Atchannaidu: జగన్‌వి తప్పుడు ప్రచారాలు.. అచ్చెన్న ఫైర్
ABN, Publish Date - Aug 23 , 2024 | 02:18 PM
అబద్ధాలు జన్మ నక్షత్రంగా తప్పుడు ప్రచారాలు లక్ష్యంగా మాజీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. ఆయన అబద్ధాలు నమ్మమని ముఖం మీద కొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని ఆరోపణలు చేశారు.
అమరావతి: అబద్ధాలే జన్మనక్షత్రం, తప్పుడు ప్రచారాలు లక్ష్యంగా మాజీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. ఆయన అబద్ధాలు నమ్మమని ముఖం మీద కొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని ఆరోపణలు చేశారు. విశాఖ అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అన్ని విధాలా అండగా ప్రభుత్వం నిలబడిందన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ప్రమాదంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించి అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ధర్నా చేస్తానని జగన్‌రెడ్డి ప్రకటించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. ఈ సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం, అంబులెన్స్‌లు వచ్చి వైద్యం అందిస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని జగన్ ఏ విధంగా మాట్లాడతారు? అని అచ్చెన్నాయుడు నిలదీశారు.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో జగన్ ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో అందలేదని గుర్తుచేశారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత 15 రోజుల వ్యవధిలో చనిపోయిన ముగ్గురికి రూ.లక్షతో పరిహారం సరిపెట్టిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలని నిరసన తెలియజేసిన 30 మందిపై గోపాలపట్నం స్టేషన్‌లో కేసు పెట్టింది జగన్‌రెడ్డి కాదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో పరిహారాల కోసం రోడ్డెక్కని బాధితులెవరైనా ఉన్నారా? అని నిలదీశారు. ద్విచక్ర వాహనాలపై రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లిన సంఘటనలు వైసీపీ హయాంలో కోకొల్లలు చోటు చేసుకున్నాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Updated Date - Aug 23 , 2024 | 02:35 PM