ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh : పదేళ్లయినా ఎక్కడి గొంగడి అక్కడే!

ABN, Publish Date - Jun 02 , 2024 | 03:42 AM

రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.

ఒక్క వాగ్దానమూ పూర్తికాని వైనం.. వెనుకబడిన జిల్లాలకు మొండిచేయి

డైలీ సీరియల్‌ను తలపిస్తున్న పోలవరం అంచనా వ్యయం కుదింపు

ఇరిగేషన్‌ కాంపోనెంట్‌కే నిధులిస్తామంటూ కేంద్రం మెలిక

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 2026 వరకు పెండింగ్‌

గ్రే హౌండ్స్‌ శిక్షణ కేంద్రానికీ బ్రేకు.. రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా, కడప ఉక్కు,

పారిశ్రామిక కారిడార్‌కు కూడా జగన్‌ విధానాలతో అంతులేని జాప్యం

నత్తనడకన విభజన హామీల అమలు

చట్టంలో భరోసా.. ఆచరణలో నిరాశ

రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు. ప్రత్యేక హోదాకు ముందే నో చెప్పింది. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన రైల్వే జోన్‌కు జగన్‌ సర్కారు భూములివ్వకుండా మోకాలడ్డింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అసోం, జమ్మూకశ్మీరుల్లో నియోజకవర్గ పునర్విభజన చేపట్టిన కేంద్రం.. మన రాష్ట్రంలో మాత్రం 2026 తర్వాతే చేస్తామని పక్కనపెట్టేసింది. చివరకు గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు కూడా నత్తనడకన సాగుతోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర విభజనతో అన్నీ కోల్పోయిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్థికంగా చేయూతనిచ్చి.. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు వీలుగా తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ లేదా విభజన చట్టం(2014), రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీల అమలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా మారింది. విభజన చట్టంలోని వివిధ నిబంధనల కింద, విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో విభజన తర్వాత ఏపీకి ఆర్థికంగా, అభివృద్ధిపరంగా అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఎన్నో హామీలున్నాయి.

అలాగే మన్మోహన్‌ రాజ్యసభలో మరిన్ని వాగ్దానాలు చేశారు. వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, అసెంబ్లీ స్థానాల పెంపు, గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు, పలు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజపట్నం పోర్టు నిర్మాణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌.. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు, వనరుల మధ్య అంతరాన్ని భర్తీ చేయడం, నూతన రాజధాని నగరానికి కేంద్రసాయం, గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం, క్రూడాయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుతో పాటు పలు పన్ను ప్రోత్సాహకాలు ఆయా హామీల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని పాక్షికంగా, కొన్ని నామమాత్రంగా అమలయ్యాయి. పూర్తిగా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. నత్తనడకనే సాగుతున్నాయి.


  • పోలవరం జాతీయ ప్రాజెక్టు..

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఏడు మండలాలను తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోనే ఉంచి రాష్ట్రాన్ని విభజించారు. దీనిపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరం తెలపడంతో మళ్లీ 2014 జూలై 17న గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా విభజన చట్టాన్ని సవరించి పోలవరం ముంపు మండలాలను నవ్యాంధ్రలో విలీనం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా రిజర్వాయర్‌, స్పిల్‌వే, విద్యుదుత్పత్తి కేంద్రం అనే 3 భాగాలున్నాయి. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్చడం, నిర్వహణ, కేంద్రసాయం లాంటి అంశాలను విభజన చట్టంలోని సెక్షన్‌ 90లో పేర్కొన్నారు.

సెక్షన్‌ 90(1) ప్రకారం.. దీనిని జాతీయప్రాజెక్టుగా ప్రకటించారు. సెక్షన్‌ 90(2) ప్రకారం ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నిర్వహణ, నియంత్రణ, అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి. సెక్షన్‌ 90(3) ప్రకారం.. పోలవరం నిర్మాణానికి కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లే భావించాలి. సెక్షన్‌ 90(4) ప్రకారం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టడంతో పాటుగా దానికి అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతులు, పునరావాసం సమకూర్చే బాధ్యతలన్నీ తానే తీసుకోవాలి.

2014 ఏప్రిల్‌ 29 నాటి కేంద్ర కేబినెట్‌ నోట్‌ ప్రకారం.. ప్రస్తుత సత్వర నీటిపారుదల ప్రయోజనాల కార్యక్రమం (ఏఐబీపీ) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రప్రభుత్వమే ప్రాజెక్టు బాధ్యతలను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 2010-11 లెక్కల ప్రకారం రూ.16,010.45 కోట్లు కాగా.. ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి పెరిగే అదనపు ఖర్చులు, భూసేకరణ, ఆయకట్టు అభివృద్ధి పనులు, ముంపు బాధితులకు మెరుగైన పరిహారం వంటివన్నీ, భూసేకరణ, పునరావాస చట్టం -2013 ప్రకారం ఎప్పటికప్పుడు పెరుగుతాయని కూడా నోట్‌లో ఉంది. దీనిని 2014 మే 1వ తేదీన కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2017-18 నాటిధరల ప్రాతిపదికపై రూ.57,297 కోట్లుగా సవరించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి సమర్పించింది.


సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) సూచనలతో అంచనా వ్యయాన్ని రెండోసారి సవరించి రూ.55,548 కోట్లుగా పేర్కొంది. టీఏసీ ఆ ప్రతిపాదనను ఆమోదిస్తూనే కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ పరిశీలనకు పంపింది. 2020 మార్చిలో అంచనా వ్యయాన్ని రూ.46,257 కోట్లకు కుదించి ఆమోదించింది. దీనిపై జగన్‌ సర్కారు అభ్యంతరం వ్యక్తంచేయకపోగా చప్పట్లు కొట్టి మరీ సంతకాలు పెట్టివచ్చింది. తర్వాత 2013-14 నాటి అంచనాల్లోని తాగునీటి అంశాన్ని, విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని తాము పరిగణనలోకి తీసుకోబోమని, ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మాత్రమే పూర్తిచేస్తామంటూ.. అంచనా వ్యయాన్ని రూ.20,418 కోట్లకు పరిమితం చేసింది.

2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం విభజన చట్టంలోని సెక్షన్‌ 90(4) స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటేనే నీటిపారుదల, తాగునీరు, విద్యుదుత్పత్తి ఉంటాయి. దేశంలోని జాతీయ ప్రాజెక్టులన్నింటిలోనూ ఇవే ఉంటాయి. పోలవరం విషయంలో అందుకు భిన్నంగాఇరిగేషన్‌ వ్యయానికి మాత్రమే నిధులు మంజూరు చేస్తామంటోంది. జగన్‌ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం రూ.8,240 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం అందులో కేవలం రూ.5,825 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన రూ.2415 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారు.

  • అసెంబ్లీ స్థానాల పెంపు

విభజన చట్టంలోని సెక్షన్‌ 26(1) ప్రకారం.. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని నియమాలకు అనుగుణంగా.. విభజన చట్టంలోని సెక్షన్‌ 15లోని నిబంధనలు దాటకుండా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాల సంఖ్యను 175 నుంచి 225కు పెంచాలి. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను నిర్ధారిస్తుంది. ఈ హామీని అమలుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 29న కేంద్ర హోం శాఖను కోరింది.

నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2017 జూలై 24న ప్రధానికి లేఖ రాశారు. దీనిపై 2018 డిసెంబరు 19న పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పందించింది. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 2026 తర్వాత చేపట్టే జనాభా లెక్కల కార్యక్రమం తర్వాతే ఉంటుందని సమాధానమిచ్చింది. దీంతో అది కూడా పెండింగ్‌లో పడిపోయింది.


  • వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ

విభజన చట్టంలోని సెక్షన్‌ 46(2), 46(3), 94(2)ల్లో ఈ హామీ పొందుపరిచారు. విభజన బిల్లుపై 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో చర్చ సందర్భంగా వెనుకబడిన జిల్లాల విషయం ప్రస్తావనకు వచ్చింది. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమలోని నాలుగు జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని బిల్లులో చేరుస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌ హామీ ఇచ్చారు.

ఈ ప్యాకేజీ ఒడిసాలోని కోరాపుట్‌-బోలంగీర్‌-కలహండి ప్రత్యేక ప్రణాళిక.. మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రత్యేక ప్యాకేజీ తరహాలో ఉండే విధంగా విభజన చట్టాన్ని సవరించాలని నవ్యాంధ్రలో ఏర్పాటైన తొలి ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

7 జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ కోరుతూ 2014 అక్టోబరు 16న కేంద్ర ప్రణాళికా సంఘానికి నివేదిక సమర్పించింది. అయితే కేంద్రం మాత్రం నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్ల చొప్పున ఏడేళ్లపాటు (2014-15 నుంచి 2020-21 వరకు) మొత్తం రూ.1,750 కోట్లను ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీగా ఇచ్చింది. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ కింద వెనుకబడిన ప్రాంతాలకు తలసరి రూ.4,115 లెక్కన కేటాయించిన కేంద్రం ఏపీకి రూ.426 మాత్రమే ఇచ్చింది.

  • గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సాయం..

వామపక్ష తీవ్రవాద సమస్య ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర విభజనతో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం లేకుండా పోయింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 9(2)లో హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ కేంద్రమే ఉమ్మడి శిక్షణ కేంద్రంగా ఉంటుందని పేర్కొనడంతో సమస్య మరింత జఠిలమైంది. అందులోని సెక్షన్‌ 9(3) ప్రకారం.. ఏపీలో రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన చోట గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సాయం చేస్తుందని ఉంది.

దీనిప్రకారం గత రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు డివిజన్‌లో భూమిని ఎంపికచేసింది. గ్రేహౌండ్స్‌కు మౌలిక సదుపాయాలు, శిక్షణ సౌకర్యాల ఏర్పాటుకు రూ.858.37 కోట్లతో కేంద్ర హోం శాఖకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. కేంద్రం ఏపీలో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటును ఆమోదిస్తూ 2018 ఏప్రిల్‌లో రూ.219.16 కోట్లు మంజూరు చేసింది. చివరకు రూ.9 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఆ ప్రతిపాదన ఇంకా పట్టాలెక్కలేదు.

జగన్‌ సర్కారు మూడు రాజధానుల ముచ్చట మొదలుపెట్టాక.. 2020 జూన్‌లో విశాఖపట్నం జల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామం పరిధిలో గ్రేహౌండ్స్‌ శిక్షణ సంస్థ ఏర్పాటుకు 385 ఎకరాలను గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 నవంబరు 14న జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఈ అంశంపై కేంద్రం స్పందించింది.

కొత్తగా ఏర్పాటయ్యే గ్రేహౌండ్స్‌ కేంద్రంలో భారత ప్రభుత్వ ఏజెన్సీలకు 50 శాతం ట్రైనింగ్‌ స్లాట్లకు కేటాయించాలని, ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తేనే ఖర్చు భరిస్తామని మెలిక పెట్టింది. దీనిపై సవరించిన ప్రతిపాదనను జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి పంపింది.

Updated Date - Jun 02 , 2024 | 08:12 AM

Advertising
Advertising