Ganta Srinivasa Rao: ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకం వైసీపీకే నష్టం: గంటా శ్రీనివాస రావు
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:00 PM
ఏపీ సీఎం జగన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవీ షర్మిల చేపట్టడంతో వైసీపీకి నష్టం జరుగుతుందని గంటా శ్రీనివాస్ అభిప్రాయ పడ్డారు.
విశాఖపట్టణం: ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి, టీడీపీ గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిలను (YS Sharmila) నియమించడం వైసీపీకి (YCP) నష్టమని గంటా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇన్నాళ్లూ వైసీపీ వైపు మళ్లిందని, ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందని గంటా శ్రీనివాస్ తెలిపారు. ఎంత శాతం వస్తుందో చెప్పలేమని, ఓటు బ్యాంక్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఆయన విశ్లేషించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని గంటా శ్రీనివాస్ జోస్యం చెప్పారు. ఓడిపోతామని సీఎం జగన్‌కు తెలుసునని చెప్పారు. అందుకోసమే దొంగ ఓట్లపై దృష్టిసారించారని వివరించారు. వైసీపీ ‘వై నాట్ 175’ అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని, తమ పార్టీ టీడీపీ మాత్రం ‘వై నాట్ పులివెందుల’ అంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారని, కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం పెట్టుబడులపై దృష్టిసారించడం లేదని గంటా శ్రీనివాస రావు విమర్శించారు. కేవలం 2019లో ఒక్కసారి మాత్రమే దావోస్‌కు వెళ్లారని సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు ఇతర చోట్లకు తరలి వెళుతున్నాయని గంటా పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం చంద్రబాబు దావోస్ వెళ్లేవారని ఆయన రావు గుర్తుచేశారు.
ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ సర్కార్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చిందని గంటా శ్రీనివాస్ విమర్శించారు. విద్యా సంస్థల్లో రాజకీయాలకు తావివ్వొద్దని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో సెర్చ్ కమిటీ వేసి వీసీలను నియమించామని గుర్తుచేశారు. జగన్ సర్కార్‌లో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే వీసీ అవుతున్నారని మండిపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 18 , 2024 | 12:15 PM