Share News

YS Jagan: జగన్‌ ఇంటిగుట్టు!

ABN , Publish Date - Jun 16 , 2024 | 03:28 AM

ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు ఆఫీసుగా మార్చేసుకొని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు.

YS Jagan: జగన్‌ ఇంటిగుట్టు!

  • తాడేపల్లి ప్యాలెస్‌కు జనం సొమ్ముతో సోకులు

  • రాజభోగాలకు ఐదేళ్లలో45 కోట్లు

  • ఏసీల కోసం రూ.1.5 కోట్లు..

  • ఆలయాల సెట్టింగ్‌లకు రూ.1.45 కోట్లు

  • టేబుళ్లు, ఇతర ఫర్నీచర్‌కు 1.37 కోట్లు..

  • సోఫాలు, కుర్చీలు, ఇతరత్రా 4.5 కోట్లు

  • వీడియో, టెలీకాన్ఫరెన్స్‌లకు 3.45 కోట్లు..

  • కిటికీలు, తలుపులకు 73 లక్షలు

  • ఇంటినే క్యాంప్‌ ఆఫీసుగా మార్చి హంగామా

  • ఆర్‌అండ్‌బీ ద్వారా గుట్టుగా కోట్ల ఖర్చు

  • జీఓలు, ఇతర ఆదేశాలన్నీ రహస్యం

  • హెలిప్యాడ్‌, ఆలయాల సెట్టింగ్‌లు

  • ఫర్నీచర్‌ ఇవ్వలేదని గతంలో కోడెలకు వేధింపులు

  • ఇప్పుడు పదవి పోయినా వదలని వైనం

  • ఇంకా సొంత ఆస్తిలా అనుభవిస్తున్న జగన్‌

  • ప్యాలెస్‌ గుట్టును కొత్త ప్రభుత్వం విప్పుతుందా?

జగన్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. ఎన్నికల్లో ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో కనీసం ప్రతిపక్ష నేతహోదా కూడా రాదు. ఆయన ఇప్పుడు ఓ ఎమ్మెల్యే మాత్రమే. అయినా ఇంకా ఆ రాజభోగాలను అనుభవిస్తూనే ఉన్నారు. గతంలో మాజీ స్పీకర్‌ కోడెల సొంతానికి ఫర్నీచర్‌ వాడుకున్నారని ఆయన్నువేధించారు. మరి ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో జల్సా చేస్తున్న జగన్‌ను ఏం చేయాలి? అడ్డగోలుగా ఖర్చుచేసిన అధికారులను ఏం చేయాలి? గత ప్రభుత్వంలో అధికారులు నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించి మరీ జగన్‌ ప్యాలె్‌సకు కోట్లు ఖర్చు చేశారు. అక్కడున్న పేదలను తరిమేసి మరీ ఆయనకు రాజభోగాలు కల్పించారు. ఖర్చు చేసిన ఆ 45 కోట్లతో ముఖ్యమంత్రికి శాశ్వత ఆధునిక భవనాన్ని నిర్మించవచ్చు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు ఆఫీసుగా మార్చేసుకొని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు. కానీ ఆడంబరాల పేరిట జగన్‌ తన ఇంటి పరిసరాలను, ఇంట్లోని మౌలిక వసతులను అత్యంత ఖరీదైనవిగా మార్చుకున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదే... 2019లో రోడ్లు భవనాల శాఖ ఆయన ఇంటికి అదనపు ఏర్పాట్ల పేరిట 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 2020లో మరో 10 కోట్లు ఖర్చు పెట్టింది. తన ఇంటిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై బయట చర్చ జరుగుతోందని భావించిన జగన్‌ నిధుల విడుదలకు సంబంధించిన జీవోలు బయటకు రాకుండా చేశారు. దీంతో తాడేపల్లి ఇంటిపై పెట్టిన 28 కోట్ల రూపాయల ఖర్చులో 13 కోట్లకు సంబంధించిన జీఓలు ఇవ్వలేదు.


YS-Jagan-House-Tadepalli.jpg

వీవీఐపీ సెక్యూరిటీ ఏర్పాట్ల పేరిట ఆర్‌అండ్‌బీతో అడ్డగోలుగా నిధులు ఖర్చు పెట్టించారు. 2022లో 8 కోట్లు, 2023లో 6 కోట్లు, ఆయన హయాంలో చివరి ఏడాది 2024లో 3.50 కోట్లు ఖర్చు చేశారు. తాడేపల్లి ప్యాలె్‌సలో వివిధ రకాల హంగులు, ఆర్భాటాలు, సెట్టింగుల పేరిట ఆర్‌అండ్‌బీతో ఈ మేరకు వ్యయం చేయించిట్లు తెలిసింది. నిధులు భారీగా ఖర్చు పెట్టడానికి నిబంధనలు, మార్గదర్శకాలు అడ్డున్నా ముఖ్యమంత్రి కావడంతో అధికారులు అత్యుత్సాహం చూపారు. సీఎం ఇంటిచుట్టూనే మరో ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నం చేయడం కోసం గత ఐదేళ్ల కాలంలో మొత్తం 45.54 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇందులో 15 కోట్ల వ్యయానికే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన వ్యయానికి సంబంధించి మెమో, ఇతర రూపాల్లో ఉత్తర్వులు ఇచ్చి నిధులు మంచినీళ్లప్రాయంలా ఖర్చు పెట్టారు. ఖరీదైన సోఫాలు, కుర్చీలు, వీడియో, టెలీకాన్ఫరెన్స్‌ పరికరాలు, ప్లాస్మా, 85 ఇంచుల ఓఎల్‌ఈడీ టీవీలు, ప్రీమియం కేటగిరీకి చెందిన ఆపిల్‌ కంప్యూటర్లు, ఇతర సామగ్రిని క్యాంపు ఆఫీసుకు సమకూర్చిపెట్టారు.

YS-Jagan-On-Chair.jpg

అడ్డగోలుగా ఖర్చు

తాడేపల్లిలో జగన్‌ నివాసం కొత్తదే. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే ఎన్నికల ముందు 2019లో గృహప్రవేశం చేశారు. కోట్లాది రూపాయల వ్యయంతో అందమైన ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. అదే ఏడాది అధికారంలోకి వచ్చాక తన ఇంటిని క్యాంపు ఆఫీసుగా మార్చుకున్నారు. ఆ తర్వాత మూడు రాజధానుల డ్రామాను తెరమీదకు తీసుకొచ్చారు. అమరావతిలోని సచివాలయానికి వెళ్లకుండానే ఇంటినే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చేశారు. జగన్‌ ఆదేశాలతో ఆయన నివాసం, క్యాంపు ఆఫీసు, దాని పరిసరాలను అభివృద్ధి చేసేందుకు నాటి ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఇంజనీరింగ్‌ అధికారులు ఎక్కడాలేని ఉత్సాహం కనబరిచారు. జగన్‌ చెప్పినవి, చెప్పని పనులు కూడా చేసి పెట్టారు. జగన్‌ కూడా తనకు ఎక్స్‌ట్రార్డినరీ సరంజామా ఉండాలని షరతులు విధించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి సూచనతో నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కనపెట్టి అడ్డగోలుగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టారు. నిజానికి ముఖ్యమంత్రి నివాసానికి భద్రత నిమిత్తం, ఇతర అవసరాల పేరిట ఎంత ఖర్చు చేయాలన్నదానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే ఆర్‌అండ్‌బీలో చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి జగన్‌ సేవలో తరించిపోయారు. బిల్డింగ్‌ విభాగంలో ఉన్న సొమ్మంతా ఊడ్చేశారు. వీవీఐపీ ఏర్పాట్ల పేరిట గుట్టుగా ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన తర్వాత ఆర్‌అండ్‌బీకి వచ్చిన ఓ జూనియర్‌ అధికారి కూడా జగన్‌ సేవలో తరించేందుకు తాపత్రయపడ్డారు. జగన్‌ తన తాడేపల్లి ప్యాలెస్‌ నిర్మాణం కోసం ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ ఇంటికి అదనపు హంగులు, రక్షణ ఏర్పాట్లు, సెట్టింగ్‌ల పేరిట ప్రభుత్వం 45.54 కోట్లపైనే ఖర్చు పెట్టింది.


YS-Jagan-Sad.jpg

ఇంకా జగన్‌ ఆధీనంలోనే..

జగన్‌ ఇప్పుడు అధికారంలో లేరు. ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కనీసం ప్రతిపక్షహోదా దక్కించుకునే సీట్లు కూడా జగన్‌కు రాలేదు. దీంతో ఆయన ప్రతిపక్షనేత కూడా కాదు. సాధారణ ఎమ్మెల్యేగానే ఉండాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌, పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌క్వాలిఫికేషన్స్‌ యాక్ట్‌-1953 ప్రకారం జగన్‌ తన ఇంట్లో, క్యాంపు ఆఫీసులో ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చుకున్న చరాస్తులన్నింటిని వెనక్కి ఇచ్చేయాలి. వాటిని సొంత ఆస్తులుగా వాడుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఏ వస్తువునూ తన వద్ద ఉంచుకోకూడదని చట్టంలోని రెండో క్లాజులో స్పష్టంగా ఉంది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడుస్తున్నా జగన్‌ ప్రభుత్వ ఆస్తితో జల్సా చేస్తున్నారు. కోట్లు విలువచేసే ఫర్నీచర్‌, టెక్నికల్‌, డిజిటల్‌ ఎక్వి్‌పమెంట్‌, ఇతర పరికరాలను ఆయన వాడుకుంటున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన మీటింగ్‌లు పెట్టుకొని వాటిని వాడుకుంటున్నారు. విలువలు, పద్ధతుల గురించి పదేపదే ఉపన్యాసాలు ఇచ్చే జగన్‌కు.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచన రాలేదా? పార్టీ ఆఫీసును మూసేసి, క్యాంపు ఆఫీసు వేదికగా ప్రభుత్వ వనరులను వాడుకోవడంపై రాజకీయ పార్టీలు, ప్రజలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు.

ఖర్చుల పద్దు ఇదీ

  • కొత్తగా నిర్మించిన జగన్‌ ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు రూ.73 లక్షలు ఖర్చు చేశారు.

  • జగన్‌ 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆయన నివాసం వద్ద 3.66 మీటర్ల రహదారి (పొడవు 1.33 కి.మీ.)ని 10 మీటర్లు వెడల్పు చేసేందుకు రూ.5 కోట్లు ఖర్చు చేశారు.

  • జగన్‌ రక్షణ కోసం ఆయన ఇల్లు, పరిసరాల్లో తదుపరి చర్యలకు 1.89 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంటి వద్దే ప్రత్యేక హెలీప్యాడ్‌, దానికి ఫెన్సింగ్‌, అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణం కోసం రూ.40 లక్షలు, హెలీప్యాడ్‌ వద్ద గార్డ్‌

    రూమ్‌, ఇతర సదుపాయాల కోసం రూ.13.50 లక్షలు, సీఎం నివాసం వద్ద పర్మినెంట్‌ బ్యారికేడింగ్‌ ఏర్పాటుకు రూ.75 లక్షలు, సీఎం ఇంటికి సమీపంలోనే పోలీస్‌బారెక్‌ సదుపాయాలకోసం రూ.30 లక్షలు,సెక్యూరిటీ పోస్ట్‌, సెక్యూరిటీ గేట్లు, క్యాబిన్‌ల ఏర్పాటుకు రూ.31 లక్షలు ఖర్చు చేశారు.

  • అత్యాధునిక విద్యుత్‌ వ్యవస్థ, లైట్లు, సీసీటీవీ సదుపాయం, యూపీఎస్‌ ఏర్పాటు కోసం రూ.3.63 కోట్లు ఖర్చు పెట్టారు. అత్యాఽధునిక విద్యుత్‌ టాన్స్‌ఫార్మర్‌, హెచ్‌టీ లైన్‌, ఆధునిక లైటింగ్‌ సిస్టమ్‌కు అదనంగా మరో 97 లక్షలు కేటాయించారు.


  • అత్యాధునిక ఏసీల ఏర్పాటుకు కోటిన్నర ఖర్చు పెట్టారు. జగన్‌ ఇంటితో పాటు క్యాంపు ఆఫీసు బయట

    లైటింగ్‌ కోసం రూ.11.50 లక్షలు ఖర్చు చేశారు. హైదరాబాద్‌ సచివాలయంలోని ఎల్‌బ్లాక్‌లో ఉన్న

    యూపీఎ్‌సను తొలగించి దాన్ని జగన్‌ ఇంట్లో ఏర్పాటు చేశారు. ఇందుకు 11 లక్షలు ఖర్చు చేశారు.

  • ప్రజాదర్బార్‌ ఏర్పాటు పేరిట 82.50 లక్షలు కేటాయించారు. అయితే ఆ నిధులను ఇతర అవసరాలకు

    ఖర్చు పెట్టినట్లు తెలిసింది.

  • క్యాంపు ఆఫీసులో తాత్కాలికంగా పీవీసీ రూఫ్స్‌ (షెడ్లు), మొబైల్‌ టాయిలెట్స్‌, కూలర్‌ల కొనుగోలుకు

    రూ.22.50 లక్షలు ఖర్చుపెట్టారు.

  • భద్రత చర్యల్లో భాగంగా వ్యూకట్టర్‌ ఏర్పాటు పేరిట ప్రైవేటు భూమిని సేకరించారు. ఈ భూమికి

    పరిహారంగా 3.25 కోట్లు విడుదల చేశారు.

  • క్యాంపు ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్స్‌, టెలీకాన్ఫరెన్స్‌ సిస్టమ్‌ల కోసం 3.45 కోట్లు ఖర్చు

    పెట్టారు. 85 ఇంచీల ఓఎల్‌ఈడీ టీవీల కొనుగోలుకు కోటిన్నరదాకా ఖర్చుపెట్టినట్లు తెలిసింది.

  • ఐప్యాడ్‌లు, ల్యాప్‌టా్‌పలు, ఇతర డిజిటల్‌ ఎక్వి్‌పమెంట్‌ కోసం మరో 45 లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు

    పెట్టినట్లు సమాచారం.

  • క్యాంపు ఆఫీసు, ఇంట్లో అవసరాల నిమిత్తం వీవీఐపీ ఏర్పాట్ల పద్దు కింద 4.5 కోట్ల విలువైన సోఫాలు,

    కుర్చీలు, రిక్లైనర్‌లు, లాంజ్‌ సోఫాలు సమకూర్చినట్లుగా ఆర్‌అండ్‌బీ అధికార వర్గాలు చెబుతున్నాయి.

  • క్యాంపు ఆఫీసు పరిధిలో జరిగే సమావేశాల కోసం 1.37 కోట్ల విలువైన టేబుల్స్‌, ఇతర ఫర్నీచర్‌ను

    సమకూర్చినట్లుగా ఆర్‌అండ్‌బీ లెక్కలు చెబుతున్నాయి.

  • ఆలయాల సెట్టింగ్‌ల పేరిట 1.45 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.

  • క్యాంపు ఆఫీసులో కళాప్రదర్శనలు, ఇతర ఆర్భాటాల పేరిట 1.67 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

జగన్‌ ఇంటి చుట్టూ ఉన్న రహదారిని విస్తరించడం కోసం పేదల ఇళ్లను ఖాళీ చేయించారు. వారికి

పరిహారం కింద 7.67 కోట్ల రూపాయలను ఆర్‌అండ్‌బీతో ఇప్పించారు.

ప్రభుత్వం గుట్టు విప్పుతుందా?

జగన్‌ తాడేపల్లి ప్యాలె్‌సపై గత ప్రభుత్వం 45.54 కోట్లు ఖర్చు చేసిందని అంచనా. వాస్తవంలో ఈ లెక్క మరింత ఉండే అవకాశం ఉందని సీనియర్‌ అధికారులే చెబుతున్నారు. ఆ ఖర్చుతో ప్రభుత్వమే సొంతంగా ముఖ్యమంత్రి కోసం ఓ అద్భుతమైన నివాసం నిర్మించే అవకాశం ఉంది. అయితే జగన్‌ కోరారని అధికారులు అడ్డగోలుగా ఖర్చు పెట్టారు. కొత్త ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిపెట్టాలని సీనియర్‌ అధికారులు కోరుతున్నారు. సీఎం క్యాంప్‌ ఆఫీసుకు నిబంధనల ప్రకారం ఎంత ఖర్చు చేయాలి? జగన్‌ ప్రభుత్వంలో ఎంత ఖర్చు పెట్టారు? అన్న విషయాన్ని నిగ్గుతేల్చాలని కోరుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ప్రజాధనాన్ని ఏ మేరకు దుర్వినియోగం చేశారో గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తుందా?

Updated Date - Jun 16 , 2024 | 09:23 AM