Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్..
ABN, Publish Date - Dec 13 , 2024 | 06:20 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ చెప్పారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
అమరావతి: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ చెప్పారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అర్జున్ చెప్పారని ఫ్యాన్ పార్టీ అధినేత తెలిపారు. అయినా పోలీసులు అరెస్టు చేయడం సరికాదని వైసీపీ అధినేత అభిప్రాయపడ్డారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు సరికాదని మాజీ సీఎం జగన్ అన్నారు.
తొందరపాటు చర్యే..
మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ స్పందించారు. బన్నీని అరెస్టు చేయడం సరికాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. అరెస్టును తాను టీవీలో చూశానని, అలాగే మోహన్ బాబు ఇంట్లో జరిగిన న్యూసెన్స్ కూడా చూశానని ఆయన చెప్పారు. ఐకాన్ స్టార్ అరెస్టు అనేది తొందరపాటు చర్యగా తాను భావిస్తున్నట్లు బొత్స చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ తప్పిదం, తొందరపాటు చర్యగా అభిప్రాయపడుతున్నట్లు ఎమ్మెల్సీ చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటన జరగడం దురదృష్టకరమని, దాన్ని అందరం ఖండించినట్లు చెప్పుకొచ్చారు. తొక్కిసలాటలో మహిళ చనిపోవడంపై అల్లు అర్జున్ సైతం స్పందించారని, ఆయనా ఆవేదన వ్యక్తం చేశారని బొత్స చెప్పారు.
అరెస్టులో రాజకీయ కోణం..
తొక్కిసలాట జరిగిన రోజు పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలని బొత్స సత్యనారాయణ కోరారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని హితవు పలికారు. నాయకుల ఒత్తిడి వల్లే పోలీసుల రియాక్షన్ ఉంటుందని బొత్స అన్నారు. ఇప్పుడు జరిగిన ఘటన పోలీసుల వైఫల్యం ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. చట్టాలు అందరికీ సమానమే అని బొత్స అన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట మీద ఎవరిని పాయింట్ అవుట్ చేశామని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వాలు సమన్వయం పాటించాలని, సందర్భాలను చూడాలని, దూరదృష్టితో ఆలోచించాలని బొత్స కోరారు. అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ సైతం స్పందించారు. అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అరెస్టు అనేది రాజకీయ కోణంలోనే జరిగినట్లు తాము భావిస్తున్నామని అమర్నాథ్ అన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 06:41 PM