AP Govt: కరవు మండలాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. వివరాలు ఇవే..
ABN, Publish Date - Oct 29 , 2024 | 09:02 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 54 మండలాలను కరవు మండలాలుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: ఖరీఫ్ సీజన్- 2024 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. నైరుతీ రుతుపవనాల సీజన్‌లో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు సిసోడియా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవు బారిన పడినట్టు ఆయన చెప్పారు. మిగతా 21 జిల్లాల్లో ఎటువంటి కరవు పరిస్థితులు లేనట్లు నివేదికలు వచ్చాయని సిసోడియా వెల్లడించారు. 54 కరవు మండలాల్లో 27 చోట్ల తీవ్ర కరవు పరిస్థితులు, మరో 27 మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నట్లు ఆయన నివేదికలు విడుదల చేశారు. ఈ మేరకు కరవు మండలాలను నోటిఫై చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
కరవు ప్రభావిత జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. అన్నమయ్య జిల్లాలో 46.6 శాతం, చిత్తూరు జిల్లాలో 45.4 శాతం, అనంతపురం జిల్లాలో 56.4 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 52.7 శాతం, కర్నూలు జిల్లాలో 18.2 శాతం చొప్పున సాధారణం కంటే తక్కువ వర్షం నమోదు అయ్యింది. 2023 ఖరీఫ్‌లో 88.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. 2024 ఖరీఫ్‌లో 93.55 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 466 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులు ఉంటే కేవలం 103 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 114.72 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా 82 శాతం విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు.
Updated Date - Oct 29 , 2024 | 09:02 PM