Chairman GV Reddy : ఫైబర్‌నెట్‌ను ముంచేశారు!
ABN, Publish Date - Dec 25 , 2024 | 03:43 AM
ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌ను రూ.2,150 కోట్ల మేర గత యాజమాన్యం ముంచేసిందని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ నిధులు ఏమయ్యాయో .. ఎందుకోసం ఖర్చు చేశారో లెక్కాపత్రం లేదన్నారు.
గత ఐదేళ్లూ అరాచకం..అస్తవ్యస్తం
కార్పొరేషన్‌లో వేతనాలు తీసుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లలో పనులు
ఫోన్ ఆదేశాలు, వాట్సాప్ మెసేజ్‌లతో కొలువులు.. నియామక పత్రాలూ లేవు
410 అనధికార ఉద్యోగులను తొలగించాం
త్వరలో మరో 200 మందికీ ఉద్వాసన
తిరుపతిలో మాజీ ఎండీ హోటల్ నిర్మాణంపై ఆరా: ఫైబర్‌నెట్ చైర్మన్ జీవీ రెడ్డి
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌ను రూ.2,150 కోట్ల మేర గత యాజమాన్యం ముంచేసిందని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ నిధులు ఏమయ్యాయో .. ఎందుకోసం ఖర్చు చేశారో లెక్కాపత్రం లేదన్నారు. మంగళవారం జీవీరెడ్డి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌లో అరాచకం రాజ్యమేలిందన్నారు. ‘‘2014-19 మధ్యకాలంలో కేవలం 108 మంది ఉద్యోగులతో ఫైబర్‌నెట్ ప్రారంభమైంది. 2019-24 నాటికి 1,380 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. 2019 ముందు నెలకు 40 లక్షల మేర జీతభత్యాలకు చెల్లించారు. 2019 తర్వాత జీతాల పద్దు నాలుగు కోట్లకు చేరింది. ఆనాడు నియమ నిబంధనలు పాటించకుండా .. వైసీపీ నేతలు ఇచ్చిన ఫోన్ ఆదేశాలతోను, వాట్సాప్ మెసేజ్‌లతోను ఉద్యోగాలు ఇచ్చేశారు. చాలామందికి నియామక పత్రాలు కూడా లేవు. అటువంటి వారిలో 410 మందిని గుర్తించి, తొలగించాం. త్వరలో మరో 200 మంది అరాచక ఉద్యోగులను కూడా తొలగించనున్నాం. దీనిపై .. న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేస్తున్నాం’ అని తెలిపారు. ఫైబర్‌నెట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక .. సిబ్బంది నియామకాల తీరుపై ఆరా తీస్తే విస్మయపరిచే విషయాలు తెలిశాయన్నారు.
అదంతా చూస్తే.. తాను ఏపీఫైబర్‌నెట్ చైర్మన్‌నా లేక వైసీపీ చైర్మన్‌నా అనే సందేహం కలిగిందని వ్యాఖ్యానించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం.. ఎంపీ అవినాశ్‌రెడ్డి సిఫారసు.. లేదా వైసీపీ ముఖ్యనేతల ఆదేశాలతో ఫైబర్‌నెట్‌లో చేరామని సిబ్బంది చెబుతుంటే తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. ఎక్కడా లిఖిత పూర్వక సిఫారసులు లేవని తెలిపారు. ఇలాంటి అనామతు ఉద్యోగులను తొలగించడంతో పాటు.. వారి జీతభత్యాల చెల్లింపులకోసం కోట్లలో వ్యయం చేసి.. సంస్థకు నష్టం చేకూర్చినందుకు.. మాజీ ఎండీ మధుసూదనరెడ్డికి నోటీసు జారీ చేస్తామని తెలిపారు. అలాగే.. తిరుపతిలో ఆయన హోటల్ నిర్మించారంటూ జరుగుతున్న ప్రచారంపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. వ్యూహం సినిమా కోసం దర్శకుడు రాంగోపాల్‌వర్మ బృందానికి పంపిన లీగల్ నోటీసుకు 13 రోజుల్లో స్పందించాల్సి ఉంటుందన్నారు.
అక్కడ ఊడిగం.. ఇక్కడ వేతనం
వైసీపీ పాలించిన ఐదేళ్లూ ఫైబర్‌నెట్‌లో అరాచకం రాజ్యమేలిందనీ, నియామకాల నుంచి వేతనాల నిర్ణయం దాకా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని జీవీరెడ్డి అన్నారు. ‘‘కొందరు సిబ్బంది అప్పట్లో అధికార పార్టీ మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో పనిచేసేవారు. వేతనాలు మాత్రం ఫైబర్‌నెట్ నుంచి అందుకునేవారు. దీంతో ఫైబర్‌నెట్ దివాలా అంచులకు చేరుకుంది’’ అని తెలిపారు.
Updated Date - Dec 25 , 2024 | 03:43 AM