CM Chandrababu: ఆ అధికారిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం... చంద్రబాబు చర్యలు
ABN, Publish Date - Nov 29 , 2024 | 05:21 PM
జగన్ ప్రభుత్వంలో ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారంలో ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గనుల శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి అరెస్ట్ చేశారు.
అమరావతి: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డికి జైల్లో సకల రాజభోగాలు సమకూర్చారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వార్తా కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివేదిక తెప్పించుకుని చర్యలు చేపట్టారు. నారావారిపల్లి నుంచి సచివాలయానికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడతో పాటు రాష్ట్ర జైలు అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి ఆదేశాలు జారీ చేశారు. వెంకటరెడ్డి జైల్లో ఉన్న సమయంలో కొత్త ఫ్రిజ్, కొత్త టీవీ సమకూర్చారని నివేదికలో తెలిపారు. దాతలు ఇచ్చినప్పటికీ అవి వెంకటరెడ్డి రూమ్‌లో ఏర్పాటు చేశారని నివేదికలో వెల్లడించారు. బయట నుంచి రోజూ భోజనం ఎలా తీసుకు వచ్చారని అదికారులను సీఎం చంద్రబాబు నిలదీశారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారో.. తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వెంకటరెడ్డికి బెయిల్ వ్యవహారంలో కూడా అధికారులు సరిగ్గా వ్యవహరించలేదని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. జైల్లో రాజభోగాలపై మరింత మండిపడ్డారు. తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
వెంకటరెడ్డిపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు
కాగా.. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇసుక పర్మిట్లు ఇవ్వడంలో చాలా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం పేర్కొంది. అందుకనే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తోంది. కేంద్ర సర్వీస్‌ల నుంచి వచ్చిన వెంకట రెడ్డికి డిప్యూటేషన్ పూర్తి కావాల్సి ఉంది. సస్పెండ్ చేయకపోతే రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. న్యాయ సలహా తీసుకుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వెంకటరెడ్డిపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి.
పెద్ద ఎత్తున అవకతవకలు..
జగన్ ప్రభుత్వంలో ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారంలో వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గనుల శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టడంతో అవన్నీ ఆరోపణలు కాదని.. నిజాలని తేలాయి. దీంతో వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేయాలని సీఎం చంద్రబాబుకు గనుల శాఖ ఉన్నతాధికారులు సిఫార్స్ చేశారు. దీంతో వెంకటరెడ్డి రిలీవ్ కావడానికి ముందే సస్పెండ్ చేశారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలను వెంకట్‌రెడ్డి తూచా తప్పకుండా పాటించే వారనే ప్రచారం నాడు పెద్ద ఎత్తున నడిచింది. అంతేకాకుండా ఏపీఎండీసీ ఎండీగా వెంకటరెడ్డి తీసుకున్న పలు కీలక నిర్ణయాలు సైతం నాడు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి.
డిప్యూటేషన్‌పై ఏపీకి వచ్చిన వెంకటరెడ్డి
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తర్వాత జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. తమకు అనుకూలంగా వ్యవహరించే ఉన్నతాధికారులందరినీ ఏపీకి తీసుకురావడం. ఆ తర్వాత వారితో చేయించాల్సిన అరాచకాలన్నీ చేసింది. అలా కోస్ట్ గార్డ్స్‌లో పని చేసే వెంకటరెడ్డిని డిప్యూటేషన్‌పై జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకు వచ్చిందని ఓ ప్రచారం సైతం గతంలో సాగింది. ఆయనను ఏపీకి తీసుకొచ్చి అత్యంత ప్రాధాన్యమున్న ఏపీఎండీసీ ఎండీ సీటులో జగన్ కూర్చోబెట్టారు. అలాంటప్పుడు స్వామి భక్తి చాటకుండా ఎలా ఉంటారు. బీభత్సంగా చాటారు. జగన్ హయాంలో చాలా శాఖలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి కానీ గనుల శాఖపై మాత్రం పీక్స్‌లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Updated Date - Nov 29 , 2024 | 05:31 PM