Hair Loss : మహిళల్లోనూ పెరుగుతున్న బట్టతల
ABN, Publish Date - Dec 02 , 2024 | 04:00 AM
బట్టతల అనగానే మొదట పురుషులే గుర్తొస్తారు. మహిళల్లో ఇది చాలా అరుదు. అయితే నేటి ఒత్తిళ్లతో కూడిన జీవన శైలిలో యువతులు, మహిళల్లోనూ బట్టతల సమస్య పెరుగుతున్నట్లు ముంబైకి చెందిన హెయిర్ స్పెషలిస్ట్ డాక్టర్ రచితా దురత్ తెలిపారు.
ఒత్తిళ్లతో కూడిన జీవన శైలితోనే సమస్యలు
పౌష్టికాహార లోపం, జన్యుపరమైన కారణాలూ
తొలి దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమే
జడ గట్టిగా వేసుకోవడం వల్ల కూడా ఇబ్బందే
గుంటూరు ఐఏ డీవీఎల్ సదస్సులో వక్తలు
గుంటూరు మెడికల్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బట్టతల అనగానే మొదట పురుషులే గుర్తొస్తారు. మహిళల్లో ఇది చాలా అరుదు. అయితే నేటి ఒత్తిళ్లతో కూడిన జీవన శైలిలో యువతులు, మహిళల్లోనూ బట్టతల సమస్య పెరుగుతున్నట్లు ముంబైకి చెందిన హెయిర్ స్పెషలిస్ట్ డాక్టర్ రచితా దురత్ తెలిపారు. గుంటూరులో జరుగుతున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, వెనిరియాలజీ, లెప్రాలజీ (ఐఏ డీవీఎల్) ఆంధ్రప్రదేశ్ శాఖ 43వ వార్షిక వైద్య సదస్సులో భాగంగా ఆదివారం జరిగిన ‘ఏపీ క్యుటికాన్ 2024’లో ఆమె పాల్గొన్నారు. ‘బట్టతల సమస్య పరిష్కారానికి ఆధునిక చికిత్సలు.. వాటి సామర్థ్యం’ అనే అంశంపై డాక్టర్ రచితా మాట్లాడుతూ.. పురుషులతో పోలిస్తే మహిళలకు జుత్తు రాలడం వంటి సమస్య తీవ్ర ఆందోళన కగిలిస్తుందన్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, పౌష్టికాహార లోపం, జన్యుపరమైన కారణాలతో మహిళల్లోనూ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్‌హెడ్ (బట్టతల) సమస్య ఏర్పడుతుందని తెలిపారు. టైట్‌గా లాగి జడ వేసుకోవడం వల్ల ట్రాక్షన్ ఎలఫేషియా అనే సమస్యతో తల ముందు భాగంలో జుత్తు రాలిపోయే ప్రమాదం ఉంటుందని ఆమె హెచ్చరించారు. మహిళల్లో బట్టతల సమస్యను తొలి దశలో గుర్తిస్తే కొంత వరకు నివారించ వచ్చని చెప్పారు.
గతంలో ట్రాపికల్ స్టెరాయిడ్స్ మందులు దీనికి వాడే వారని, మినాక్సిడిల్ ఔషధం తక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా బట్టతల, జుత్తు ఊడటం వంటి సమస్యలను నియంత్రించే అవకాశం ఉందని ఆమె వివరించారు. ఇంట్రా డెర్మల్ ఇంజెక్షన్స్, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్‌పీ) విధానాల్లో కూడా బట్టతలపై జుత్తు మొలిపించే అవకాశం ఉందని డాక్టర్ రచితా వెల్లడించారు.
కాగా, సోరియాసిస్ రోగుల్లో కీళ్ల నొప్పులు (సోరియాటిక్ ఆర్థరైటిస్) బారిన పడే అవకాశం ఉందో లేదో కొన్నేళ్ల ముందుగానే తెలుసుకొనేందుకు స్పెషల్ అలా్ట్రసౌండ్ పరీక్ష అందుబాటులోకి వచ్చిందని గుంటూరుకు చెందిన సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ కేఏ సీతారామ్ తెలిపారు. ఒకవేళ ఆర్ధరైటిస్ వచ్చే అవకాశం ఉందని ఈ పరీక్షలో నిర్ధారణ అయితే ముందుస్తు చికిత్సలతో కీళ్లనొప్పులు రాకుండా నివారించవచ్చని వివరించారు.
డాక్టర్ మాధవ రెడ్డి మాట్లాడుతూ చర్మంపై వేయించుకొనే పచ్చబొట్టులను లేజర్ చికిత్సతో తొలగించవచ్చన్నారు. ఆర్ జీరో, ఆర్ 20 టెక్నిక్స్‌తో పచ్చబొట్టును చెరిపేయవచ్చన్నారు. డాక్టర్ బీఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళల్లో అవాంఛిత రోమాలను, కాలిన మచ్చలను లేజర్‌తో తొలగించవచ్చన్నారు. అనంతరం సదస్సులో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. కాగా సదస్సులో ఐఏ డీవీఎల్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీకి చెందిన డీవీఎల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. 2025లో సంఘం రాష్ట్ర సదస్సు తిరుపతిలో జరుగుతుందని ఆయన ప్రకటించారు.
Updated Date - Dec 02 , 2024 | 04:01 AM