మామా అల్లుళ్ల సవాల్
ABN , Publish Date - May 07 , 2024 | 05:28 AM
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బంధువుల మధ్య సంగ్రామం జరుగుతోంది. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. ఆయనపై ఆయన మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ తరఫున తిరిగి పోటీచేస్తున్నారు.

ఆమదాలవలస పోరు రసవత్తరం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బంధువుల మధ్య సంగ్రామం జరుగుతోంది. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. ఆయనపై ఆయన మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ తరఫున తిరిగి పోటీచేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని ఆ పార్టీ తరఫున 1983,85 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు.
1989లో ఓడిపోయినా మళ్లీ 94, 99 ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవులు చేపట్టారు. 2009లో టీడీపీని వీడి ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ టీడీపీలోకి వచ్చి.. కొద్దినెలలకే వైసీపీలోకి వెళ్లారు. 2014లో కూన రవికుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో విజయం సాధించారు.
సీఎం జగన్ ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టారు. అయితే ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని తమ్మినేని అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఆమదాలవలస స్టేషన్‌కు కనీసం రోడ్డు కూడా వేయించలేకపోయారు. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇంతవరకు అతీగతీ లేదు.
మామ వద్ద రాజకీయాలు నేర్చుకుని..
తమ్మినేని సీతారాం అక్క కుమారుడే టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పొందూరు మండలంలో కూన రాజకీయంగా ఎదిగారు. మామ వద్ద రాజకీయాలు నేర్చుకుని.. తాను, తన సతీమణి పొందూరు మండలంలో పట్టుసాధించి.. మండల పరిషత్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2009లో తమ్మినేని ప్రజారాజ్యంలోకి వెళ్లగా.. రవికుమార్ టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా.. తమ్మినేని రెండో స్థానంలో నిలిచారు. 2014లో మామపై కూన విజయం సాధించారు. 2019లో తమ్మినేని మేనల్లుడిని ఓడించి స్పీకర్ అయ్యారు. నాటి నుంచి రవికుమార్‌పై కక్షసాధింపులు మొదలుపెట్టారు. ఏకంగా రౌడీషీట్ తెరిపించి, 20 కేసులు పెట్టి వేధించారు. అయినా రవికుమార్ వెనక్కితగ్గలేదు. మామకే మేకుగా మారి ఢీకొంటున్నారు.
- శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి
నియోజకవర్గ స్వరూపం..
(ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ మండలాలు)
మొత్తం ఓటర్లు 1,96,098
పురుషులు 96,179
మహిళలు 97,664
ట్రాన్స్‌జెండర్లు 15
కీలక సామాజిక వర్గాల ఓటర్లు..(సుమారుగా)
కళింగ-65 వేలు, కాపులు-44 వేలు, ఎస్సీలు-17 వేలు, వెలమ-12 వేలు, యాదవ-7 వేలు, పట్టుశాలి-4 వేలు
తమ్మినేని బలాలు..
జిల్లాలోనే సీనియర్ రాజకీయ నేత. అనుభవజ్ఞుడు. ఎన్నికల మేనేజ్‌మెంట్ తెలుసు.
బలహీనతలు..
అభివృద్ధిపై దృష్టిసారించకపోవడం. పనుల కోసం వచ్చినవారు కుటుంబ సభ్యులకు కప్పం కట్టాలని.. లేదంటే ఏ పనీ జరగదన్న ప్రచారం. వైసీపీలో వర్గాలు.. పార్టీ శ్రేణుల్లోనే ఆయనపై వ్యతిరేకత.. పొందూరు నాయకుడు సువ్వారి గాంధీ ఇండిపెండెంట్‌గా బరిలోకి.
కూన రవికుమార్ బలాలు..
కార్యకర్తల కోసం.. పార్టీ కోసం శ్రమించడం విషయంలో ముందు వరుసలో ఉంటారు. ఐదేళ్లు స్పీకర్‌ను ఢీకొట్టి.. గుర్తింపు పొందారు.
బలహీనతలు..
దుందుడుకుగా వ్యవహరించడం.. గెలిచేస్తామన్న ధీమా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం.. తన మాట వినని వారిని రాజకీయంగా దూరంపెట్టడం.