Amaravati : అదానీ కోసం దోచిపెట్టారు
ABN, Publish Date - Jul 08 , 2024 | 05:30 AM
పట్టణ ప్రాంతాల్లో 24.4 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించే బాధ్యతను అదానీ సంస్థకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అప్పగించారు.
జనంపైనే స్మార్ట్ మీటర్ల భారం
24.4 లక్షల గృహాలపై రూ.73 కోట్లు.. 9.2 లక్షల పారిశ్రామిక
మీటర్లపై 456 కోట్లు.. మొత్తం రూ.529 కోట్ల దోపిడీ
వ్యవసాయ పంపుసెట్ల మీటర్లు షిర్డీసాయికి
అదానీకేమో పట్టణ స్మార్ట్ మీటర్లు.. ధరకు మించి వసూలుకు సిద్ధం
ఈ దోపిడీపై సీఎం దృష్టిపెట్టాలని విద్యుత్ నిపుణుల డిమాండ్
గృహాలు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించడంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమైనా జగన్ సర్కారు పట్టించుకోలేదు. అదానీకి జనం సొమ్మును దోచిపెట్టేందుకు పెద్ద స్కెచ్ వేసింది. పట్టణ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల బిగింపు వ్యవహారంలో ఆ సంస్థకు రూ.529 కోట్లను దోచిపెట్టేందుకు సిద్ధమైంది. ఆ మొత్తాన్ని జనం నుంచే వసూలుచేసి ఇవ్వడానికి డిస్కంలు పూనుకున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పట్టణ ప్రాంతాల్లో 24.4 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించే బాధ్యతను అదానీ సంస్థకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అప్పగించారు. రాష్ట్రంలో సహజ వనరులు, పోర్టులు సహా ఇతర కాంట్రాక్టులన్నీ అదానీకే కట్టబెట్టారు. అదే దారిలో.. ఇప్పటికిప్పుడు అవసరం లేకున్నా.. విద్యుత్ పంపిణీ నష్టాల నివారణ పేరిట రాష్ట్రంలో వ్యవసాయ, గృహ, పారిశ్రామిక రంగాల్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్రం రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ సిస్టమ్ (ఆర్‌డీఎ్‌సఎస్) పథకం కింద స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయమందన్న సాకు చూపి .. హడావుడిగా టెండర్లు పిలిచారు. ఇందులో కూడా.. ఓపెన్ యాక్సిస్ విధానంలో కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎ్‌ఫసీ)లో నమోదైన విద్యుత్ మీటర్ల తయారీ సంస్థలు మాత్రమే బిడ్‌లో పాల్గొనేలా నిబంధనలు పెట్టారు. జగన్‌కు సన్నిహితులైన అదానీ, షిర్డీ సాయి సంస్థలు పీఎ్‌ఫసీలో ఎన్‌రోల్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఎన్‌రోల్ కాని మీటర్ల ఉత్పత్తిదారులెవరూ బిడ్‌లో పాల్గొనకుండా చేశారు. ఈ బిడ్డింగ్‌పై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చినా గుట్టుగా చక్కబెట్టేశారు. బిడ్లు వేసిన రెండు సంస్థల మధ్య మధ్యవర్తిత్వం నెరపి.. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే బాధ్యతను షిర్డీసాయికి.. పట్టణ ప్రాంతాల్లో గృహాలు, పారిశ్రామిక సంస్థలకు స్మార్ట్ మీటర్లను బిగించే బాధ్యతలను అదానీకి కట్టబెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మీటర్లకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో గృహాలకు బిగించే 24.4 లక్షలు, పరిశ్రమలకు చెందిన 9.2 లక్షల స్మార్ట్ మీటర్ల భారం మాత్రం విద్యుత్ వినియోగదారులపైనే వేశారు.
పట్టణ వినియోగదారులపై భారం..
గృహాలకు బిగించే స్మార్ట్ మీటర్ ధరను రూ.2,900గా డిస్కంలు ఖరారు చేశాయి. ఇందులో రూ.900ను ముందస్తుగా ఒక్కో వినియోగదారుడి నుంచి నెలవారీ బిల్లుతో పాటు వసూలు చేస్తాయి. మిగిలిన రూ.2,000ను 93 నెలవారీ వాయిదాల్లో వసూలు చేయాలని నిర్ఱయించాయి. నెలకు రూ.86 చొప్పున 93 నెలల్లో రూ.7,998 చొప్పున వసూలు చేస్తాయి. విద్యుత్ మీటర్ల ఆపరేషన్స్ కోసం నెలకు రూ.50 చొప్పున 93 నెలల పాటు వసూలు చేసే రూ.4,650 ఇందులోనే ఉంటుంది. అంటే రూ.7,998 నుంచి ఆపరేషన్ చార్జీలు తీసేస్తే రూ.2,304 మిగులుతుంది. మీటరు అసలు ధర రూ.2,900లో రూ.900ని ముందే వసూలు చేస్తారు. మిగతా 2 వేలను మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా.. రూ.2,304 వసూలు చేసేయాలని నిశ్చయించారు. అంటే.. ఒక్కో మీటరుపై రూ.304 ఎక్కువ. మొత్తంగా 24.4 లక్షల మీటర్లపై లెక్కిస్తే రూ.73 కోట్లు అధికంగా డిస్కంలు వసూలు చేసి అదానీకి లబ్ధి చేకూర్చనున్నాయి.
పరిశ్రమలపై రూ.456 కోట్లు..
గృహ వినియోగ స్మార్ట్ మీటరు ధర రూ.2,900 కాగా.. పారిశ్రామిక మీటరుకు రూ.4,000గా నిర్ణయించారు. ఈ మీటర్లకు కూడా రూ.900ను అడ్వాన్సుగా తీసుకుంటారు. మిగతా రూ.3,100ను 93 నెలసరి వాయిదాల్లో వసూలు చేస్తారు. నెలకు రూ.176 చొప్పున 93 నెలల పాటు రూ.16,368 వసూలు చేస్తారు. ఇందులో ఆపరేషన్ చార్జీల మొత్తం 4,650 (నెలకు రూ.50 చొప్పున 93 నెలలు) తీసివేస్తే రూ.8,066 మిగులుతుంది. మీటరు వాస్తవ ధర రూ.4,000 నుంచి అడ్వాన్సుగా చెల్లించిన రూ.900 తీసేస్తే .. ఇంకా రూ.3,100 మాత్రమే చెల్లించాలి. కానీ రూ.8,066 వసూలు చేయాలని నిర్ణయించారు. అంటే.. పరిశ్రమల నుంచి అదనంగా రూ.4,966 వసూలు చేస్తారు. ఈ లెక్కన 9.2 లక్షల పారిశ్రామిక మీటర్లపై రూ.456 కోట్లు అదనంగా వసూలు చేస్తారన్న మాట. గృహ విద్యుత్ స్మార్టు మీటర్లపై వసూలు చేసే రూ.73 కోట్లను కూడా కలిపితే ఏకంగా 529 కోట్లను అధికంగా వసూలు చేసి అదానీకి కట్టబెట్టాలని డిస్కంలు నిర్ణయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వసూళ్లపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించాలని విద్యుత్ రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Jul 08 , 2024 | 05:30 AM