Raghu Rama Case: రఘురామ థర్డ్ డిగ్రీ కేసు.. కీలక పోలీస్ అధికారికి రిమాండ్
ABN, Publish Date - Nov 27 , 2024 | 06:25 PM
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్టు చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మంగళవారం రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విజయ్ పాల్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది.
గుంటూరు జిల్లా: రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్‌కు (CID Retired ASP Vijayapal) గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. విజయ్ పాల్‌ను కస్టడీకి పోలీసులు కోరారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును (Raghu Rama Krishnamraju) వేధించిన వ్యవహారంలో కుట్ర దాగి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. కుట్రదారులు ఎవరో తేలాలంటే తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. విజయ్ పాల్‌ను కోర్టు నుంచి గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
రఘురామను తీవ్రంగా వేధించారు: రాజేంద్రప్రసాద్
ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి. రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రఘురామకృష్ణరాజును కస్టడీ లో తీవ్రంగా వేధించారు. నవ్వుతూ సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వ్యక్తి కనీసం నడవలేని స్థితిలో బయటకు వచ్చారు. కాళ్లను తాళ్లతో కొట్టేసి కొట్టారు. గుండెలపై కూర్చుని చావబాదారు. రఘురామకృష్ణరాజును చంపడానికి ప్రయత్నించారు. తనపై దాడి విషయం కోర్టుముందు చెప్పారు. తప్పుడు రిపోర్టు ఇచ్చిన జీజీహెచ్ వైద్యులు కూడా ఈ కేసులో నిందితులే. మిలిటరీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం రఘురామకృష్ణరాజు శరీరంపై గాయాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో 27 మందిని విచారించాం. అప్పట్లో విచారణ సందర్భంగా ఉన్న వారిని కూడా విచారించాం. ఆ మేరకు రఘురామకృష్ణరాజుపై దాడి జరిగినట్లు నిర్ధారణకు వచ్చాం. రఘురామను వేధించిన విషయం వీడియో తీశారు. అప్పటి పెద్దలకు ఆ వీడియోలు పంపించారు. వారు ఎవరనేదీ త్వరలో తేలుతుంది’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
రిమాండ్ రిపోర్ట్ ..
రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్టు (Arrest)చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను (CID Retired ASP Vijayapal) మంగళవారం రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ (SP Damodar) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు జీజీహెచ్‌లో విజయపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత ఆయనను గుంటూరుకు తరలించారు. కాగా రఘురామ కేసులో మంగళవారం విజయపాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం రాత్రి 9 గంటలకు అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. రాత్రి నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విజయపాల్ ఉన్నారు.
రఘురామ ఫిర్యాదు..
కాగా రఘురామకృష్ణ రాజును కస్టడీలో హింసించిన కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు నిరాకరించడం, విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ విషయాన్ని ప్రకటించారు. విజయ్‌పాల్‌ను భారీ భద్రత మధ్య ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం గుంటూరుకు తీసుకెళ్లనున్నారు. కస్టోడియల్ టార్చర్‌పై రఘురామ ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీని విచారణాధికారిగా నియమించింది. ఈనెల 13వ తేదీన పోలీసులు విజయ్‌పాల్‌ను ఈ కేసులో ప్రశ్నించారు. ‘తెలియదు... గుర్తులేదు... మరిచిపోయా’ అనే సమాధానాలు ఇస్తూ ఆయన విచారణకు సహకరించకుండా మొండికేశారు.
అనేక కోణాల్లో విచారణ
మంగళవారం మరోమారు విజయ్‌పాల్‌ను ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ ఏఆర్ దామోదర్ సాయంత్రం 6 గంటలకు స్వయంగా రంగంలోకి దిగారు. రఘురామకృష్ణరాజును అంతమొందించేందుకు కుట్ర పన్నారా? దీని వెనుక ఎవరు ఉన్నారు? కస్టడీలో ఆయనను ఎందుకు హింసించారు? మీరు కొట్టకుంటే ఆయన కాలికి గాయాలు ఎలా అయ్యాయి? ఎవరి ఆదేశాల మేరకు రఘురామను కొట్టారు? కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయనను అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏమిటి? కనీసం నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా ఎందుకు సీఐడీ కార్యాలయంలో నిర్బంధించారు? నిబంధనలు పాటించకపోవడానికి కారణమేమిటి? ఇలా అనేక కోణాల్లో విజయ్‌పాల్‌ను ప్రశ్నించారు. కానీ... ఆయన దేనికీ సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. పోలీసులు సేకరించిన ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించి... కొంత సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. రాత్రి 9 గంటల వరకు విచారణ జరిపిన తర్వాత... ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. విచారణలో పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రధాన ద్వారం నుంచి విచారణ జరిపిన గెలాక్సీ భవన్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోకి ఇతరులెవ్వరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.
కోర్టుల్లో చుక్కెదురు
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విజయ్‌పాల్ విశ్వప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించడం గమనార్హం. ముందస్తు బెయిల్ కోసం విజయ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో... ఆయన అరెస్టుకు మార్గం సుగమమైంది.
వీరిపైనే కేసు...
2021 మే నెలలో సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నం చేశారని ఈ ఏడాది జూలైలో రఘురామ రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు నగరంపాలెం స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్, అప్పటి సీఎం జగన్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావతి, మరి కొంతమందిని నిందితులుగా చేర్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొనసాగుతున్న గాలింపు.. వర్మ పిటిషన్‌పై నేడు విచారణ
మళ్లీ వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక
యూఎస్‌లో కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Nov 27 , 2024 | 06:49 PM