AP NEWS: ఈనెల 24, 25 తేదీల్లో కలెక్టర్ల సదస్సు
ABN, Publish Date - Nov 10 , 2024 | 09:51 AM
కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత తొలి కలెక్టర్ల సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. అధికార దర్పానికి దూరంగా ఉండాలని... పేదలకు దగ్గర కావాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అమరావతి: కలెక్టర్ల సదస్సును ఈనెల 24, 25తేదీల్లో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నది. తొలిసారి జరిగిన కలెక్టర్ల సమావేశంలో చర్చించిన, తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లు పురోగతి వివరించేలా నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడిచిన నాలుగు నెలల్లో ప్రభుత్వ శాఖల వారీగా నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
కలెక్టర్లకు మార్గనిర్దేశం..
అయితే.. కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత తొలి కలెక్టర్ల సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. అధికార దర్పానికి దూరంగా ఉండాలని... పేదలకు దగ్గర కావాలని సూచించారు. ఎమ్మెల్యేలూ, మంత్రులకూ ఇదే చెప్పారు. ‘మా ప్రభుత్వ విధానం, మా లక్ష్యాలు ఇవి. మీరు వినూత్నంగా ఆలోచించండి. మనసుపెట్టి పని చేయండి. ఫలితాలు సాధించండి’ అని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు అందరి పనితీరు సమీక్షిస్తుంటానని చంద్రబాబు చెప్పారు.
11 నుంచి శాసనసభ సమావేశాలు
కాగా.. శాసనసభ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి, శాసనసభ భేటీ అవుతాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియనున నేపథ్యంలో సమావేశాల మొదటి రోజే 11వ తేదీన 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలో స్పీకర్ అయన్నపాత్రుడి అధ్యక్షతన జరిగే సభా వ్యవహారాల సలహా మండలి(బీఏసీ)లో నిర్ణయం తీసుకుంటారు. 11 రోజులపాటుజరిగే వీలుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశాలకు 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ హాజరవుతుందా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు.
Updated Date - Nov 10 , 2024 | 02:36 PM