AP News: సీఎం సహాయ నిధికి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు విరాళం
ABN, Publish Date - Sep 17 , 2024 | 09:48 PM
సామాజిక బాధ్యతగా సీఎం సహాయ నిధికి విరాళం అందించానని సీనియర్ జర్నలిస్టు అంకబాబు చెప్పారు. ఇది ఓ జర్నలిస్టుగా తన బాధ్యత అని వివరించారు.
అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధికి సీనియర్ జర్నలిస్టు అంకబాబు రూ. 5 లక్షల విరాళం అందజేశారు. ఏపీ సెక్రటేరియట్‌లో ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి విరాళం అందించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు అంకబాబు మాట్లాడుతూ... సామాజిక బాధ్యతగా సీఎం సహాయ నిధికి విరాళం అందించానని చెప్పారు. ఇది ఓ జర్నలిస్టుగా తన బాధ్యత అని వివరించారు.
విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. విపత్తు సమయంలో ఏడుపదుల వయస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చొరవ, సమయస్ఫూర్తి అద్భుతమని ప్రశంసించారు. కలెక్టరేట్‌లో 9 రోజులపాటు బస్సులోనే ఉంటూ అధికారులను చంద్రబాబు పరుగులు పెట్టించారని అన్నారు. వరదలో చిక్కుకుపోయిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపన్నహస్తం అందించారని అంకబాబు పేర్కొన్నారు.
వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, పాలన దక్షత వరద బాధితులను విపత్తు నుంచి గట్టెక్కించిందని చెప్పారు. తాను 40 ఏళ్లుగా విజయవాడలో జర్నలిస్టుగా పని చేశానని అన్నారు. ఎప్పుడు ఇలాంటి విపత్తు చూడలేదన్నారు. దేశంలో ఏ నాయకుడు చంద్రబాబు మాదిరిగా విపత్తుల సమయంలో ఇలా స్పందించిన దాఖలాలు లేవని అంకబాబు అన్నారు.
ఈ విపత్తు చూసి తాను చలించిపోయానని అన్నారు. తన కుమార్తె లక్ష్మి, కుమారుడు రంజిత్‌లు అమెరికాలో ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పారు. వాళ్ల ప్రోత్సాహంతోనే రూ. 5 లక్షల విరాళం ఇచ్చానని చెప్పారు. నిజం నిర్భయంగా చెప్పగలిగినవారే నిజమైన జర్నలిస్టు అని అంకబాబు వెల్లడించారు.
Updated Date - Sep 17 , 2024 | 10:03 PM