Amaravati: కాకినాడ సీపోర్ట్ వ్యవహారం.. చెమటలు పట్టిస్తున్న సీఐడీ అధికారులు..
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:08 PM
కాకినాడ పోర్టును బెదిరించి లాగేసుకున్న వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో శరత్ చంద్రారెడ్డితోపాటు ఆడిటింగ్ కంపెనీ శ్రీధర్ అండ్ సంతానానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.
అమరావతి: కాకినాడ పోర్టు(Kakinada Port)ను బెదిరించి లాగేసుకున్న వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో ఏపీ సీఐడీ (CID) దూకుడు పెంచింది. అరబిందో శరత్ చంద్రారెడ్డి(Sarath Chandra Reddy)తోపాటు శ్రీధర్ అండ్ సంతానం (Sridhar and Santhanam) ఆడిటింగ్ కంపెనీకి సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆడిటింగ్ కంపెనీ డైరెక్టర్లు సుందర్, విశ్వనాథ్ ఇవాళ (శనివారం) విచారణకు హాజరయ్యారు. తాను అయప్ప మాలలో ఉండడంతో విచారణకు హజరుకాలేనని శరత్ చంద్రారెడ్డి సీఐడీకి లేఖ రాశారు.
ఈనెల 24వ తేదీ తర్వాత విచారణకు వస్తానని ఆయన లేఖలో కోరారు. నేడు ఉదయం 11 గంటల నుంచీ ఆడిటింగ్ కంపెనీ నిర్వాహకులను సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. రూ.964 కోట్ల పన్నును కేవీ రావు కంపెనీ ఎగవేసిందని చెన్నైకి చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ ఆడిట్ రిపోర్టులను సీఐడీకి అందజేసింది. ఈ రిపోర్టు చూపించే వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తనను బెదిరించారని సీఐడీకి కేవీ రావు ఫిర్యాదు చేశారు. కేవీ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాకినాడ సీపోర్టును బెదిరించి లాగేసుకున్న తర్వాత సంతానం కంపెనీ ఆడిట్ రిపోర్టును మార్చేసింది.
రూ.964 కోట్లకు బదులు రూ.9.30 కోట్లు మాత్రమే పన్ను చెల్లించాలని ఆడిటింగ్ కంపెనీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను ఎందుకు మార్చాల్సి వచ్చిందని, మీ వెనక ఎవరెవరు ఉన్నారనే అంశంపై సీఐడీ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. సుందర్, విశ్వనాథ్‌ను విచారించిన తర్వాత ఆడిట్ కంపెనీ ఇచ్చిన సర్టిఫికెట్లపై సంతకాలు చేసిన అపర్ణ, ప్రసన్న కుమార్‌ను సైతం విచారణకు పిలవాలని సీఐడీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం నుంచీ ఎస్పీ స్థాయి అధికారులు విచారణ చేస్తుండడంతో చెన్నై ఆడిటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
YS Sharmila: మీకొచ్చిన ఇబ్బంది ఏమిటీ సీఎం చంద్రబాబు గారు..
Free Bus: బస్సు ఎక్కితే నో టికెట్... ఎప్పటినుంచంటే...
Updated Date - Dec 21 , 2024 | 03:13 PM