AP NEWS: జగనన్న విడిచిన బాణం నేడు ఏమైంది...?: వర్లరామయ్య
ABN, Publish Date - Feb 02 , 2024 | 06:59 PM
సీఎం జగన్(CM Jagan)ది విపరీత, విచిత్రమైన మనస్తత్వమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varlaramaiah) అన్నారు. జగనన్న విడిచిన బాణం నేడు ఏమైంది..? నేడు ఎందుకు ఎదురు తిరిగిందో చెప్పగలరా..? అని ప్రశ్నించారు.
అమరావతి: సీఎం జగన్(CM Jagan)ది విపరీత, విచిత్రమైన మనస్తత్వమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varlaramaiah) అన్నారు. జగనన్న విడిచిన బాణం నేడు ఏమైంది..? నేడు ఎందుకు ఎదురు తిరిగిందో చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, పత్రికలు, ప్రజా, కుల సంఘాలు, హేతువాదులు అడిగిన ప్రశ్నలకు జగన్ ఏనాడూ సమాధానం చెప్పలేదని నిలదీశారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో వర్లరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రూ.43 వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ జగన్‌పై 11 ఛార్జిషీట్లు వేసిందన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని రూ.43 వేల కోట్లు కొట్టేసినట్లు సీబీఐ చెప్పకనే చెప్పిందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ 5 కేసులు నమోదు చేసి ఛార్జిషీట్లు వేశారని.. రూ.2 వేల కోట్ల పైచిలుకు ఆస్తులు స్వాధీనపరచుకున్నారని అన్నారు. 2004లో జగన్ తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తులు 2.12 కోట్లు కాదా అని వర్లరామయ్య ప్రశ్నించారు.
‘‘2009 ఎన్నికల ఆఫిడవిట్‌లో తన ఆస్తి రూ.77 కోట్ల 40 లక్షలకు ఎలా ఎగబాకింది..? నాలుగు సంవత్సరాల్లో ఇది అనితర సాధ్యమా..? ఏ ప్రశ్నలకు మీరేందుకు సమాధానం చెప్పరు. మౌనం అర్ధాంగికారమా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా..? నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో మీరు తప్పుడు మనిషేగా..? అతి కొద్ది కాలంలోనే మీరు దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా రూపాంతరం చెందారు..? లోటస్ పాండ్ మీదా..? కాదా..? మీదైతే మీకెక్కడిది..? 29 ఎకరాల్లో అమెరికా శ్వేత సౌధాన్ని తలదన్నే సౌదాన్ని బెంగళూరులో మీరు ఎలా నిర్మించగలిగారు..? మీ బాబాయి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అడిగిన మీరు, తర్వాత హైకోర్టు నుంచి దానిని ఎందుకు వెనక్కి తీసుకున్నారు..? కోడికత్తి శీనును మీ కుట్రలో పావుగా వాడుకొని 5 ఏళ్లుగా రిమాండ్ ఖైదీగా ఎందుకుంచారో చెప్పగలరా’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
Updated Date - Feb 02 , 2024 | 07:00 PM