AP News: వాసుదేవ రెడ్డి ఇంట్లో సీఐడీ సోదాలు.. బయటపడ్డ కీలక ఆధారాలు
ABN , Publish Date - Aug 19 , 2024 | 07:15 AM
మద్యం కుంభకోణంలో ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులోని నివాసం యలహంక ప్యాలెస్ సమీపంలోని ఒక హోటల్‌లో వాసుదేవ రెడ్డి బస చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. అతనిని పిలిపించి అధికారులు విచారించారు.

అమరావతి: మద్యం కుంభకోణంలో ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులోని నివాసం యలహంక ప్యాలెస్ సమీపంలోని ఒక హోటల్‌లో వాసుదేవ రెడ్డి బస చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. అతనిని పిలిపించి అధికారులు విచారించారు. మద్యం కుంభకోణంలో పాత్రధారి వాసుదేవ రెడ్డి అని నిర్ధారణకు సీఐడీ అధికారులు వచ్చారు. డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు, ధరలు నిర్ధారణ వంటి అంశాల్లో వాసుదేవ రెడ్డిది కీలకపాత్ర ఉందని అధికారులు స్పష్టం చేశారు. కమీషన్లు కోసం ధరలు పెంచారని కొంతమంది అధికారులు చెబుతున్నారు. ఆ కమీషన్లు నేరుగా వైసీపీ పెద్దలకు అందాయని సీఐడీ అధికారుల విచారణలో తేలింది.
వీటన్నింటిపై వాసుదేవ రెడ్డిను పిలిపించి సీఐడీ అధికారులు విచారించారు. బెంగళూరులోనే సీఐడీ బృందాలు ఇంకా సోదాలు చేస్తున్నాయి. వాసుదేవ రెడ్డి చెప్పిన వివరాల మేరకు రికార్టులను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి సాక్ష్యాలు లభించిన తర్వాత మాత్రమే వాసుదేవ రెడ్డినీ అదుపులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేస్తే బెయిల్ పొందే అవకాశం ఉంటుందని సీఐడీ అధికారులు చెబుతున్నారు.
పూర్తి ఆధారాలు లేకుండా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే సీఐడీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకే బేవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ అధికారులకు పిలిపించి విచారిస్తున్నారు. రికార్టులను సీఐడీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కాగా వాసుదేవ రెడ్డి సీఐడీ అదుపులో ఉన్నారని వార్తలు వస్తుండటంతో.. ఆయన తాము అరెస్ట్ చేయలేదని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. వాసుదేవరెడ్డిను అవసరమైనప్పుడు పిలిపించి సీఐడీ అధికారులు ప్రశ్నించి వదిలివేస్తున్నట్లు సమాచారం. వాసుదేవ రెడ్డిను తాము అరెస్ట్ చేయలేదని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు.
వాసుదేవ రెడ్డి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు అధికారి. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఏరికోరి ఆయనను రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. కీలకమైన మద్యం అమ్మకాల బాధ్యతను ఆయన చేతుల్లో పెట్టారు. అంతే... ఆ రోజు నుంచి జగన్ ఆదేశాలే శిరోధార్యంగా వాసుదేవ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ పనితీరును మార్చేశారు. మద్యం వ్యాపారంపై జగన్ మార్కు వేయించారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ శ్రేణులకు మద్యం ధారాళంగా అందేలా చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో ప్రభావం చూపే కీలకమైన మద్యాన్ని వాసుదేవరెడ్డి అధికార పార్టీకి అడిగినంత ఇస్తున్నారంటూ ఇటీవల ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆయనను పక్కకు తప్పించాలని ఆదేశించింది. దీంతో... ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ రెడ్డిని తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కార్పొరేసన్ ఎండీగా ఎంకెవరినో కాకుండా... ఐఏఎస్‌నే నియమించాలని ఈసీ నిర్ణయించుకోవడం గమనార్హం. దీనికోసం ఈసారి ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రతిపాదించాలని ఈసీ ఆదేశించింది. ఆ మేరకు ముగ్గురు యువ ఐఏఎస్ అధికారుల పేర్లను ఈసీకి పంపింది.
సర్వం ఆయనే....
మొదటినుంచీ వైసీపీతో అంటకాగుతున్న వాసుదేవరెడ్డి ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి మద్యం విషయంలో ఢోకా లేకుండా చూస్తున్నారు. షాపులు ఎలాగూ గత ప్రభుత్వానివే కావడంతో పలు చోట్ల వైసీపీ నేతలకు పెద్దఎత్తున మద్యం సరఫరా చేశారు. వాస్తవానికి గతంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ పోస్టుకు ప్రత్యేకంగా అధికారిని నియమించేవారు కాదు. ఎక్సైజ్ కమిషనరే ఇన్‌చార్జ్ ఎండీగా వ్యవహరించేవారు. అప్పట్లో మద్యం పాలసీ రూపొందించడం, వేలం నిర్వహించడం, ఆదాయం వ్యవహారాలను కార్పొరేషన్ చూసేది. కానీ మద్యం విషయంలో పక్కా ప్లాన్ రూపొందించిన వైసీపీ ప్రభుత్వం వ్యాపారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. అప్పుడు వాసుదేవరెడ్డిని ఎండీగా నియమించి, మొత్తం వ్యాపారాన్ని ఆయన చేతుల్లో పెట్టింది. వైసీపీ ప్రభుత్వం పైకి ‘ప్రభుత్వ మద్యం షాపుల’ పాలసీని ప్రకటించినా అంతర్గతంగా కమీషన్ల పాలసీని ప్రవేశపెట్టింది. కంపెనీలకు ఆర్డర్ ఇవ్వాలంటే, ప్రతి కేసుకు రూ.200 నుంచి రూ.250 వైసీపీ పెద్దలకు కమీషన్ చెల్లించాలి. ఈ ప్రక్రియలో కంపెనీలకు ఆర్డర్లు వాసుదేవరెడ్డి ఇస్తే, షాపుల్లో ఏం అమ్మాలనేది ఎక్సైజ్‌లో ఓ డిప్యూటీ కమిషనర్ చూసుకున్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎడాపెడా అప్పులు చేసిన జగన్ ప్రభుత్వం, బేవరెజెస్ కార్పొరేషన్‌నూ వదల్లేదు. మద్యం ఆదాయాన్ని చూపించి రూ.14వేల కోట్లు అప్పులు చేసింది. ఈ ప్రక్రియలో ఎండీ వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
టీడీపీ హయాంలో మద్యం విధానంపై ఫిర్యాదు చేసిందీ, చంద్రబాబుపై కేసు పెట్టించిందీ వాసుదేవ రెడ్డే. స్వయంగా ఆయనే సంతకాలు చేసి ఫిర్యాదును సీఐడీ చేతుల్లో పెట్టారు. చంద్రబాబును మరిన్ని రోజులు జైల్లో ఉంచాలని వైసీపీ చేసిన కుట్రకు సహకరించారు.
వైసీపీతో సాన్నిహిత్యం
2008 బ్యాచ్‌కు చెందిన వాసుదేవరెడ్డి గతంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌లో పనిచేశారు. అప్పట్లో ఆయనకు సీఎం కార్యాలయంలో పనిచేసే కేఎన్‌ఆర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచీ ఆయన రైల్వేకు సంబంధించి విషయాల్లో వైసీపీకి సమాచారం చేరవేస్తూ, పార్టీ నేతలకు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోటలో జగన్ కుటుంబంపై జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన సమాచారం ముందుగానే జగన్‌కు ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇలా తొలినుంచీ వైసీపీతో పలు రకాలుగా సన్నిహితంగా ఉంటూ వచ్చిన వాసుదేవరెడ్డిని అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యుటేషన్‌పై రాష్ర్టానికి తీసుకొచ్చారు. మొదటి మూడేళ్ల డిప్యుటేషన్ గడువు ముగిసినా పైస్థాయిలో సిఫారసు చేయించి మరీ మరో మూడేళ్లకు కొనసాగించేలా కేంద్రం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు.