AP -Telangana CS-Meeting: రెండు రాష్ట్రాల విభజన అంశాలపై సీఎస్‌ల కీలక సమావేశం
ABN, Publish Date - Dec 02 , 2024 | 03:51 PM
రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా భేటీ అయ్యారు. అధికారుల కమిటీ సమావేశానికి ప్రాధాన్యం సంతరించకుంది.
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంగిళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా సీఎస్‌లు భేటీ అయ్యారు. అధికారుల కమిటీ సమావేశానికి ప్రాధాన్యం సంతరించకుంది. ఏపీ - తెలంగాణా సీఎస్‌ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరిగింది. విభజన చట్టంలోని 9.10 షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలపై సీఎస్‌ల కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ చర్చించినట్లు సమాచారం.
ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. విభజన పూర్తి కాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపైనా అధికారుల కమిటీలో చర్చించారు. షెడ్యూలు 9,10 లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిపోయిన రూ. 8 వేల కోట్ల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎక్సైజు శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్ కుమార్ , పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌లు, ఏపీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ , ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు ఏ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రుల భేటీ
కాగా.. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రజా భవన్ వేదికగా సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఇద్దరు సీఎంల భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై మాట్లాడారు. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించారు. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించారు.
భిన్న వాదనలు ..
ఏపీ తెలంగాణ సీఎస్‌ల సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10షెడ్యూల్‌లో ఉన్న కార్పొరేషన్లు, సంస్థల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. 9వ షెడ్యూల్లో 91 కార్పొరేషన్లు ఉండగా 23కార్పొరేషన్లపై రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు వచ్చాయి. విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్ అనే పదానికి భిన్నవాదనలను రెండు రాష్ట్రాలు వినిపిస్తున్నాయి.
కుదరని ఏకాభిప్రాయం..
కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కార్పొరేషన్‌కు చెందిన అన్ని భవనాలను హెడ్ క్వార్టర్‌గా పరిగణించాలని ఏపీ ప్రభుత్వం అంటుంది. దీంతో ఆర్టీసీ ఆస్తుల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. 9వ షెడ్యూల్‌లోని 23 సంస్థలపై రెండు రాష్ట్రాల మధ్య వాగ్వాదం నడుస్తోంది. అందులో ఏపీఎస్ఆర్టీసీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో , ట్రాన్స్‌కో సంస్థల ఆస్తుల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ఆ విద్యాలయాలపై వివాదం ..
ఇద్దరు సీఎస్ ల భేటీలో ఈ సమస్యలపై పరిష్కరించే అవకాశం ఉంది. 10వ షెడ్యూల్ లో మొత్తం 142 సంస్థలు ఉండగా 30సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తాయి. విభజన చట్టంలోని సెక్షన్ 75ప్రకారం స్థానికత ఆధారంగా ఆ సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందుతాయనడాన్ని ఏపీ వ్యతిరేకిస్తుంది. 10వ షెడ్యూల్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ, AMRAP అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, పోలీస్ అకాడమీ, ఎక్సైజ్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇంటర్మీడియట్ బోర్డు, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.
విద్యుత్ బకాయిలపై..
విద్యుత్ బకాయిల విషయంలోనూ వివాదం ఉంది. 2014జూన్ నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ తీసుకున్న విద్యుత్‌కు రూ. 3441కోట్లు రావాలని ఏపీ చెబుతోంది. సకాలంలో చెల్లించనందుకు ఆలస్యం రుసుం కింద మరో రూ.3315 కోట్లు కలిపి మొత్తం రూ. 6756 కోట్లు చెల్లించాలని ఏపీ డిమాండ్ చేస్తోంది . ఏపీ నుంచే తమకు రూ. 17,828కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఏపీకి చెల్లించాల్సినవి రూ.4887 కోట్లు తీసేసి మిగతా రూ. 12940 కోట్లు తమకే ఏపీ నుంచి రావాలని తెలంగాణ అంటోంది. ఈ అంశాలపై సీఎస్‌ల సమావేశంలో చర్చించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Ap Govt : రాష్ట్ర కేబినెట్ భేటీ రేపే
YS Sharmila: ఇదో జాతీయ స్థాయి కుంభకోణం
Botsa Satyanarayana: డిప్యూటీ సీఎం పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది
For AndhraPradesh News And Telugu news
Updated Date - Dec 02 , 2024 | 04:24 PM