Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. మంత్రుల వరుస సమీక్షలు
ABN, Publish Date - Aug 31 , 2024 | 09:04 PM
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలపై అధికారులతో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు(శనివారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలపై అధికారులతో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు(శనివారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వాతావరణ శాఖ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
ఇరిగేషన్ శాఖ ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి అధికారులు వరకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బుడమేరు స్థాయిని మించి పొంగి ప్రవహిస్తుండటంతో విజయవాడ నగరంతో పాటు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని భేరీజు వేసుకుని ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి, కంతేరు, కొప్పురావూరు, ప్రాంతాల్లో పడిన భారీవర్షాలకు హైవేపై నీరు ప్రవహించి గుంటూరు ఛానెల్లో పలుచోట్ల గండ్లు పడి , నంబూరు, కాకాని గ్రామాల్లోకి వరద నీరు చేరిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
మంత్రి గొట్టిపాటి రవి నిరంతర సమీక్షలు
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి నిరంతర సమీక్షలు జరిపారు. విద్యుత్ అంతరాయాలపై శాఖకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. విజయవాడలోనే ఎక్కువ ఫిర్యాదులు ఉన్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ...సీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకు విద్యుత్ అంతరాయంపై 1314 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. 210 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్లు వర్షపు నీటితో మునిగినందున అవి ట్రిప్ అవుతున్నాయని చెప్పారు. ప్రాణనష్టం జరగకూడదనే కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు విద్యుత్ ఆపామని అన్నారు.
తమ సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారని.. గంట గంటకు ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారని తెలిపారు. వీటీపీఎస్ ప్లాంట్‌లోకి వరదలతో ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగిందని అన్నారు. రేపటిలోపు ఆ ప్లాంట్ రన్నింగ్‌లోకి వస్తుందని చెప్పారు. విద్యుత్ సిబ్బంది మొత్తాన్ని అప్రమత్తంగా ఉండమని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్ సమస్యలపై ఎంపీ కేశినేని చిన్నీ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, గద్దె రామ్మోహన్, బోండా ఉమాలతో మంత్రి గొట్టిపాటి రవి చర్చించారు.
Updated Date - Aug 31 , 2024 | 09:09 PM