Rain Alert: మరోసారి భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం..
ABN, Publish Date - Oct 12 , 2024 | 07:14 PM
అక్టోబర్ 12న దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది క్రమంగా పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బలపడనున్న ఆవర్తనం..
శనివారం(అక్టోబర్ 12న) దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది క్రమంగా పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి క్రమంగా వాయుగుండం మారి తుపానుగా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభావం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో తుపాను ఉగ్రరూపం దాల్చుతుందన్న వార్త హడలెత్తిస్తోంది. అయితే తాజాగా ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి అక్టోబర్ 14 నుంచి 16 మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాలు సహా తెలంగాణపైనా ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను వల్ల పెద్దఎత్తున నష్టం వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలపాటు అలర్ట్‌గా ఉంటూ ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున చెరువులు, కాలువ గట్లకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బలహీనంగా ఉన్న గట్లను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులను అప్రమత్తం చేయాలని, ఎవరూ వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. పిడుగులు పడి, వాగులు పొంగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు బయటకు వెళ్లకుండా వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
తెలంగాణకు హెచ్చరిక..
తుపాను ప్రభావం ఏపీతోపాటు తెలంగాణకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీమ్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హన్మకొండ, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, ఆయా తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. మరో రెండు, మూడ్రోజుల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ట్వీట్.. కేసు నమోదు..
CM Chandrababu: నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చంద్రబాబు సమీక్ష..
AP News: పండగ పూట దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం..
Updated Date - Oct 12 , 2024 | 07:15 PM