Guntur : అప్పులు చేస్తారు..అంతం చూస్తారు
ABN, Publish Date - Sep 07 , 2024 | 03:42 AM
సైనేడ్‌తో గుట్టుచప్పుడు కాకుండా దారుణ హత్యలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. వీరు ఇప్పటికే నలుగురిని ఈ విధంగా హత్య చేయగా మృతుల బంధువులు వాటిని సహజ మరణాలుగా భావించి అంత్యక్రియలు చేసేశారు.
సైనేడ్‌తో చిటికెలో చంపేస్తారు!
మద్యంలో, కూల్‌డ్రింక్‌లో సైనేడ్ కలిపి తాగిస్తారు
గుట్టుచప్పుడు కాకుండా నలుగురి దారుణ హత్య
ఒంటిపై బంగారం, అప్పులు ఎగ్గొట్టేందుకే ఘాతుకం
మరో ముగ్గురినీ అంతం చేయడానికి విఫలయత్నం
త్రుటిలో తప్పించుకొని బతికిపోయిన ఆ ముగ్గురూ
తల్లీకూతుళ్లు సహా ముగ్గురు మహిళల ఘాతుకం
గుంటూరు జిల్లాలో అరెస్టు
గుంటూరు, సెప్టెంబరు 6: సైనేడ్‌తో గుట్టుచప్పుడు కాకుండా దారుణ హత్యలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. వీరు ఇప్పటికే నలుగురిని ఈ విధంగా హత్య చేయగా మృతుల బంధువులు వాటిని సహజ మరణాలుగా భావించి అంత్యక్రియలు చేసేశారు. చేసిన అప్పులు ఎగ్గొట్టడానికి, మృతుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించే ఉద్దేశంతో ఈ ఘాతుకాలకు పాల్పడిన ముగ్గురు మహిళలను చేబ్రోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు తల్లీకూతుళ్లు. శుక్రవారం గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎస్. సతీశ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. వడ్లమూడి శివారులో ఈ ఏడాది జూన్ 13న గుర్తుతెలియని మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మృతురాలిని తెనాలి యడ్ల లింగయ్య కాలనీకి చెందిన నాగూర్‌బీ (45)గా గుర్తించారు. నాగూర్‌బీకి అదేకాలనీకి చెందిన మునగప్ప రజిని రూ.30వేలు అప్పు ఉంది. ఆమెను అడ్డు తొలగించుకుంటే అప్పు తీర్చేపని ఉండదని, పైగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కూడా సొంతం చేసుకోవచ్చని రజిని భావించింది.
తమ ప్రాంతానికే చెందిన ముడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి, ఆమె తల్లి బొంతు రమణమ్మతో కలసి వ్యూహం రచించింది. దీనిలో భాగంగా జూన్ 5న బయటికి వెళ్దామని నాగూర్ బీని రజిని ఆటోలో తీసుకువచ్చింది. వారి ఆటోను వెంకటేశ్వరి ద్విచక్రవాహనంపై అనుసరించింది. వీరికి వెంకటేశ్వరి తల్లి రమణమ్మ తన బంధువు కృష్ణ అలియాస్ బిల్లా అనే బంగారు షాపులో పనిచేసే యువకుడి ద్వారా సైనైడ్ తెప్పించి ఇచ్చింది. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్‌తో బ్రీజర్ బాటిల్ తెప్పించారు. వడ్లమూడి శివారులో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి అక్కడ బ్రీజర్‌లో సైనైడ్ కలిపి తాగించడంతో నాగూర్‌బీ మృతిచెందింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని ఇద్దరూ ఇంటికి వచ్చేశారు.
ఆ దారిలో ప్రయాణించిన ఆటో వివరాలు సేకరించిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోగా అతను రజిని పేరు చెప్పడంతో మిస్టరీ వీడింది. పోలీసు విచారణలో రజిని, వెంకటేశ్వరి, రమణమ్మ నేరాన్ని అంగీకరించారు. మరో ముగ్గురిని కూడా హత్య చేసినట్లు తెలిపారు. ఈ వరుస హత్యల్లో వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి, ఆమె తల్లి రమణమ్మ కీలకమని తేలింది. 2022లో తల్లితో కలసి వెంకటేశ్వరి తన అత్త అయిన సుబ్బలక్ష్మి(65)ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆమె ఇంట్లోనే మద్యంలో సైనేడ్ కలిపి తాగించి హత్య చేసింది.
ఆమె నోటి వెంట నురగ రావడంతో బంధువులు గుండెపోటుగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు. అత్త పేరుతో ఉన్న ఆస్తితో పాటు డబ్బు, బంగారం కోసమే ఈ హత్యకు పాల్పడ్డారు. అలాగే తాము అప్పుగా తీసుకున్న రూ.2లక్షలు ఎగ్గొట్టడంతో పాటు ఒంటిపై ఉన్న బంగారం, డబ్బు అపహరించడానికి తమకు అప్పుఇచ్చిన తెనాలికి చెందిన నాగమ్మ(65)ను గతేడాది ఆగస్టులో శీతల పానీయంలో సైనేడ్ కలిపి హత్య చేశారు. అదేవిధంగా తెనాలికి చెందిన భూదేవి అనే మహిళ భర్త పీసు అలియాస్ మోషేను మద్యంలో సైనేడ్ కలిపి తాగించి హత్య చేశారు. ఇదేకాకుండా మరో ముగ్గురు మహిళలను కూడా హత్య చేయడానికి వెంకటేశ్వరి, రమణమ్మ ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా, వరుస హత్యల కేసుల్లో ప్రధాన నిందితులైన వెంకటేశ్వరి ఆమె తల్లి రమణమ్మ వైసీపీ సానుభూతిపరులు. వెంకటేశ్వరి 2019-23 మధ్య వలంటీర్‌గా చేస్తూనే పలు హత్యలు, హత్యాయత్నాలకు తెగబడింది. కాగా, నిందితులకు సైనైడ్ ఇచ్చిన కృష్ణ్లపై కూడా కేసు నమోదు చేసి, నిందితుడిగా చేర్చనున్నట్లు ఎస్పీ తెలిపారు.
Updated Date - Sep 07 , 2024 | 03:42 AM