీర్పుతో రాష్ట్రప్రభుత్వం రూ.5 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
చదును పేరిట కోట్లు కొట్టేశారు..
అప్పటి సీఎం జగన్ పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజవర్గం పరిధిలోని యు.కొత్తపల్లి మండలం కొమరిగిరిలో ప్రారంభించారు. ఇక్కడ 250 ఎకరాలకు పైగా ప్రైవేటు భూములు సేకరించారు. ఇవన్నీ సముద్రానికి అతి సమీపంలో ఉన్నాయి. చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతాయి. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితో చదును చేస్తే కానీ పంపిణీకి వీలు పడదు. సీఎం హోదాలో జగన్ వస్తున్నారన్న కారణంతో టెండర్ లేకుండా చదును చేసే కాంట్రాక్టును అప్పటి కలెక్టర్ మురళీధరరెడ్డి ద్వారంపూడికి కట్టబెట్టేశారు. ఈ పనిలో కోట్లు వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి.
ఎన్నో అక్రమాలు
కాకినాడ నగరంలో 11వ డివిజన్ పరిధిలో ఏకంగా 300 గజాల రహదారిని ద్వారంపూడి ఆక్రమించారు. ఆ తర్వాత దాన్ని తన వద్ద ఉండే ఓ రౌడీషీటర్‌తో పాటు మరోనేతకు కట్టబెట్టేశారు.
కాకినాడ రూరల్‌లోని జయలక్ష్మి సొసైటీ బ్యాంకు బోర్డు తిప్పేసి ఖాతాదారులకు వందల కోట్లు మోసం చేసింది. దీంతో బాధితులంతా ద్వారంపూడిని కలిసి న్యాయం చేయాలని కోరారు. వెంటనే సదరు బ్యాంకు డైరెక్టర్లను పిలిచి ఆస్తుల గురించి ఆరా తీశారు. ఎలాంటి చర్యలు లేకుండా చేయడానికి కాకినాడ నగరంలో బ్యాంకుకు చెందిన రూ.10 కోట్ల విలువైన భవనాన్ని తన ఐదుగురు అనుచరుల పేరుతో కోనసీమ జిల్లాలోని కొత్తపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు.
వడ్డీ, అసలు కట్టడం లేదని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ద్వారంపూడి కిడ్నాప్ చేయించారు.
దళిత డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకు దొరకకుండా ద్వారంపూడి సహకరించారు. తన ఇంటివద్ద నిందితుడిని ఉంచుకుని కాపాడాలని చూశారు.
100 కోట్ల ఆస్తి 12 కోట్లకే
కాకినాడ నడిబొడ్డున ఐశ్వర్య గ్రాండ్ హోటల్ ఉండేది. అప్పుల్లో కూరుకుపోవడంతో యజమాని ఐపీ పెట్టేశారు. దీంతో బ్యాంకు హోటల్‌ను వేలం వేసింది. ఈలోపు ద్వారంపూడి రంగంలోకి దిగి ఆ యజమానికి అప్పులిచ్చిన తొమ్మిదిమందిని బెదిరించి బ్యాంకు వేలంలో పాల్గొనకుండా చేశారు. వారికి ఏదో కొంత డబ్బులు ఇచ్చి పంపేశారు. మార్కెట్లో రూ.100 కోట్ల విలువ చేసే ఆస్తిని రూ.12 కోట్లకే కొట్టేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ద్వారా ప్రత్యేక జీవో జారీ చేయించి.. కింద వాణిజ్య భవనం, పైన అల్లుడి కోసం ప్రైవేటు ఆస్పత్రి నిర్మాణానికి సిద్ధపడ్డారు.
రొయ్యల ఫ్యాక్టరీకి వంతెన
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో ద్వారంపూడికి తన సోదరుడి పేరుతో వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ అనే రొయ్యల ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే లారీలు, టిప్పర్లకు ప్రత్తిపాడు-లంపకలోవ మధ్యలో సుద్దగెడ్డ అనే వాగు అడ్డం వస్తుంది. చిన్నపాటి వర్షం వచ్చినా ఈ వాగు పొంగిపొర్లుతుంది. దీంతో 2021లో అప్పటి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి స్వయంగా వెళ్లి సుద్దగడ్డ వాగు పరిశీలించారు. 2021 మార్చి 25న రూ.2.70 కోట్లతో వంతెన నిర్మించేశారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని 20 ఏళ్ల నుంచీ పది గ్రామాలకు చెందిన 40 వేలమంది పోరాడినా అప్పటి వరకూ పట్టించుకోలేదు. ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాత ఆ కంపెనీ వాహనాలకు ఇబ్బంది లేకుండా రోడ్డు కమ్ వంతెన ఏర్పాటు చేశారు.
Updated Date - Dec 09 , 2024 | 03:18 AM